Young woman commits suicide in Kurnool district - Sakshi
Sakshi News home page

అమ్మానాన్న క్షమించండి!

Published Tue, Jun 6 2023 7:55 AM

Young woman commits suicide in Kurnool - Sakshi

కర్నూలు: ‘‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. మీరు చెప్పిన మాట విననందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా గురించి బాధ పడకండి.. తమ్ముడు, చెల్లి గురించి ఆలోచించండి.. ధైర్యంగా ఉండండి.. నా చావుకు కారణం వినోద్‌ అలియాస్‌ ప్రవీణ్‌కుమార్, అతని తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బక్కన్న, బావ శోభన్, బాబాయి మధుబాబు, మరో ఐదుగురు మేనత్తలు’’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..  కర్నూలు పీవీ నరసింహారావు నగర్‌కు చెందిన మధు, శేఖమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.  

మధు..బి.క్యాంప్‌లోని దిన్నెదేవరపాడుకు వెళ్లే రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంటీన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన కుమార్తె పద్మావతిని బీకామ్‌ కంప్యూటర్స్‌ చదివించారు. ఈ యువతి కర్నూలులోని ఓ షోరూమ్‌లో పనిచేస్తుండగా నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌తో ఐదేళ్ల క్రితం  పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.  కొంతకాలానికి వినోద్‌కుమార్‌ అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమకు బదిలీపై వెళ్లాడు. ఇద్దరూ కలసి వివాహం చేసుకోవాలనుకున్నారు.

మార్చి 9వ తేదీన వీరికి నిశి్చతార్థం జరిగింది. జూన్‌ 10వ తేదీన పెళ్లి వేడుకలు జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించి పత్రికలు కూడా పంచుకున్నారు. అయితే పద్మావతి వయసు తనకంటే పెద్దదని తర్వాత తెలుసుకుని జూపాడుబంగ్లా పీఎస్‌లో వినోద్‌ కుమార్‌ ఫిర్యాదు చేసి మే 29వ తేదీన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో పద్మావతి కుటుంబ సభ్యులు కూడా దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో ఇరు కుటుంబాలను కౌన్సెలింగ్‌కు రావలసిందిగా పోలీసులు సూచించగా సోమవారం తెల్లవారుజామున పద్మావతి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు కనుక్కొని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  కోలుకోలేక కొద్దిసేపటికే పద్మావతి మృతిచెందింది. నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
Advertisement