
సాక్షి, తాడేపల్లి: జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్‌సీపీ సంతాపం తెలిపింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు, నేతలు హాజరయ్యారు.
భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు.
మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం: వైఎస్ జగన్
యుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బాధాకరం అన్నారు.
ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
13న కల్లితండాకు వైఎస్ జగన్
జమ్మూకశ్మీర్‌లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు.
