14 రోజుల బాలింతను పొట్టనబెట్టుకున్న అధికారులు | A Woman Police Constable Ends His Life In Kurnool District | Sakshi
Sakshi News home page

14 రోజుల బాలింతను పొట్టనబెట్టుకున్న అధికారులు

Jun 30 2025 11:56 AM | Updated on Jun 30 2025 11:56 AM

A Woman Police Constable Ends His Life In Kurnool District

 14 రోజుల బాలింత అని చెప్పినా పట్టించుకోని అధికారులు

 రాత్రి ఒంటి గంట వరకు కౌన్సెలింగ్‌

 ఒత్తిడికిగురై హైబీపీతో మృత్యువాత

ఆదోని అర్బన్‌(కర్నూలు): ఆదోని పట్టణంలోని 36వ వార్డు, మేదరి గేరీలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న దివ్య (26) బదిలీ ఒత్తిడితో అనారోగ్యానికి గురై మృతి చెందింది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 15వ తేదీన పట్టణంలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ రోజు నుండి మెటర్నిటీ సెలవులో ఉంది. ఈ క్రమంలో కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు శిశువుతో 8 ఉదయం గంటలకు అక్కడికి చేరుకుంది. 

అయితే తన పరిస్థితి వివరించి త్వరగా కౌన్సెలింగ్‌కు పంపాలని అక్కడ విధుల్లో ఉన్న అధికారులను వేడుకుంది. తాను బాలింతను అని, సిజేరియన్‌ జరిగిందని వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి 1 గంటల సమయంలో కౌన్సెలింగ్‌ పూర్తి కావడం, ఆమెకు ఆస్పరి మండలం అలిగేరికి బదిలీ చేశారు. అప్పటి వరకు కార్యాలయం ఆవరణలో ఉన్న తన బిడ్డకు పాలు ఇచ్చేందుకు లోపలకి, బయటకు తిరిగి అలసిపోయింది. 

అలాగే దూర ప్రాంతానికి బదిలీ కావడంతో ఆందోళనకు గురైంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆదోనికి చేరుకున్న దివ్య కొద్ది సేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని కర్నూలుకు రెఫర్‌ చేశారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో దివ్య మృత్యుఒడి చేరారు. మానవత్వం లేకుండా అధికారులు వ్యవహరించడంతో తన బిడ్డ మృతి చెందిందని దివ్య తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement