శ్రీకాకుళం జిల్లాలో తల్లి, కుమార్తెతో రోడ్డుపై ఓ మహిళ ధర్నా
శ్రీకాకుళం జిల్లా: ‘అచ్చెన్నాయుడు గారూ... మాకు న్యాయం చేయండి. నా భర్త కట్టిన ఇంటిని ఆడపడుచు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. దీనికి అధికారులు, మీ నేతలే సహకరిస్తున్నారు’ అంటూ బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద రోడ్డుపై ఓ మహిళ తన కుమార్తె, తల్లితో నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే... టెక్కలి ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన దేబారికి సంధ్య కొద్దిరోజుల క్రితం భర్తతో పాటు అత్తమామలను కోల్పోయింది.
తమ సొంత డబ్బుతో నిర్మించుకున్న ఇంటిని ఆడపడుచు ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతోందని బాధితురాలు సంధ్య వాపోయారు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయించినా న్యాయం చేయడం లేదని, కొంతమంది టీడీపీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కలగజేసుకుని తక్షణమే న్యాయం చేయాలని, లేకపోతే కుమార్తె సహా ఆత్మహత్యే శరణ్యమంటూ బోరున విలపించారు.


