సాక్షి, గుంటూరు: ఏపీలో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు.. అడ్డంకులను సృష్టించారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.
వివరాల ప్రకారం.. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసం నుంచి ర్యాలీగా ముందుకు సాగారు. వైఎస్సార్‌సీపీ ర్యాలీ.. స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఓవరాక్షన్‌కు దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ సీఐ గంగా వెంకటేశ్వర్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. దీంతో, సీఐపై అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇక, గతంలోనూ అంబటి రాంబాబు పట్ల పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించాం. రెవెన్యూ అధికారులకు మెమోరాండం అందించాం. 17మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టామని చెప్పాం. ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రైవేటు కాలేజీలు భారీస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేదలకు అన్యాయం చేసే పీపీపీ పద్దతిని వద్దని చంద్రబాబుకు సూచిస్తున్నాం. పీపీపీ పద్దతిపై కొన్ని రాష్ట్రాలలో ప్రజలు వ్యతిరేకించడంతో ప్రభుత్వాలు వెనక్కితగ్గాయి.

గుంటూరు లో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో YSRCP ప్రజా ఉద్యమం🔥🔥
అడ్డుకుంటున్న పోలీసులు #OneCroreSignatures#StopPrivatization#SaveMedicalCollegesInAP#YSRCPForMedicalStudents pic.twitter.com/MtDOBCRkH0— Rahul (@2024YCP) November 12, 2025
పీపీపీ పద్దతి వద్దంటూ కోటి సంతకాలు సేకరించాం. చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను బడా బాబులకు అప్పగించి లోకేష్ జేబులు నింపుతున్నారని మేం ఆరోపిస్తున్నాం. మేం ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారు. మెమోరాండం ఇవ్వకుండా ఆపగలిగారా?. పోలీసులు పద్దతి మార్చుకోవాలని చెబుతున్నాం. లోకేష్ మెప్పుకోసం కొందరు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పోలీసుల భాష మాట్లాడుతున్నారు.. మాకు రాదా పోలీసు భాష. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకూ ఉద్యమం ఆగదు. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు లోకేష్ బంధువు. ఎక్కడా ఆపని పోలీసులు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు. మేం తగ్గేది లేదు.. చిత్తశుద్దితో పనిచేస్తున్నాం. పోలీసులతో అణిచిపెట్టాలని చూస్తున్నారు.. లోపల వేయాలని చూస్తున్నారు. మేం దేనికైనా సిద్దం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


