breaking news
Woman police constable
-
నారీ స్వారీ!
శారీరక దృఢత్వం భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోగల మానసిక బలాన్నిపెంచి... కరిగిపోని కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది! అది జీవన దృక్పథాన్నే మార్చేస్తుంది! ఇలాంటి అద్భుతాలను క్రియేట్ చేసే కొలువులున్నాయి.. వాటిల్లో రాణించే అమ్మాయిలున్నారు! ఆ ఫోర్సే.. మౌంటెడ్ పోలీస్.. పదిమంది నారీమణులతో కూడిన ఆ అశ్వదళం హైదరాబాద్‌ను పహారా కాస్తోంది.. సెల్ఫ్ ప్రోటెక్షనే కాదు.. శాంతిభద్రతల పర్యవేక్షణలోనూ స్త్రీ శక్తిని చాటుతోంది!ఇంట్లో ఆడపిల్ల వీథి చివరన ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలన్నా తమ్ముణ్ణి తోడు ఇచ్చే పంపే కాలానికిక చెల్లు ఏమో అనిపిస్తోంది.. హైదరాబాద్‌లోని కీలక్రపాంతాల్లో గుర్రాల మీద గస్తీ తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అశ్వదళ మహిళా పోలీసులను చూస్తుంటే! నిజానికి వాళ్లను మహిళా పోలీస్ అంటే వాళ్లనలా తీర్చిదిద్దిన వాళ్ల దళాధిపతులు .. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితామూర్తి ఒప్పుకోరు.‘జాబ్‌కి జెండర్ ఏంటీ.. శక్తిసామర్థ్యాలు ప్రామాణికం కానీ..’ అంటారు. అందుకే తొలిసారిగా.. ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) పోలీస్‌లోని పదిమంది అమ్మాయిలను అశ్వదళంలోకి ఆహ్వానించి.. వారికి గుర్రపు స్వారీలో శిక్షణనిప్పించి విధులను అప్పగించారు. వీళ్లు ప్రతి శుక్రవారం మక్కా మసీదు, చార్మినార్ దగ్గర, రోజు విడిచి రోజు లేక్ డ్యూటీలు చేస్తున్నారు. ర్యాలీలు, పండగలు, గణేశ నవరాత్రులు, శోభాయాత్రలు వంటి సందర్భాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.శక్తి చూపించింది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.. ఈ దళంలోని పదిమంది అమ్మాయిలది భిన్న నేపథ్యం. కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరినప్పటికీ మౌంటెడ్ పోలీస్ అంటే వాళ్లెవరికీ తెలియదు.. ఆ ఫోర్స్ గురించి నోటీస్ వచ్చేదాకా. ఏఆర్ పోలీస్‌లో రెండువందల మందికి పైగా మహిళలుంటే మౌంటెడ్ పోలీస్‌లో చేరడానికి పదిమంది మాత్రమే ముందుకు వచ్చారు. మౌంటెడ్ పోలీస్ అంటే ఏంటో రీసెర్చ్ చేశారు. ‘ట్రైనింగ్ టఫ్‌గా ఉంటుంది.. ఫిట్నెస్ చాలా అవసరం.. ఆసక్తి ఉంటేనే రండి’ అని ట్రైనర్ చెప్పాక దాన్నో సవాలుగా తీసుకున్నారు. శిక్షణలో గుర్రాల మీద నుంచి పడ్డారు. దెబ్బలు తగిలాయి. అయినా వెనుకడుగు వేయలేదు.గుర్రాలను మాలిమి చేసుకోవడంలో కొన్ని మెళకువలను కనుగొన్నారు. గుర్రాలు చెప్పినట్టు వినడం మొదలెట్టాయి. అలా శిక్షణలోని ఆంతర్యాన్ని పసిగట్టి.. తదనుగుణంగా ముందుకు సాగారు. ఆ ట్రైనింగ్ వాళ్ల ఆత్మస్థయిర్యాన్నే కాదు.. ఫిజికల్ ఫిట్‌నెస్‌నూ పెంచింది. జీవన దృక్పథాన్నే మార్చింది. విధి నిర్వహణలో వాళ్లు గుర్రాలను మచ్చిక చేసుకోవడం దగ్గర్నుంచి, తమ కమాండ్స్‌తో వాటిని చెప్పుచేతల్లో పెట్టుకోవడం మొదలు.. జనసమ్మర్ధంలో పరిస్థితిని అదుపు తప్పకుండా చూసుకోవడం వరకు మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. ఈ దళంలో పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న కానిస్టేబుల్ అఖిల కూడా ఉన్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు సభ్యులు సుభద్ర, హవంతిక ఈ కొత్త కొలువు గురించి వివరించారు. మగవాళ్లకే పరిమితమైన కొలువుల్లోకి మహిళలు వస్తే.. పనిప్రదేశం లో విమెన్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని ఈ అశ్వదళం నిరూపించింది.– సరస్వతి రమ – ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది.. ఎస్సై కావాలని, గృహ హింస మీద మహిళలకు అవగాహన కల్పించాలనేది నా లక్ష్యం. దానికోసమే రీసెంట్గా డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాను. ముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడేసరికి ఇందులో చేరిపోయాను. కొత్త పనులు చేయడమన్నా, నేర్చుకోవడమన్నా చాలా ఇష్టం. అందుకే మౌంటెడ్ పోలీస్ గురించి చెప్పగానే అందులో చేరడానికి అందరికన్నా ముందుగా నేను చెయ్యెత్తాను.అయితే నాకు రెండు డెలివరీలూ సిజేరియనే అవడంతో మౌంటెడ్ పోలీస్‌కి కావల్సినంత ఫిజికల్ ఫిట్నెస్ లేక ట్రైనింగ్ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. వెనక్కి వెళ్లిపోతే మిగిలిన అమ్మాయిలు నిరుత్సాహపడతారేమో అనిపించింది. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాను. కాన్ఫిడెన్స్ వచ్చింది. లైఫ్ పట్ల అప్పటిదాకా నాకున్న దృక్పథమే మారిపోయింది. లేనిదాని గురించి దిగులుపడే బదులు ఉన్నదాని గురించి పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలో తెలుసుకున్నాను. జీవితంలోని కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది – అఖిలఉత్సాహం.. ప్రోత్సాహం.. చిన్నప్పటి నుంచీ విలక్షణంగా... విభిన్నంగా ఉండాలనే తపన. అందుకే ఈ పోలీస్ జాబ్‌లోకి వచ్చాను. అది రొటీన్ అయిపోతోందనుకుంటున్నప్పుడే మౌంటెడ్ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. గుర్రపు స్వారీ కష్టమని మా నాన్న వద్దన్నారు. కానీ ఆయన్ని ఒప్పించి ట్రైనింగ్‌లో చేరాను. నన్ను డ్యూటీలో చూసిన మా బంధువులు ‘నీ బిడ్డ ఠీవిగా భలే డ్యూటీ చేస్తోంద’ని తనతో చెబుతున్నారని మా నాన్న నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఆయన కళ్లల్లో కనిపించే గర్వం చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఐపీఎస్ కావాలనే నా లక్ష్యానికి తగిన ప్రోత్సాహన్నిస్తుంది. – మర్రి హవంతికబ్యాలెన్సింగ్ నేర్చుకున్నాను..చిన్నప్పటి నుంచీ నాకు టఫ్ టాస్క్స్ అంటే ఇష్టం. అందుకే కరాటే, టైక్వాండో నేర్చుకున్నాను. స్పోర్ట్స్‌లో కూడా ముందుండేదాన్ని. ఆ స్పిరిటే నన్ను పోలీస్ జాబ్ వైపు, మౌంటెడ్ పోలీస్ వైపు మళ్లేలా చేసింది. ఈ కొలువు నాకో కొత్త చాలెంజ్. గుర్రపు స్వారీతో లైఫ్ బ్యాలెన్సింగ్‌ను నేర్చుకున్నాను. నా భవిష్యత్ లక్ష్యం గ్రూప్ వన్ ఆఫీసర్. – సుభద్ర -
14 రోజుల బాలింతను పొట్టనబెట్టుకున్న అధికారులు
ఆదోని అర్బన్(కర్నూలు): ఆదోని పట్టణంలోని 36వ వార్డు, మేదరి గేరీలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న దివ్య (26) బదిలీ ఒత్తిడితో అనారోగ్యానికి గురై మృతి చెందింది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 15వ తేదీన పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ రోజు నుండి మెటర్నిటీ సెలవులో ఉంది. ఈ క్రమంలో కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు శిశువుతో 8 ఉదయం గంటలకు అక్కడికి చేరుకుంది. అయితే తన పరిస్థితి వివరించి త్వరగా కౌన్సెలింగ్‌కు పంపాలని అక్కడ విధుల్లో ఉన్న అధికారులను వేడుకుంది. తాను బాలింతను అని, సిజేరియన్ జరిగిందని వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి 1 గంటల సమయంలో కౌన్సెలింగ్ పూర్తి కావడం, ఆమెకు ఆస్పరి మండలం అలిగేరికి బదిలీ చేశారు. అప్పటి వరకు కార్యాలయం ఆవరణలో ఉన్న తన బిడ్డకు పాలు ఇచ్చేందుకు లోపలకి, బయటకు తిరిగి అలసిపోయింది. అలాగే దూర ప్రాంతానికి బదిలీ కావడంతో ఆందోళనకు గురైంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆదోనికి చేరుకున్న దివ్య కొద్ది సేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని కర్నూలుకు రెఫర్ చేశారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో దివ్య మృత్యుఒడి చేరారు. మానవత్వం లేకుండా అధికారులు వ్యవహరించడంతో తన బిడ్డ మృతి చెందిందని దివ్య తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
ఆశలు సమాధి: పదిరోజుల్లో వివాహం.. మహిళా కానిస్టేబుల్ మృతి
సాక్షి, విజయవాడ: కాళ్లకు పారాణి పెట్టుకుని, పట్టు వస్త్రాలతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువతి.. నిస్తేజంగా పరుండిపోయింది. అనుకున్న లక్ష్యాన్ని చిన్న వయస్సులోనే అధిగమించి.. కొంగొత్త ఆశలతో కొత్త జీవితం వైపు పరుగులు పెడుతున్న సమయాన విధి వైచిత్రికి తలవంచాల్సి వచ్చింది. ఉన్నపాటున బ్లడ్ కేన్సర్ రూపంలో విరుచుకుపడిన మృత్యువు.. కోలుకునే అవకాశం ఇవ్వకుండా కబళించేసి, ఆశల్ని సమాధి చేసింది. కన్నవారికి కన్నీటి వేదనను మిగిల్చింది. సేకరించిన వివరాలు ఇవి.. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం నందమూరి గ్రామానికి చెందిన పరసా శ్రీరమ(21) అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 19 ఏళ్లకే కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాదించింది. 2020 బ్యాచ్‌కు చెందిన శ్రీరమ శిక్షణ పూర్తయిన తర్వాత తొలిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ మహిళా కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈ నెల 28వ తేదీన శ్రీరమ వివాహం కూడా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కన్నవారి కలలు కల్లలు.. ఉద్యోగం తర్వాత పెళ్లితో తమ కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశకు పది రోజుల్లోనే తీరని నిరాశను మిగిల్చింది. గత పదిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నాలుగు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోగా బ్లడ్ క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. తనకు ఆ వ్యాధి ఎలా వచ్చింది, ఎలా తగ్గించుకోవాలని తెలుసుకునే లోపే ఆమె తన జీవితాన్ని కోల్పోయింది. బుధవారం మధ్యాహ్నం విధుల్లో ఉన్న శ్రీరమకు చెవుల్లో, ముక్కుల్లో నుంచి ఒక్కసారిగా రక్తం రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. స్టేషన్ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్లారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె గురువారం అర్ధరాత్రి దాటాక తుది శ్వాస విడిచింది. స్టేషన్ సిబ్బంది నివాళి.. సింగ్‌నగర్ స్టేషన్ సిబ్బంది, ఆమె స్వగ్రామం నందమూరి గ్రామ వాసులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. స్టేషన్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది అంతా శుక్రవారం శ్రీరమ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. -
పోలీసు శాఖలో మహిళలకు ఉద్యోగాలు
సాక్షి, ఒంగోలు: మహిళలపై పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రతి గ్రామ సచివాలయంలోనే మహిళా పోలీస్, స్త్రీ శిశు సంక్షేమ సహాయకులు, వార్డు మహిళ, బలహీనవర్గాల ప్రజలకు రక్షకులుగా కొందరిని నియమించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,944 పోస్టులను భర్తీ చేయనుండగా జిల్లాలో 1055 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో ఎక్కువ మంది మహిళలు ఉద్యోగులుగా మారే సువర్ణావకాశం వచ్చింది. ఈ ఉద్యోగాల్లో చేరే వారికి తొలి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్‌లో నెలకు రూ.15 వేలు చొప్పున ఇస్తారు. ప్రొబేషన్ పూర్తయిన అనంతరం వారికి స్కేల్ వర్తిస్తుంది. రూ.14,600 నుంచి రూ.44,870లుగా జీతం స్కేల్ నిర్ణయించారు. 1977 జూలై 2వ తేదీకి ముందు, 2001 జూలై 1వ తేదీ తర్వాత జన్మించిన వారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు. అంటే 2019 జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి 42 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులు. దరఖాస్తును ఆగస్టు 10వ తేదీలోగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. దరఖాస్తుకు అర్హతలు రాష్ట్ర పౌరులై ఉండాలి. ఏదేని యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టెక్నికల్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా (స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) అర్హులు. 40 శాతం వైకల్యం ఉన్న వారు, 60 డెసిబల్స్ కంటే ఎక్కువ వినికిడి లోపం ఉన్న వారు, అంధత్వ లోపం ఉన్న వారు తప్పనిసరిగా సంబంధిత విభాగ వైద్యులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. స్థానికంగా నాలుగేళ్ల పాటు విద్యాభ్యాసం, ఏడేళ్ల పాటు స్థానికంగా ఉన్నట్లు ధ్రువీకరణ తప్పనిసరి. జిల్లా యూనిట్‌గా లోకల్‌గా గుర్తిస్తారు. 80 శాతం సీట్లు లోకల్‌కు, 20 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీకి కేటాయించారు. అంటే 844 పోస్టులు లోకల్‌గా, 21 పోస్టులు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. ►ఓసీ అభ్యర్థులు రూ.200 దరఖాస్తుకు, పరీక్ష ఫీజుకు రూ.200లతో పాటు అదనంగా నాన్ లోకల్ కింద మూడు జిల్లాలను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. ప్రతి నాన్ లోకల్ జిల్లాకు రూ.100 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు మాత్రం దరఖాస్తు రుసుం రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. ►ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికులు /ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు మూడేళ్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వయసును బట్టి గరిష్టంగా ఐదేళ్లు ఉంటుంది. అదే విధంగా వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, చట్టబద్దంగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళలు ఎస్సీ, ఎస్టీలు అయితే 48 ఏళ్లు, ఇతరులకు 43 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితిగా పేర్కొన్నారు. దరఖాస్తు ఇలా.. గ్రామ సచివాలయం.ఎపి.జిఓవి.ఇన్ అనే వెబ్సైట్లో తమ వివరాలను పొందుపరిస్తే యూజర్ ఐడీ జెనరేట్ అవుతుంది. దానికి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని జతచేస్తే వన్‌టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) వస్తుంది. దానికి పాస్‌వర్డు అభ్యర్థి పుట్టిన తేదీ. ఇందులో లాగినై పూర్తి వివరాలు పొందుపరిచిన అనంతరం సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన వివరాలను సవరించాలనుకుంటే ప్రతి సవరణకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. పేరు, ఫీజు వివరాలు, వయసులను మాత్రం సవరించేందుకు అవకాశం ఉండదు. ఎంపిక ఇలా.. జిల్లా స్థాయిలో జిల్లా ఎంపిక కమిటీ ఉంటుంది. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాత పరీక్ష సెప్టెంబర్ 1వ తేదీ నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్–ఎలో జనరల్ స్టడీ విభాగం కింద 75 ప్రశ్నలకు 75 నిమిషాల్లో జవాబులు రాయాలి. పార్ట్–బిలో భారత చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం భౌగోళిక శాస్త్రాలకు సంబంధించిన అంశాలపై 75 ప్రశ్నలను 75 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, తప్పు సమాధానానికి 1/4 మార్కు కటింగ్ ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు 40, బీసీ 35, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు పొందాలి. పరీక్ష సమయంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాలులోకి అనుమతించరు. వెయిటేజీ ఇలా.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, హోమ్ గార్డులుగా ప్రభుత్వ విభాగాలు, పోలీసు శాఖలో పనిచేస్తున్న వారికి వెయిటేజీ కేటాయించారు. ప్రతి ఆరు నెలల సర్వీసుకు 1.5 మార్కులు కేటాయిస్తారు. గరిష్టంగా 15 మార్కులు కేటాయిస్తారు. అయితే వారి సర్వీసు అంత కంటే తక్కువ ఉంటే మాత్రం 1.5 మార్కుల చొప్పున ఎన్ని మార్కులు వస్తాయో అన్నే కేటాయిస్తారు. సర్వీసు ఎక్కువైనా 15 మార్కులకు మించి వెయిటేజీ ఇవ్వరు. పరీక్ష, ఫలితాలు తదితరాల కోసం అభ్యర్థులు గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌ను క్రమంగా చూసుకుంటూ ఉండాలని అభ్యర్థులకు డీజీపీ స్పష్టం చేశారు. -
మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై కిరాతకం
వెల్లూరు : సాధారణ స్త్రీలకే కాక, మహిళా పోలీసు కానిస్టేబుళ్లకు సైతం దేశంలో భద్రత కరువైంది. వెల్లూరు జిల్లా తిరుప్పతూర్లో ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేసి కిరాతకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. లావణ్య అనే పోలీసు కానిస్టేబుల్, రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. లావణ్యకు, తన భర్తకు గత కొంతకాలంగా గొడవలు ఉండటంతో, ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. చికిత్స నిమిత్తం లావణ్యను వెంటనే వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. లావణ్య ముఖం, చేతులు యాసిడ్ దాడితో తీవ్రంగా గాయపడ్డాయని పోలీసులు చెప్పారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని కనుగొనేందుకు వెంటనే దర్యాప్తు ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు.