రోడ్డు ప్రమాదం.. నిందితుడిని అరెస్టు చేయరా?

Road Accident Tragedy: Woman Tweet To Police In Hyderabad - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): మద్యం మత్తులో అదుపు తప్పిన వేగంతో దూసుకెళ్తూ.. ఇద్దరి యువకుల మరణానికి కారకుడైన నిందితుడిని ఇంకా అరెస్ట్‌ చేయకపోవడం పట్ల నగరానికి చెందిన ఓ యువతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదేం తీరు అంటూ పోలీసులకు ట్వీట్‌ చేసింది.

వివరాలివీ... ఉప్పల్‌కు చెందిన బజార్‌ రోహిత్‌గౌడ్‌ తన స్నేహితులు వేముల సాయి సోమన్, నాగోలు అలకాపురి కాలనీకి చెందిన బిల్డర్‌ కోసరాజు వెంకటేష్‌(28)లు ఈ నెల 6న తెల్లవారుజామున జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో మద్యం సేవించి మత్తులో పోర్షే కారులో దూసుకెళ్తూ బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 2లోని రెయిన్‌బో ఆస్పత్రి ఎదురుగా రోడ్డు దాటుతున్న ఆయోధ్యరాయ్, దేవేంద్రకుమార్‌ దాస్‌లను ఢీకొట్టారు.

ఈ ఘటనలో అయోధ్యారాయ్, దాస్‌ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురూ కలిసి కారులో ఘటన స్థలం నుంచి పరారయ్యారు. పోలీసులకు చాకచక్యంగా ఈ కారును గుర్తించి అదే రోజు రోహిత్‌గౌడ్, సాయి సోమన్‌లను అదుపులోకి తీసుకోగా పోలీసులకు కట్టు కథలు చెప్పి వెంకటేష్‌ పరారయ్యాడు. నాలుగు రోజుల క్రితం మరింత సమాచారం కోసం బంజారాహిల్స్‌ పోలీసులు రోహిత్‌గౌడ్, సాయి సోమన్‌లను కస్టడీలోకి తీసుకోగా విచారణలో తమతో పాటు కారులో ఘటన జరిగినప్పుడు వెంకటేష్‌ కూడా ఉన్నాడని తెలిపారు.

దీంతో వెంకటేష్‌పై కూడా పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 304(2) కింద కేసు నమోదు చేశారు. ఇంత వరకు వెంకటేష్‌ను అరెస్ట్‌ చేయకపోవడం లేదేమిటంటూ ఆమె ట్వీట్‌ చేశారు. సామాన్యులకు ఒక న్యాయం, సంపన్నులకు ఇంకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. వెంకటేష్‌ను అరెస్ట్‌ చేయకపోవడానికి గల కారణాలేంటంటూ ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top