మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం తోమాలసేవ, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం సుదూర ప్రాంతాల నుంచి రంగురంగుల పుష్పాలను తెప్పించి గ్రామోత్సవం నిర్వహించారు. వాటితో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుష్పయాగం నిర్వహించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
–గుర్రంకొండ


