పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణం
వివాహేతర సంబంధం, అనుమానంతోనే ఘాతుకం
పిడుగురాళ్ల: వివాహేతర సంబంధం, అనుమానంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆటో ఎక్కుతున్న ఓ మహిళను వ్యక్తి హతమార్చాడు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. అచ్చంపేట మండలం వేల్పూరుకి చెందిన మహిళ(35)కు రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బత్తుల గోవిందుతో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల మహిళ తనను దగ్గరకు రానివ్వడం లేదని గోవిందు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను రెండు నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు.
గురువారం ఓ కార్యక్రమానికి తన పెద్దమ్మ, అక్కతో కలిసి బాధిత మహిళ సత్తెనపల్లి వెళ్లింది. తిరిగి బస్సులో పిడుగురాళ్ల వస్తుండగా..అదే బస్సులో గోవిందు ముసుగు ధరించి ఎక్కాడు. పిడుగురాళ్లలో మహిళ, ఆమె పెద్దమ్మ, అక్క బస్సు దిగి వెళ్తుండగా..గోవిందు వారిని అనుసరించాడు. తన ఇంటికి వెళ్లడానికి గానూ మహిళ, ఆమె బంధువులు పోలీస్‌స్టేషన్ వద్ద ఆటో ఎక్కుతుండగా.. మహిళపై కత్తితో గోవిందు విచక్షణరహితంగా పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనలో మహిళ పెద్దమ్మకు, అక్కకు స్వల్పగాయాలయ్యాయి.
తీవ్ర గాయాలపాలైన మహిళను స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేశారు.కాగా, గోవిందు రోడ్డు కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. గతంలో భార్యను హత్య చేసి ఆ కేసులో కూడా జైలు శిక్ష అనుభవించినట్లు తెలుస్తోంది. హతురాలి భర్త గతంలో మృతి చెందాడు. రోడ్డు కాంట్రాక్ట్ పనులకు వెళ్లినప్పుడు గోవిందుతో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు సమాచారం.


