మహిళలపై లైంగికదాడుల్లో రెండోస్థానం
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
కాకాణి పూజిత ధ్వజం
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీని అత్యాచారప్రదేశ్‌గా మార్చారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిపడ్డారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం తనయుడు లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై నలుగురు లైంగికదాడికి పాల్పడడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఉపయోగించుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాసిన లేఖే నిదర్శనమన్నారు.
జగన్ చేతల సీఎం.. బాబు మాటల సీఎం
వైఎస్ జగన్ పాలనలో మహిళల భదత్రకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పూజిత గుర్తుచేశారు. దిశ యాప్‌ను పటిష్టంగా అమలు చేశారని, దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. ఆపదలో అబలలు ఉంటే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లోపే పోలీసులు ఘటనాస్థలంలో ఉండేవారని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక పోలీసులు శాంతిభద్రతలను గాలికొదిలేశారని విమర్శించారు.
నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తామని డైలాగ్‌లు చెప్పే చంద్రబాబు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశి్నంచారు. పోలీసులు అధికారపక్ష సేవలో తరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మహిళల రక్షణ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశి్నంచారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అమిత్‌షా సీఎం చంద్రబాబుకు లేఖరాశారని, దీనిపై ప్రజలకు సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


