రాష్ట్రంలో అరాచక పాలన | YSRCP leaders fires on Chandrababu Naidu Govt over Tenali Police Incident | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

May 28 2025 5:03 AM | Updated on May 28 2025 5:03 AM

YSRCP leaders fires on Chandrababu Naidu Govt over Tenali Police Incident

సమావేశంలో మేరుగ నాగార్జున, శివకుమార్, కనకారావు, అశోక్‌బాబు, అరుణ్‌కుమార్‌ తదితరులు

దళితులు, మైనారిటీలు, బడుగులకు రక్షణ లేదు

రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్న పోలీసులు

తెనాలిలో ముగ్గురు యువకులను హింసించిన తీరు దారుణం

ఘటనపై తక్షణం విచారణ జరిపించాలి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల డిమాండ్‌  

తెనాలి: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. కూటమి ఏడాది పాలనలో దళితులు, మైనారిటీలు, బడుగు­లపై అరా­చకాలు, దౌర్జన్యాలు నిత్యకృత్యం అయ్యాయని, ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు నడి రోడ్డు పైనే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. వారు వ్యవహరించిన తీరుతో మొత్తం సమాజంలోని బడుగు వర్గాలు ఆందోళన చెందుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో దళిత, మైనార్టీలకు భద్రత లేదా అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెనాలిలో యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషం. వారు తప్పు చేస్తే, శిక్షించేందుకు న్యాయ వ్యవస్థ ఉంది. కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల పట్ల  వ్యవహరిస్తున్న కర్కశత్వం తెనాలిలో ప్రతిబింబించింది. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే దళితులపై దాష్టీకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

రాజ్యాంగ రచయిత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని పలుగులతో పొడిపించిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. దళిత ఐపీఎస్‌లు సునీల్‌కుమార్, సంజయ్‌ను రాజకీయ కక్షతో ఎంత ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలు గమనిస్తు­న్నారు’ అని మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ పాలకులు ఎంతగా బరితెగించారంటే.. ఒక దళిత ఎమ్మెల్యేతో దళితులు గంజాయి తాగేవారు అనిపించారు. అణగారిన వర్గాల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరికి ఇది అద్దం పడుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో దళితుల మీద దాడి, కర్నూలు జిల్లా ఆదోని మండలంలో దళిత మహిళను ట్రాక్టర్‌తో తొక్కించడం, కూటమి ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ దళిత వైద్యుడి చెంపపై కొట్టడం, నందికొట్కూరులో లాకప్‌ డెత్‌... ఇలా అనేక అకృత్యాలు చేశారు.

రాజంపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాంబాబును బహిరంగంగా అపహాస్యం చేయడం నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురంలో దళితులను బహిష్కరించడం వరకు వారి అరాచకాలను ప్రజలు చూశారు. పల్నాడు జిల్లాలో దళిత మహిళను ఎగతాళి చేస్తే ఆత్మహత్యకు పాల్పడింది. సామాజిక సమస్యలపై స్పందించిన దళిత యువకుడిని రాజమహేంద్రవరం పోలీసులు దుస్తులు విప్పించి లాకప్‌లో పెట్టి అవమానించారు. రాజధాని ప్రాంతంలో భూములు లాక్కుని దళితులను వేధిస్తు­న్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమ కేసులతో జైలుకు పంపారు.

మదనపల్లెలో దళితుల నివాసాలపై దాడులు చేశారు. నగరిలో దళితులపై దాడులు చేసి వెలివేశారు. వీటికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ఇంత దారుణమైన దాష్టీకాలకు పాల్పడుతుంటే, ఏ ధైర్యంతో దళితులు, మైనారిటీలు, బడుగులు ఈ రాష్ట్రంలో బతకగలరు? తెనాలి ఘటనను చూసి దేశమంతా సిగ్గుపడుతోంది. బాధ్యులపై చర్యల కోసం న్యాయ పోరాటం చేస్తాం’ అని తెలిపారు.

దళిత, మైనారిటీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తుంటే సహించం
‘తెనాలిలోని ముగ్గురు యువకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు చేసిన థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం దారుణం. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో భాగంగానే పోలీసులు ఇలాంటి దారుణాలకి పాల్పడ్డారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలు, బడుగులకు ఆత్మగౌరవంతో బతికే హక్కు లేదా? వారిని పశువులను కొట్టినట్లు నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఏ రాజ్యాంగం ఇచ్చింది?’ అని ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ నిలదీశారు.

‘రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో దళితులు, మైనారిటీలను ఇలాగే హింసించాలని ఉందా? ఇంతటి అమానవీయ ఘటన జరిగితే కనీసం దళిత హోం మంత్రి కూడా స్పందించరా? యువకులను కొడుతుండగా వీడియోలు తీసి పోలీసులు ఎవరికి పంపారు? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఘటనను చూసి దళితులు, మైనారిటీలు అభద్రతాభావానికి లోనవుతున్నారు. ఏడాదిగా ఇలాంటివి అనేక ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రతిపక్షంతో పాటు దళిత, మైనారిటీలకు కూడా వర్తింపజేస్తున్నారు. ఘటనకు కారణమైన పోలీసులపై విచారణ జరిపించాలి. భవిష్యత్తులో జరగవనే భరోసాను దళిత, మైనారిటీలకు కల్పించాలి’ అని అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

కూటమి పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తం
‘తెనాలి ఘటనను యావత్‌ ప్రపంచం చూసింది. మొత్తం సమాజమే భయాందోళనలకు గురయ్యేలా ఉంది. ప్రజలకు న్యాయ, సామాజిక రక్షణను కల్పించాల్సినవారే చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే ఎలాంటి అరాచకం ఏర్పడుతుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలకు రక్షణ, చట్టాలను కచ్చితంగా అమలు చేయాలనే అంశంలో ఎక్కడా గీత దాటలేదు’ అని అన్నాబత్తుని శివకుమార్‌ పేర్కొన్నారు.  

రాష్ట్రంలో పాశవిక ప్రభుత్వం
‘రాష్ట్రంలో పాశవిక ప్రభుత్వం కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర కాదు హత్యాంధ్రప్రదేశ్‌గా మారుసు­న్నా­రు. రోజూ హత్యలు, అత్యాచారాలు, దౌర్జ­న్యాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.. దళిత ద్రోహి ప్రభు­త్వ­­మిది. చంద్రబాబు స్వయంగా దళిత వ్యతిరేకి. తెనాలి ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌ తగిన చర్యలు తీసుకోవాలి’ అని కొమ్మూరి కనకారావు డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో ప్రత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నేతలు మందపాటి శేషగిరిరావు, ఈదుమూడి డేవిడ్‌రాజు, ముదిగొండ ప్రకాష్, కాకుమాను రాజశేఖర్, తెనాలి నేతలు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, తాడిబోయిన రమేష్, చింకా సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement