
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్భంగా గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ అంశాలపై వివరణ ఇచ్చేందకు వైఎస్సార్‌సీపీని ఈసీ ఆహ్వానించింది. దీంతో, ఈసీ దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది.
అనంతరం, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించాం. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరాం. కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని ఆహ్వానించింది. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితరంశాలపై చర్చలు జరిగాయి. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్లను పోల్చి చూడాలని చెప్పాం. ఈవీఎంలలో బ్యాటరీలపైన కూడా సందేహాలు ఉన్నాయి. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగింది. ఆరు తర్వాత జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయి. దీనిపై ఎంక్వైరీ చేయాలి.
విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ కంపారిజన్ చేయమని కోరాము. కానీ, వీవీప్యాట్ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పింది. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదు. అందుకే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి. రాయచోటిలో ఓటర్ల సంఖ్య చాలా పెరిగింది. బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరాము. దానికి ఈసీ ఒప్పుకుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 38వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌కు భిన్నమైన పోలింగ్ నమోదు అయ్యింది. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరగాలి’ అని చెప్పుకొచ్చారు.