తొడగొట్టి.. తోక ముడిచారు! | YSRCP leaders under house arrest restrictions on visiting goshala | Sakshi
Sakshi News home page

తొడగొట్టి.. తోక ముడిచారు!

Apr 18 2025 4:28 AM | Updated on Apr 18 2025 4:28 AM

YSRCP leaders under house arrest restrictions on visiting goshala

సవాల్‌ విసిరి పరార్‌  

గోశాలకు రావాలంటూ సవాల్‌ చేసి.. పోలీసులతో అడ్డుకున్న కూటమి నేతలు 

తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా.. భూమన నివాసం చుట్టూ పోలీసులు 

వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్బంధం.. గోశాలకు వెళ్లకుండా ఆంక్షలు 

రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన భూమన, ఎంపీ గురుమూర్తి, నారాయణస్వామి 

కూటమి నేతలను మాత్రం గోశాలకు అనుమతించి గేటు బయట పోలీసు పహారా 

గోశాలకు చేరుకున్న ఎంపీ గురుమూర్తి ప్రశ్నలకు జవాబు చెప్పలేక నీళ్లు నమిలిన టీడీపీ నేతలు 

చాలెంజ్‌ విసిరి మొహం చాటేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌.. భూమనపై కేసు నమోదు

2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు 191 గోవులు మరణించాయని వెల్లడించిన టీటీడీ గోశాల మేనేజర్‌ 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: గోవుల మరణాలను నిరూ­పించాలంటూ సవాల్‌ విసిరిన టీడీపీ సత్తా లేక తోక ము­డిచింది. సవాల్‌ను స్వీకరించే ధైర్యం లేక వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసుల ద్వారా అడుగడుగునా అడ్డుకుని గృహ నిర్బంధంలోకి తీసుకుంది.  ఒకపక్క వారిని పో­లీ­సులతో అడ్డుకుంటూ మరోపక్క గోశాల వద్దకు రా­వడం లేదంటూ కూటమి నేతలు పథకం ప్రకారం అ ను­కూల మీడియాలో దుష్ప్రచారం   చేయించారు. రో­జంతా పోలీసుల ద్వారా హైడ్రామా నడిపించారు. గురు­వారం తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించి బయటకు రాకుండా అడ్డుకున్నారు. 

గో­శాల వద్దకు వెళ్లిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తి­రుపతి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయరెడ్డిని పోలీసులు అడ్డుకుని అరె­స్టు చేశారు. భూమన కరుణాకరరెడ్డిపైనా కేసు నమో­దు చేశా­రు. వైఎస్సార్‌ సీపీపై బురద చల్లాలని యత్నించిన కూటమి పార్టీల నేతలు అభాసుపాలయ్యా­రని తిరుపతిలో వారం నుంచి జరుగుతున్న వ్యవహారా­­లను గమనిస్తున్న స్థానికులు చర్చించుకుంటున్నారు.  

కునుకు లేని కూటమి నేతలు.. 
టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి బయటపెట్టిన సంచలన నిజాలు కూటమి నేతలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుకునేందుకు వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. దమ్ముంటే గోశాలకు వచ్చి నిరూపించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ‘ఎక్స్‌’ వేదికగా సవాల్‌ విసరడంతో వెంటనే స్పందించిన భూమన గురువారం ఉదయం 10 గంటలకు వస్తానని ప్రతి సవాల్‌ విసిరారు. 

దీంతో ఉలిక్కిపడ్డ కూటమి నేతలు రాత్రికి రాత్రే పోలీసులను ఉసిగొల్పారు. వైఎస్సార్‌సీపీ నేతలెవరూ గోశాల వద్దకు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదే­శించారు. సవాల్‌ విసిరిన పల్లా శ్రీనివాసరావు పత్తా లేకుండా పోయారు. మీడియా ఎదుటే ఆయ­నకు భూమన ఐదుసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు

అర్ధరాత్రి దిగ్బంధం.. 
కూటమి నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటాక 1.10 గంటల సమ­యంలో తిరుపతి తుమ్మలగుంటలో నివాసం ఉంటున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల నివాసాల వద్దకు చేరుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్‌బ్యాంక్‌ అధ్య­క్షు­డు రామారావుతో పాటు సుమారు 18 మంది వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. 

గురు­వారం తెల్లవారు­జాము నుంచి భూమన నివాసానికి చేరుకునే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో భూమన నివాసంలోకి వెళ్లిన పోలీసులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వచ్చి, వెళ్లే వరకు గోశాలకు వెళ్లడానికి వీల్లేదని తెలిపారు. సవాల్‌ విసిరాక తాను వెళ్లక తప్పదని భూమన వారికి చెప్పారు. 

ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భూమన క్యాంపు కార్యాలయం నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చంద్రగిరి నియోజక వర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు టీటీడీ గోశాలకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మూడు గంటల పాటు ఉద్రి­క్తత నెలకొంది. 

పోలీసుల తీరుకు నిరసనగా భూమన కరుణాకరరె­డ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణస్వామి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, సత్యవేడు సమన్వయకర్త రాజేష్‌ తదితరులు భూమన క్యాంపు కార్యాలయానికి చేరుకుని నిరసనకు దిగారు. గంటపాటు రోడ్డుపై పడుకుని నిరనస తెలిపినా పోలీసులు వారిని అనుమతించలేదు.  

గోశాలలోకి కూటమి నేతలకు అనుమతి 
భూమన క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున టీటీడీ గోశాలలోకి ప్రవేశించారు. పోలీసులు వారిని గుంపులు గుంపులుగా లోపలకు పంపారు. తాము సవాల్‌ స్వీకరించామని, భూమన రాలేదంటూ కూటమి నేతలు గోశాలలో కూర్చొని అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం సాగించారు. 

దీన్ని రక్తి కట్టించేందుకు చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సు«దీర్‌రెడ్డి గోశాల నుంచి భూమనకు ఫోన్‌ చేశారు. తాము రావడానికి సిద్ధంగా ఉన్నా పోలీసులు ముందుకు కదలనివ్వడం లేదని, ఎస్కార్ట్‌ పంపితే వస్తానని భూమన వారితో పేర్కొన్నారు. అయితే ఎస్కార్ట్‌ పంపకుండా పోలీసులతో పాటు స్పెషల్‌ ఫోర్స్‌ని రంగంలోకి దింపి వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్నారు. 

ఎంపీ గురుమూర్తి ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. 
పోలీసుల నుంచి తప్పించుకుని గోశాల వద్దకు చేరుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన అభినయరెడ్డిని మరోసారి అడ్డుకోగా ఎంపీ గురుమూర్తి మరో గేటు ద్వారా లోపలకు వెళ్లారు. అక్కడ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా కూటమి నేతలంతా కలసి ఎదురు దాడికి దిగారు. 

ఎంపీ వెనక్కి తగ్గకుండా వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు సమాధా­నం చెప్పలేకపోవడంతో పరిస్థితి గమనించిన ఏఎస్పీ రవి మనోహరాచారి ఆయన్ను బలవంతంగా నెట్టుకుంటూ వచ్చి కారులో ఎక్కించారు. భూమన అభినయరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి వాహనంలోకి ఎక్కించారు.  కాగా, తిరుపతిలో ఎవరిని నిర్బంధించలేదని హోంమంత్రి అనిత చెప్పారు.

భూమనపై కేసు నమోదు
తిరుపతి క్రైమ్‌: టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డిపై తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్లో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలలో గోవులు మృతిచెందాయని భూమన అసత్య ప్రచారాలు చేసినట్లుగా ఈనెల 15వ తేదీన టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను­­ప్రకాష్‌రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫిర్యా­దు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.  

‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డీ.. మీకు దమ్ముంటే 17న గోశాలకు వచ్చి గోవులు మృతి చెందినట్లు నిరూపించండి’ - బుధవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ట్వీట్‌

‘మీ సవాల్‌ని స్వీకరిస్తున్నా.. 17న ఉదయం 10 గంటలకు టీటీడీ గోశాలకు కచ్చితంగా వస్తున్నా. మీరూ రండి...’
- టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి రీ ట్వీట్‌.

Advertisement
 
Advertisement
Advertisement