వారిని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వండి
హైకోర్టులో కుటుంబసభ్యుల హెబియస్ కార్పస్ పిటిషన్
వారిని నిర్బంధించలేదని హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం
9 మంది కీలకనేతలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులే చెప్పారు
ఆ వీడియోను కోర్టు ముందుంచుతామన్న పిటిషనర్ల న్యాయవాది
తదుపరి విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దేవ్‌జీ సోదరుడు తిప్పిరి గంగాధర్, రాజిరెడ్డి కుమార్తె స్నేహలత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ తుహిన్‌కుమార్ గేదెల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
పిటిషనర్ల న్యాయవాది యు.జైభీమారావు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 18న పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మృతి చెందారన్నారు. ఇదే సమయంలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు నిర్బంధించారని చెప్పారు. వారిని కోర్టుముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమణి విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల అదుపులో లేరని చెప్పారు. అరెస్ట్ చేసిన 50 మంది మావోయిస్టులను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని నివేదించారు. దేవ్‌జీ, రాజారెడ్డిలను అక్రమంగా నిర్బంధించారన్న వాదనలో వాస్తవం లేదన్నారు.
పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలేమున్నాయి?
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నారనేందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఏ ఆధారాలతో వారు పోలీసుల అదుపులో ఉన్నారని చెబుతున్నారని ప్రశ్నించింది. ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటే.. అక్రమ నిర్బంధంపై ప్రాథమిక ఆధారాలుండాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు తాము చేయగలిగిందీ ఏమీ లేదని పేర్కొంది. పిటిషనర్ల న్యాయవాది జైభీమారావు స్పందిస్తూ.. దేవ్‌జీ, రాజారెడ్డిల సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఎన్‌కౌంటర్ తరువాత పోలీసులు మీడియాతో మాట్లాడుతూ 9 మంది కీలకనేతలు తమ ఆ«దీనంలో ఉన్నట్లు చెప్పారని, ఆ వీడియోను కోర్టు ముందుంచుతామని చెప్పారు. దీంతో ధర్మాసనం.. దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలను తమ ముందుంచాలని పిటిషనర్ల న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేసింది.


