
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గురువారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన నివాసం ముందు యోగ టీచర్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. అయితే..

సీఎం కరకట్ట నివాసం వద్ద నిరసనలకు పోలీసులు యోగా టీచర్లకు అనుమతించలేదు. వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. మర్యాదగా వెళ్లిపోవాలంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. తమ సమస్యేంటో కూడా వినకుండా పోలీసులు తమను పంపించేస్తున్నారని టీచర్లు వాపోయారు. పాఠశాలల్లో పని చేస్తున్న 1,056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ విషయమై మంత్రి లోకేష్‌కు గతంలో విన్నవించినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలా యోగాసనాల నిరసనలతో అయినా వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశామని చెబుతున్నారు.
