పేదలపై ఎందుకింత కక్ష?: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan fires on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పేదలపై ఎందుకింత కక్ష?: వైఎస్‌ జగన్‌

Jun 2 2025 2:26 AM | Updated on Jun 2 2025 7:58 AM

YSRCP President YS Jagan fires on CM Chandrababu Naidu

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ధ్వజం

ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? 

మళ్లీ రేషన్‌ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? 

డోర్‌ డెలివరీ రద్దుతో దోపిడీకి తిరిగి ద్వారాలు తెరిచినట్లు కాదా?

దేశమంతా మెచ్చిన విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు? 

కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలను ఊడగొట్టారు 

ఏడాది పాలనలో లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం బాబూ!

సాక్షి,అమరావతి: ప్రజలకు ఇంటికే అందుతున్న సేవలపై మీకు అంత కక్ష ఎందుకు చంద్రబాబూ...? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని నిలదీశారు. ‘రేషన్‌ డోర్‌ డెలివరీని రద్దు చేయడం అంటే పేదలను దోపిడీ చేసేందుకు  మళ్లీ ద్వారాలు తెరిచినట్లు కాదా? దేశమంతా కొనియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా చంద్రబాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలను వైఎస్‌ జగన్‌ ఎండగట్టారు. 

‘పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ  వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా చేరువైన రేషన్‌ వాహనాలను తొలగించడం సరైనదేనా? సేవలందించిన వారిని స్మగ్లర్లుగా, మాఫియా ముఠా సభ్యులుగా చిత్రీకరించేలా నిన్న మీరు (చంద్రబాబు) చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు’ అని  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

మంచి మనసుతో ప్రజల అవస్థలు తీర్చాలి... 
ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు ఇంత కక్ష చంద్రబాబూ? మళ్లీ పేదలకు రేషన్‌ కష్టాలు ఎందుకు తెస్తున్నారు?  ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలిగానీ వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్‌ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్‌ అవుతుందా? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకొచ్చిన 9,260 రేషన్‌ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టగొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?  

నా పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకముందు ప్రతి నెలా ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్‌ సహా ప్రభుత్వ సేవల కోసం పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఎండనక, వాననక క్యూలైన్లలో రేషన్‌ షాపుల ముందు పడిగాపులు పడేవారు. రేషన్‌ ఎప్పుడిస్తారో, ఎంతసేపు ఇస్తారో తెలియక కూలి పనులు, ఇతర పనులు మానుకుని నిరీక్షించేవారు. లబ్దిదారులు వివక్ష, అవమానాలు ఎదుర్కొనేవారు. దోపిడీకి గురయ్యేవారు. సరైన తూకం, నాణ్యతతో సరుకులు అందుకున్న సందర్భం లేదు. 

ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్‌ సరుకులు తీసుకోవడం కూడా మానేశారు. దీనిపై నా పాదయాత్రలో ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలతోపాటు ఇంటివద్దకే రేషన్‌ అందించే డోర్‌ డెలివరీని ప్రారంభించాం.

బియ్యం క్వాలిటీని పెంచి ప్రజలు తినగలిగే నాణ్యమైన, సార్టెక్స్‌ బియ్యాన్ని ప్యాక్‌ చేసి రేషన్‌ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికీ అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేశాం. రేషన్‌ డోర్‌ డెలివరీని రద్దు చేయడం అంటే పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా చంద్రబాబూ? దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి మీరు ఏం సాధిస్తారు?  

మొత్తంగా ఏడాదిలో 3 లక్షల ఉద్యోగాలు ఊడగొట్టారు..
నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ వలంటీర్లను మభ్యపుచ్చి తీరా అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డుమీద నిలబెట్టారు. హేతుబద్దీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష కట్టి 33 వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధి కట్టారు. గ్రామాల్లో అందుబాటులో సేవలు అందిస్తున్న విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో, వార్డుల్లో డోర్‌ డెలివరీ సంగతి పక్కనపెడితే ప్రభుత్వ సేవలు పొందడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

తాజాగా మూర్ఖపు చర్య కారణంగా రేషన్‌ వాహనాల తొలగింపుతో వారి కష్టాలు మరింత పెరి­గాయి. ఈ వాహనాలపై ఆధారపడ్డ 20 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కనీసం వారికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. మొత్తంగా మీరు అధికారంలోకి వచ్చాక 2.6 లక్షల మంది వలంటీర్లతోపాటు ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్, ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థలో తొలగించిన వారితో కలిపి మొత్తంగా 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబూ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement