సస్యరక్షణ పాటిస్తే మంచి దిగుబడులు
రైల్వేకోడూరు అర్బన్ : మామిడి రైతులు సస్యరక్షణలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు బుధవారం పేర్కొన్నారు. స్థానిక అనంతరాజుపేట వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో మామిడి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మామిడి పిందె నిలబడటంపై సస్యరక్షణ, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడిలో అధిక దిగుబడులు పొందేందుకు సమగ్ర పోషణ, నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. అలాగే రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడాలని సూచించారు. ప్రారంభ దశలో తేనెమంచు పురుగు నివారణకు వేపనూనె, అజాడిరెట్టీన్ జిగురు మందు అధికారుల సూచనల మేరకు పిచికారీ చేయాలన్నారు. మామిడి పిందెలు రాలుతున్నప్పుడు అధికారుల సూచనల మేరకు ప్లానోఫిక్ మందు 500 లీటర్లకు 100 ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. మామిడి కాయలకు ఉపయోగించే కవర్లు సబ్సిడీతో అందిస్తున్నామని, కావాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెగుళ్ల నివారణ శాస్త్రవేత్త సందీప్ నాయక్, రాజంపేట ఉద్యాన అధికారులు వెంకటభాస్కర్, సురేష్ బాబు, సుధాకర్, రైతులు పాల్గొన్నారు.


