నారీ స్వారీ! | 10 Women Constables Join Mounted Police Wing | Sakshi
Sakshi News home page

నారీ స్వారీ!

Aug 13 2025 12:12 AM | Updated on Aug 13 2025 12:12 AM

10 Women Constables Join Mounted Police Wing

శారీరక దృఢత్వం భావోద్వేగాలను బ్యాలెన్స్‌ చేసుకోగల మానసిక బలాన్నిపెంచి... కరిగిపోని కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది! అది జీవన దృక్పథాన్నే మార్చేస్తుంది! ఇలాంటి అద్భుతాలను క్రియేట్‌ చేసే కొలువులున్నాయి.. వాటిల్లో రాణించే అమ్మాయిలున్నారు! ఆ ఫోర్సే.. మౌంటెడ్‌ పోలీస్‌.. పదిమంది నారీమణులతో కూడిన ఆ అశ్వదళం హైదరాబాద్‌ను పహారా కాస్తోంది.. సెల్ఫ్‌ ప్రోటెక్షనే కాదు.. శాంతిభద్రతల పర్యవేక్షణలోనూ స్త్రీ శక్తిని చాటుతోంది!

ఇంట్లో ఆడపిల్ల వీథి చివరన ఉన్న ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లాలన్నా తమ్ముణ్ణి తోడు ఇచ్చే పంపే కాలానికిక చెల్లు ఏమో అనిపిస్తోంది.. హైదరాబాద్‌లోని కీలక్రపాంతాల్లో గుర్రాల మీద గస్తీ తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అశ్వదళ మహిళా పోలీసులను చూస్తుంటే! నిజానికి వాళ్లను మహిళా పోలీస్‌ అంటే వాళ్లనలా తీర్చిదిద్దిన వాళ్ల దళాధిపతులు .. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ డీసీపీ రక్షితామూర్తి ఒప్పుకోరు.

‘జాబ్‌కి జెండర్‌ ఏంటీ.. శక్తిసామర్థ్యాలు ప్రామాణికం కానీ..’ అంటారు. అందుకే తొలిసారిగా.. ఏఆర్‌ (ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌) పోలీస్‌లోని పదిమంది అమ్మాయిలను అశ్వదళంలోకి ఆహ్వానించి.. వారికి గుర్రపు స్వారీలో శిక్షణనిప్పించి విధులను అప్పగించారు. వీళ్లు ప్రతి శుక్రవారం మక్కా మసీదు, చార్మినార్‌ దగ్గర, రోజు విడిచి రోజు లేక్‌ డ్యూటీలు చేస్తున్నారు. ర్యాలీలు, పండగలు, గణేశ నవరాత్రులు, శోభాయాత్రలు వంటి సందర్భాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

శక్తి చూపించింది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.. 
ఈ దళంలోని పదిమంది అమ్మాయిలది భిన్న నేపథ్యం. కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరినప్పటికీ మౌంటెడ్‌ పోలీస్‌ అంటే వాళ్లెవరికీ తెలియదు.. ఆ ఫోర్స్‌ గురించి నోటీస్‌ వచ్చేదాకా. ఏఆర్‌ పోలీస్‌లో రెండువందల మందికి పైగా మహిళలుంటే మౌంటెడ్‌ పోలీస్‌లో చేరడానికి పదిమంది మాత్రమే ముందుకు వచ్చారు. మౌంటెడ్‌ పోలీస్‌ అంటే ఏంటో రీసెర్చ్‌ చేశారు. ‘ట్రైనింగ్‌ టఫ్‌గా ఉంటుంది.. ఫిట్‌నెస్‌ చాలా అవసరం.. ఆసక్తి ఉంటేనే రండి’ అని ట్రైనర్‌ చెప్పాక  దాన్నో సవాలుగా తీసుకున్నారు. శిక్షణలో గుర్రాల మీద నుంచి పడ్డారు. దెబ్బలు తగిలాయి. అయినా వెనుకడుగు వేయలేదు.

గుర్రాలను మాలిమి చేసుకోవడంలో కొన్ని మెళకువలను కనుగొన్నారు. గుర్రాలు చెప్పినట్టు వినడం మొదలెట్టాయి. అలా శిక్షణలోని ఆంతర్యాన్ని పసిగట్టి.. తదనుగుణంగా ముందుకు సాగారు. ఆ ట్రైనింగ్‌ వాళ్ల ఆత్మస్థయిర్యాన్నే కాదు.. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌నూ పెంచింది. జీవన దృక్పథాన్నే మార్చింది. విధి నిర్వహణలో వాళ్లు గుర్రాలను మచ్చిక చేసుకోవడం దగ్గర్నుంచి, తమ కమాండ్స్‌తో వాటిని చెప్పుచేతల్లో పెట్టుకోవడం మొదలు.. జనసమ్మర్ధంలో పరిస్థితిని అదుపు తప్పకుండా చూసుకోవడం వరకు మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. 

ఈ దళంలో పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న కానిస్టేబుల్‌ అఖిల కూడా ఉన్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు సభ్యులు సుభద్ర, హవంతిక ఈ కొత్త కొలువు గురించి వివరించారు. మగవాళ్లకే పరిమితమైన కొలువుల్లోకి మహిళలు వస్తే.. పనిప్రదేశం లో విమెన్‌ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని ఈ అశ్వదళం నిరూపించింది.
– సరస్వతి రమ – ఫొటోలు: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది.. 
ఎస్సై కావాలని, గృహ హింస మీద మహిళలకు అవగాహన కల్పించాలనేది నా లక్ష్యం. దానికోసమే రీసెంట్‌గా డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాను. ముందు కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ పడేసరికి ఇందులో చేరిపోయాను. కొత్త పనులు చేయడమన్నా, నేర్చుకోవడమన్నా చాలా ఇష్టం. అందుకే మౌంటెడ్‌ పోలీస్‌ గురించి చెప్పగానే అందులో చేరడానికి అందరికన్నా ముందుగా నేను చెయ్యెత్తాను.

అయితే నాకు రెండు డెలివరీలూ సిజేరియనే అవడంతో మౌంటెడ్‌ పోలీస్‌కి కావల్సినంత ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ లేక ట్రైనింగ్‌ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. వెనక్కి వెళ్లిపోతే మిగిలిన అమ్మాయిలు నిరుత్సాహపడతారేమో అనిపించింది. ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ పెట్టాను. కాన్ఫిడెన్స్‌ వచ్చింది. లైఫ్‌ పట్ల అప్పటిదాకా నాకున్న దృక్పథమే మారిపోయింది. లేనిదాని గురించి దిగులుపడే బదులు ఉన్నదాని గురించి పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలో తెలుసుకున్నాను. జీవితంలోని కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది – అఖిల

ఉత్సాహం.. ప్రోత్సాహం.. 
చిన్నప్పటి నుంచీ విలక్షణంగా... విభిన్నంగా ఉండాలనే తపన. అందుకే ఈ పోలీస్‌ జాబ్‌లోకి వచ్చాను. అది రొటీన్‌ అయిపోతోందనుకుంటున్నప్పుడే మౌంటెడ్‌ పోలీస్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. గుర్రపు స్వారీ కష్టమని  మా నాన్న వద్దన్నారు. కానీ ఆయన్ని ఒప్పించి ట్రైనింగ్‌లో చేరాను. నన్ను డ్యూటీలో చూసిన మా బంధువులు ‘నీ బిడ్డ ఠీవిగా భలే డ్యూటీ చేస్తోంద’ని తనతో చెబుతున్నారని మా నాన్న నాతో షేర్‌ చేసుకుంటున్నప్పుడు ఆయన కళ్లల్లో కనిపించే గర్వం చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఐపీఎస్‌ కావాలనే నా లక్ష్యానికి తగిన ప్రోత్సాహన్నిస్తుంది. –  మర్రి హవంతిక

బ్యాలెన్సింగ్‌ నేర్చుకున్నాను..
చిన్నప్పటి నుంచీ నాకు టఫ్‌ టాస్క్స్‌ అంటే ఇష్టం. అందుకే కరాటే, టైక్వాండో నేర్చుకున్నాను. స్పోర్ట్స్‌లో కూడా ముందుండేదాన్ని. ఆ స్పిరిటే నన్ను పోలీస్‌ జాబ్‌ వైపు, మౌంటెడ్‌ పోలీస్‌ వైపు మళ్లేలా చేసింది. ఈ కొలువు నాకో కొత్త చాలెంజ్‌. గుర్రపు స్వారీతో లైఫ్‌ బ్యాలెన్సింగ్‌ను నేర్చుకున్నాను. నా భవిష్యత్‌ లక్ష్యం గ్రూప్‌ వన్‌ ఆఫీసర్‌. 
– సుభద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement