
దివ్యాంగ పెన్షన్ల రద్దుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
‘ఎక్స్’లో సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ నిలదీత
మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పాలనలో రోజూ రుజువవుతూనే ఉంది.. ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు?.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
రీ వెరిఫికేషన్ పేరిట నరకయాతన చూపిస్తున్నారు
వారిని కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా?
ఆరోజు సర్టీఫికెట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు మరి అవి తప్పుడు సర్టీఫికెట్లు ఎలా అవుతాయి?
లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా?.. దివ్యాంగులను ఇలా ఇబ్బంది పెట్టి బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా?
సాక్షి, అమరావతి: టీడీపీ నాయకత్వంలోని కూటమి సర్కారు దివ్యాంగుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పెన్షన్లను రద్దు చేస్తూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వారికి దివ్యాంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులను సైతం లంచాలు తీసుకున్నారంటూ దారుణంగా అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తూ మంగళవారం ‘ఎక్స్’లో చంద్రబాబును ట్యాగ్ చేస్తూ నిలదీశారు.
⇒ సీబీఎన్ గారూ.. మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని మీ పాలనా కాలంలో రోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలే కాదు.. అంతకు మించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. కానీ ఇదివరకే ఉన్నవాటికి మంగళం పాడేయడమే కాదు.. తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటికీ కోతలు పెడుతున్నారు.
⇒ చంద్రబాబుగారూ.. పెన్షన్లలో కోత లేకుండా, ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టారు, ఊరూరా మీ వాళ్లతో చెప్పించారు. 2024 మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వ హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కానీ మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472 మాత్రమే. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?
⇒ విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?
⇒ దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్ల కోసం గతంలో ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి, మా ప్రభుత్వ హయాంలో వారికోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేశాం. 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేం పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాం.
కానీ, మీరు వారిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి, వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గారూ ఆరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు, మరి అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? పైగా లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా?
⇒ వీటి పరిస్థితి ఇలాఉంటే.. ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతి పెద్దమోసం. అది దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ అంటే.. మోసం గ్యారంటీ!