
అవమానభారంతో యువకుడి ఆత్మహత్య
మదనపల్లె(అన్నమయ్య): క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో, బ్యాంక్ సిబ్బంది ఇంటివద్దకు వచ్చి నిలదీయడంతో అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. వేంపల్లె పంచాయతీ జంగావారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, కాంతమ్మ దంపతుల ఏకై క కుమారుడు శ్రీకాంత్(25) పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు.
అక్కడే పనిచేస్తున్న ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన అనిల్‌కు తనపేరుపై ఉన్న క్రెడిట్‌కార్డు ద్వారా రూ.3లక్షల రుణం తీసిచ్చాడు. అయితే, అతను సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ సిబ్బంది నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీంతో తాను వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బులతో పాటు కొంతమేర అప్పుచేసి మూడో వంతు రుణం చెల్లించాడు. ఇంకా రూ.40వేలు చెల్లించాల్సి ఉంది.
ఈ నగదు చెల్లింపు కోసం శనివారం బ్యాంక్ సిబ్బంది శ్రీకాంత్ ఇంటివద్దకు వెళ్లి వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేసి నిలదీశారు. దీన్ని అవమానంగా భావించి మనస్తాపంతో ఆదివారం ఉదయం ఇంటివద్దే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.