మాకు నాలుగు ఎకరాల సొంత భూమి ఉంది. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఇందులో ఉల్లి, మొక్కజొన్న, టమాట తదితర పంటలు సాగు చేస్తున్నాం. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపరిహారం ఇవ్వలేదు.
– ఈశ్వరయ్య, రైతు, చిన్నటేకూరు,
కల్లూరు మండలం
మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. ఈ ఏడాది వర్షాలు ఎక్కువై పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు ఎలాంటి ఆసరా లేకుండా పోయింది. అన్నదాత సుఖీభవకు మొదటి ఏడాది మంగళం పలికారు. రెండో ఏడాది రెండు విడతలకే పరిమితం చేశారు. మూడో విడత ఎప్పుడు ఇస్తారో? రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా బీమా లభించలేదు.
– టీ.పక్కీరప్ప, జొన్నగిరి, తుగ్గలి మండలం
294598
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
‘రైతు భరోసా’ అందుకున్న అన్నదాతలు
272757
చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత
సుఖీభవ అందుకున్న కర్షకులు
21841
చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత
సుఖీభవకు దూరమైన రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): కష్టాన్నే నమ్ముకున్న కర్షకులకు కన్నీళ్లే మిగిలాయి. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ కోతలే కనిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలన్నీ దెబ్బతిన్నా.. ఉచిత పంటల బీమా జాడ లేకుండా పోయింది. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్పలు చెప్పినా.. తొలి ఏడాది రిక్తహస్తం చూపారు. రెండో ఏడాది అరకొర సాయం అందింది. ‘అన్నం పెట్టం.. మాటలతోనే కడుపు నింపుకోండి’ అన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉత్తుత్తి మాటలు నమ్మి దారుణంగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘మూడో’ మోసం!
అన్నదాత సుఖీభవ అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2024 జూన్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్–6 హామీల పక్కన పెట్టేశారు. ఇందులో భాగంగానే 2024–25లో అన్నదాత సుఖీభవను ఎగ్గొట్టడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. 2025–26 నుంచి అమలు చేస్తున్నా అరకొరకు పరిమితం చేసి మమ అనిపిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాత సుఖీభవ కింద సాయాన్ని మూడు విడతల్లో చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రైతులకు రూ.14 వేలు మాత్రమే లభించాయి. మూడో విడతలో అన్నదాత సుఖీభవ కింద రూ.4000, పీఎం కిసాన్ కింద రూ.2000 విడుదల చేయాల్సి ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరం మరో 25 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు మూడో విడత సాయం రైతులకు దక్కని పరిస్థితి ఏర్పడింది. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో సూపర్–6లో భాగంగా పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా మేమే రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడు ఊరూవాడా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌తో ముడిపెట్టి రూ.14 వేలకు మాత్రమే పరిమితం అవుతుండటంపై రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవను పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది నుంచి అమలు చేస్తున్నప్పటికి మూడో విడత ఊసే లేకుండా పోయింది.
పెండింగ్ రూ.10 కోట్లు
అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. 2025 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. నిబంధనల ప్రకారం 33 శాతం కంటే దెబ్బతింటే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలి. అధిక వర్షాలతో 50 నుంచి 100 శాతం వరకు పంటలు దెబ్బతిన్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేయించి పంట నష్టాన్ని అతి తక్కువగా చూపించింది. అతి తక్కువ నమోదు చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ కూడా రైతులకు చెల్లించలేదు. ఉమ్మడి జిల్లాలో 2026లో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ దాదాపు రూ.10 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండి పోయింది.
ధీమా ఇవ్వని బీమా
రైతులు ప్రీమియం చెల్లిస్తే 2024–25 రబీ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేస్తున్నారు. ఉచిత పంటల బీమాను పక్కన పెట్టి ప్రీమియం చెల్లించిన రైతులకే బీమా అనే విధానాన్ని తెచ్చారు. 2024–25 రబీ, 2025 ఖరీఫ్ సీజన్‌లో రైతులు ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నప్పటికీ పరిహారం ఊసే లేకుండా పోయింది. అధిక వర్షాలు, వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నప్పటికీ ఒక్క రూపాయి పరిహారం లేదు. ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నా పరిహారం వస్తుందో.. లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.. 2025–26 రబీలో పంటల బీమాను అమలే చేయలేదు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నప్పటికీ బీమా జాడనే లేకుండా పోవడం రైతులకు తీవ్ర ఆందోళనను మిగిల్చింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అధిక వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లితే కేవలం నెల రోజుల్లోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చేది.
పంట నష్టం జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్యూమరేషన్ చేపట్టడం, ఆ వెంటనే ప్రభుత్వానికి రిపోర్టు పంపడం, రిపోర్టు పంపిన కొద్ది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడం ఆనవాయితీగా ఉండేది.
రైతుల నుంచి ప్రీమియం రూపంలో రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది.
ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందే పంటల బీమా కింద రైతులకు పరిహారం చెల్లించేవారు.
నోటిఫై చేసిన పంట ఏదైనా ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు బీమా అమలులో ఉన్నట్లే.
41320
ఆర్సీ కార్డులు ఉన్నా అన్నదాత సుఖీభవ అందని కౌలు రైతులు
28600
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అందుకున్న కౌలు రైతులు
చంద్రబాబు ప్రభుత్వంలో కౌలు రైతులకు తీరని అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో కౌలుదారులకు రూపాయి కూడా చెల్లించలేదు. కర్నూలు జిల్లాలో 25 వేలు, నంద్యాల జిల్లాలో 28 వేల మంది రైతులకు సీసీఆర్‌సీ కార్డులు జారీ చేశారు. ఒక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవ అమలు కాలేదు. కౌలు రైతులతో పాటు ఎండోమెంట్, అటవీ భూములు (ఆర్‌ఓఎఫ్‌ఆర్) అనుభవిస్తున్న వారికి, అసైన్ భూములకు, వేలాది పట్టాదారులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కౌలురైతులతో పాటు ఆర్‌వోఎఫ్‌ఆర్, ఎండోమెంటు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్థికంగా చేయూత ఇచ్చింది.
2024–25లో అందని
అన్నదాత సుఖీభవ
2025–26 నుంచి
అరకొరగా అమలు
ఏడాది ముగుస్తున్నా
మూడో విడత మాటే లేదు!
అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు
నష్ట పరిహారం ఊసే కరువు
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై
రైతుల ఆగ్రహం


