ఏపీలో ప్రతిధ్వనించిన సామాజిక సాధికారత

YSRCP Bus Yatra Success - Sakshi

తిరుపతి, నరసాపురం, గజపతినగరం నియోజకవర్గాల్లో యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌ 

తిరుపతిలో 17 కిలోమీటర్ల పొడవున పాదయాత్ర.. నీరాజనం పలికిన జనం 

నరసాపురంలో పోటెత్తిన జనప్రవాహం.. జనసంద్రంగా మారిన గజపతినగరం 

నేడు భీమిలి, బాపట్ల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర  

సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/సాక్షి, నరసాపురం/సాక్షి, విజయనగరం: సామాజిక సాధికారత రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజల స్పందన ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర, సభలకు పేదలు వెల్లువెత్తుతున్నారు. జగన్‌ వెంటే తాము అంటూ నినదిస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైఎస్‌ జగన్‌ తమకు మంచి చేశారని ప్రశంసిస్తున్నారు.

మళ్లీ జగనే రావాలి జగనే కావాలి అంటూ ఒకే గళమై నినదిస్తున్నారు. శుక్రవారం రెండో రోజు యాత్రలోనూ ఇదే చైతన్యం వెల్లువెత్తింది. రాష్ట్రంలో గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మంచిని వివరించి.. పేదలందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ యాత్ర శుక్రవారం తిరుపతి, పశ్చి­మగోదావరి జిల్లా నరసాపురం, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గాల్లో జరిగింది.

మూడు నియోజకవర్గాల్లోనూ యాత్ర సాగిన రహదారులు జనంతో కిటకిటలాడాయి. ‘సామా­జిక న్యాయ నిర్మాత వర్ధిల్లాలి.. జై జగన్‌’ అన్న నినాదాలతో ప్రతిధ్వనించాయి. సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నేతలు వివరించిన ప్రతిసారీ ప్రజలు సీఎం జగన్‌కు జేజేలు పలికారు. మళ్లీ జగనే కావాలి అంటూ నినదించారు. సామాజిక సాధికార యాత్ర మూడో రోజున రాయలసీమలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, కోస్తాలో బాపట్ల జిల్లా బాపట్లలో, ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గాల్లో జరుగుతుంది.
 

తిరుపతిలో మహా పాదయాత్ర
రాష్ట్రమంతటా సామాజిక సాధికార యాత్రను బస్సు ద్వారా నిర్వహించాలని నిర్ణయించినప్ప­టికీ, తిరుపతిలో మహా పాదయాత్రలా మారింది. ఈ యాత్రకు ప్రజలు వెల్లువలా రావడంతో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ­య­సాయిరెడ్డి సూచనతో వైఎస్సార్‌సీపీ జైత్రయా­త్రగా సాగింది. ముందుగా తిరుపతి నగరంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్‌­సీపీ నేతలు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

అక్కడి నుంచి నగరంలోని 50 వార్డుల మీదుగా 17 కిలోమీటర్ల పొడవున పాదయాత్ర చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు భారీ ఎత్తున కదలివచ్చారు. గ్రూప్‌ థియేటర్స్‌ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జన సముద్రంలా కనిపించింది. వైఎస్సార్‌సీపీని 175 స్థానాల్లో గెలిపిస్తాం.. వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటాం అంటూ ప్రజలు నినదించారు. 
 

నరసాపురంలో జనమే జనం
నరసాపురంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర ప్రజలే నాయకత్వం వహించారా అన్న­ట్లుగా సాగింది. నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు కాలువ గట్టు సెంటర్‌లో మంత్రులు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమా­లలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి  రామన్నపేట మీదుగా నరసాపురం వరకు సాగిన ఈ యాత్రకు జనం ఉప్పెనలా తరలి­వచ్చారు. 17 కిలోమీటర్ల మేర 20 గ్రామాల మీదుగా యాత్ర సాగింది. అడుగడుగునా ప్రజలు సీఎం జగన్‌కు జేజేలు పలికారు. మంత్రులకు పూలమాలలతో స్వాగతం పలికారు. సాయంత్రం 6 గంటలకు నరసాపురం పట్టణంలో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. 
 

విజయనగరంలో బస్సు యాత్ర, బైక్‌ ర్యాలీ
విజయనగరం జిల్లా కేంద్రంలో సామాజిక సాధి­కార బస్సు యాత్ర శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాయకులు ప్రయాణించిన బస్సు­ను అనుసరిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. యాత్రకు అడుగ­డుగునా ప్రజలు సంఘీభావం ప్రకటించారు. విజయనగరం ఆర్టీసీ జంక్షన్, ఆర్‌ అండ్‌ బీ జంక్షన్, కలెక్టరేట్‌ జంక్షన్, గజపతినగరం నియోజక­వర్గం గొట్లాం, గజపతినగరంలో బాణసంచా కాల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. పులివే­షాలు, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. పార్టీ నేతలు గొట్లాం గ్రామంలో ప్రభు­త్వం నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. గజపతినగరంలోని మెంటాడ రోడ్డులో  బహిరంగ సభ జన సంద్రాన్ని తలపించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top