ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదం.. బాధితులను ఆదుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి | Sakshi
Sakshi News home page

ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదం.. బాధితులను ఆదుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి

Published Tue, Nov 21 2023 11:45 AM

YV Subba Reddy says support To Vizag Fishing Harbour Accident Victims - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బాధితులు వేటకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగుతోందని తెలిపారు. ఘటనలో కుట్రకోణం ఉంటే తప్పకుండా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. .

ప్రభుత్వం, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడంతో హార్బర్‌లో ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. పోర్టు, స్టీల్‌ ప్లాంట్‌ పోలీసులు వేగంగా స్పందిచారని, లేదంటే ఆయిల్‌ ట్యాంకర్‌ల నుంచి ముప్పు ఉండేదని తెలిపారు. సీఎం జగన్‌ మానవతా దృక్పథంతో స్పందించారని చెప్పారు. బోటు ఖరీదు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నప్పటికీ అందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. పరిహారం గతం మాదిరిగా ఆలస్యం కాకుండా త్వరలోనే అందిస్తామని చెప్పారు. 

‘మునిగిపోయిన బోట్లను తొలగించాలని పోర్టు అధికారులను కోరాం. ఇతర బొట్లకు అడ్డం లేకుండా మునిగిన బోట్లను త్వరలో బయటకు తీస్తాం. మత్స్యకారుల కష్టాలను తెలుసుకోవాలని సీఎం పంపించారు. అందుకే వచ్చాను. కేవలం పరిహారం మాత్రమే కాదు, ఇతర సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రమాద కారకులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఏడుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతోంది. సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదన్న విషయంపై విచారణ చేపట్టాలని సీపీకి కోరాం’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన అనుమానితుడిగా ఉన్న యుట్యూబర్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 10 మంది అనుమానితులని అదుపులోకి తీసుకోగా.. వారిని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీసీపీ ఆనంద్‌ రెడ్డి విచారిస్తున్నారు. యుట్యూబర్ సెల్‌ఫోన్‌ డేటా, హార్బర్‌లో అతని కదలికలపై విచారణ కొనసాగుతోంది. కాగా వారం రోజులగా హార్బర్‌లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement