సీఐ, టీడీపీ నేత వేధింపులు తాళలేక దళిత నేత ఆత్మహత్యాయత్నం | YSRCP Leader commits suicide over harassment by TDP leader | Sakshi
Sakshi News home page

సీఐ, టీడీపీ నేత వేధింపులు తాళలేక దళిత నేత ఆత్మహత్యాయత్నం

Jun 16 2026 5:39 AM | Updated on Jun 16 2026 5:39 AM

YSRCP Leader commits suicide over harassment by TDP leader

చికిత్స పొందుతున్న జడ సురేంద్ర

నిద్రమాత్రలు మింగిన వైఎస్సార్‌సీపీ దళిత నేత సురేంద్ర 

ఇప్పటికే తన నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారని వెల్లడి

సాక్షి, నరసరావుపేట: టీడీపీ నేతలతో కలిసి పోలీసులు సివిల్‌ పంచాయితీల పేరిట డబ్బుల కోసం వేధిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో దళిత నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో సోమవారం జరిగింది. తనపై సీఐ వెంకట్రావు, స్థానిక టీడీపీ నేత నల్లాటి సుబ్బారావు అక్రమ కేసులు బనాయించి డబ్బుల కోసం చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన చెందిన పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్‌సీపీ దళిత నేత, 22వ వార్డు మాజీ కౌన్సిలర్‌ జడ సురేంద్ర సోమవారం నిద్రమాత్రలు మింగాడు.

అపస్మారక స్థితిలో వెళ్లిన ఆయనను కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుడిని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి సీఐపై ఫిర్యాదు చేశారు.  

సెల్ఫీ వీడియోలో బాధితుడి ఆవేదన.. 
ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు సురేంద్ర ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తాను గతంలో ఓ రెస్టారెంట్‌ను ఒప్పందం ప్రకారం డబ్బులిచ్చి కొనుగోలు చేశానని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ డబ్బులు చెల్లించలేదంటూ స్థానిక టీడీపీ నేత నల్లాటి సుబ్బారావు, సీఐ వెంకట్రావుతో కలసి వేధించడం మొదలు పెట్టారని వాపోయాడు. పిడుగురాళ్ల పోలీసుస్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి రూ.30 లక్షల దాకా బలవంతంగా వసూలు చేశారని, ఆపై ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని చెప్పాడు.

ఇటీవల సుబ్బారావు, సీఐ వెంకట్రావు డబ్బులు కట్టాలని మళ్లీ వేధిస్తున్నారని, ఆదివారం స్టేషన్‌కు పిలిపించి కులం పేరుతో దూషించి, గంజాయి కేసు పెడతానంటూ సీఐ బెదిరించారన్నాడు. స్టేషన్‌లో స్పృహ తప్పిపడిపోయిన తనకు చికిత్స చేయించి ఇంటికి పంపించేశారని, వీరి వేధింపులు తాళలేక నిద్రమాత్రలు మింగుతున్నానని చెప్పాడు. కాగా, తన భర్తను రెండేళ్లుగా సీఐ, సుబ్బారావు వేధిస్తున్నారంటూ బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement