కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Mar 17 2025 3:03 AM | Updated on Mar 17 2025 11:24 AM

రైల్వేకోడూరు అర్బన్‌ : రైల్వేకోడూరు మండలం, బుడుగుంటపల్లి పంచాయతీ, రైల్వేస్టేషన్‌ సమీపంలో అనంతపురం దొనగిరికి చెందిన లక్ష్మీనారాయణ (35) అనే యువకుడు విద్యుత్‌ హై టెన్షన్‌ స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. రెండేళ్ల క్రితం రైల్వేకోడూరుకు బేల్దారీ పనులు చేసుకునేందుకు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి బాలానగర్‌లో నివాసం ఉండేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ యువకుడు ఉరివేసుకున్నాడు. దీంతో కుటుంబమంతా వీధిన పడింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మోటారు వైర్లు చోరీ

రాజంపేట రూరల్‌ : మండల పరిధిలోని ఆకేపాడు గ్రామ పంచాయతీలో శనివారం రాత్రి బోర్‌ వైర్‌ కేబుళ్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. రాయచోటికి వెళ్లే దారిలో ఉన్న వీరంరెడ్డి నారాయణరెడ్డి పొలంలోని 2 బోర్లకు చెందిన మోటర్‌ వైర్లు, స్టార్టర్లు దొంగిలించారు. అలాగే వీరంరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మందకాల శ్రీనివాసులు, బొమ్మ రంగారెడ్డికి చెందిన మోటార్‌ వైర్లు, స్టార్టర్లు కూడా ఎత్తుకెళ్లారు. గొళ్ల విజయరెడ్డికి చెందిన 3 మోటాటర్‌ వైర్‌ కేబుళ్లు, గోళ్ల సుజాతారెడ్డికి చెందిన 2 మోటార్‌ వైర్‌ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు దొంగలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.

గోవా మద్యం బాటిళ్లు పట్టివేత

ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జమ్మలమడుగు రోడ్డులో వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద 18 గోవా మద్యం బాటిళ్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రారెడ్డి, సిబ్బందితో ఆదివారం వాహనాలను తనిఖీ చేపట్టారు. ఒక స్విఫ్డ్‌ డిజైర్‌ కారును తనిఖీ చేయగా అందులో 750 ఎంఎల్‌ గల 18 గోవా మద్యం బాటిళ్లు దొరికాయి. కాటం వీరేంద్ర, ఉప్పు రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు వీటిని తరలిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేసి మద్యం బాటిళ్లను, కారును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ కార్యవర్గం

కడప ఎడ్యుకేషన్‌ : యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని స్క్వేర్‌ సమావేశ మందిరంలో జరిగిన అసోసియేషన్‌ నాయకుల సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రాజంపేట గీతాంజలి డిగ్రీ కాలేజ్‌ కరస్పాండెంట్‌ సంభావు వెంకటరమణ, కార్యదర్శిగా ముద్దనూరు వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, కోశాధికారిగా ఆలీ అక్బర్‌, సంయుక్త కార్యదర్శిగా ఎన్‌.సంజీవరెడ్డి, రవి శేఖర్‌ రెడ్డి మిగిలిన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు మదనమోహన్‌ రెడ్డి, రవి శేఖర్‌ రెడ్డి, సుబ్బారెడ్డి, పెంచలయ్య, రాజగోపాల్‌ రెడ్డి, పోలా రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు పి.సురేష్‌, విజయ్‌ కుమార్‌, మనోహర్‌ రెడ్డి, రాఘవరెడ్డి, సంజీవరెడ్డి, నరసింహులు, వివిధ కళాశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement