కిలో బెల్లం దిమ్మలకు కొనుగోలుదారుల నుంచి విశేష ఆదరణ
చిన్న బెల్లం దిమ్మలకు గిరాకీ పెరిగింది. ఎటువంటి హానికర రసాయనాలు
వినియోగించకుండా తయారు చేస్తున్న కిలో బరువున్న బెల్లం దిమ్మలకు
కొనుగోలు దారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సహజ సిద్ధంగా,
రుచికరంగా తయారు చేస్తుండడంతో డిమాండ్ ఏర్పడింది.
కశింకోట: చిన్న పరిమాణం, తరలింపునకు అనువుగా ఉండటంతో పాటు హైడ్రోస్ వంటి హానికర మందులు వినియోగించకుండా తయారు చేస్తున్న చిన్న బెల్లం దిమ్మలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఆ రైతులు కూడా పెద్ద దిమ్మల తయారీకి స్వస్తి పలికి కేవలం కిలో పరిమాణం కలిగిన చిన్న దిమ్మలను తయారు చేస్తున్నారు. వీటిని తమ చెరకు క్రషర్ల వద్దే విక్రయిస్తుండడంతో దారిన వెళ్లే ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు మిగిలి, లాభదాయకంగా ఉండటంతో మరింత ఎక్కువ సంఖ్యలో తయారు చేసేందుకు రైతులు దృష్టి సారించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని తాళ్లపాలెం వద్ద వీటిని తయారు చేస్తున్నారు.
తాళ్లపాలెం ప్రాంతంలో రైతులు గతంలో పెద్ద ఎత్తున చెరకు సాగు చేసి, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీకి సరఫరా చేసే వారు. 8 ఏళ్ల క్రితం పరిశ్రమ మూత పడటంతో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లారు. మరి కొంత మంది బెల్లం తయారీ చేపట్టారు. బెల్లం తయారు చేసి అనకాపల్లి మార్కెట్‌కు తరలించడం, రవాణా ఖర్చులు, క్రషర్ అద్దెలు, వ్యాపారి కమిషన్ వగైరా పోనూ టన్నుంపావు చెరకు వినియోగించి తయారు చేసిన పాకం బెల్లానికి రూ.నాలుగైదు వేలు వరకు ఆదాయం వచ్చేది. 40 పాకాలు కావలసిన ఎకరం చెరకు తోట ఎదుగు బొదుగు లేక పది పాకాలు బెల్లం దిగుబడికి పడిపోతున్న పరిస్థితి. పంటకు పెట్టిన పెట్టుబడి రాని దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇద్దరు రైతులు... ప్రజలు సులభంగా తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకెళ్లే విధంగా ఆరోగ్యకరమైన బెల్లాన్ని కిలో చిన్న పరిమాణంలో తయారు చేయడం చేపట్టారు.
వాటిని విక్రయిస్తే రూ.7 వేల వరకు పాకం బెల్లానికి ఆదాయం వస్తోంది. పైగా హైడ్రోస్ వంటి హానికర మందులకు స్వస్తి పలికి సహజ సిద్ధంగా తయారు చేస్తున్నారు. ఈ చిన్న దిమ్మల తయారీని వారు ఆరేళ్ల క్రితం చేపట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సొంతంగా సాగు చేసుకున్న చెరకుతోపాటు ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి మరీ బెల్లం తయారీకి వినియోగిస్తున్నారు. దిమ్మలతోపాటు బెల్లం తేనెను కూడా తయారు చేస్తున్నారు. బెల్లం గడ్డ కట్టడానికి ముందు ద్రవ రూపంలో ఉన్న తేనెను సేకరించి సీసాల్లో నింపి కిలో రూ.50 నుంచి రూ.60కి విక్రయిస్తున్నారు.
తేనెను ఫ్రూట్స్ జామ్‌లా బ్రెడ్‌లతోను, టిఫిన్లతోను తినడానికి రుచికరంగా ఉండటంతో పలువురు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. పాకం బెల్లానికి దిగుబడి అనుసరించి వంద నుంచి 130 వరకు దిమ్మలు తయారు అవుతున్నాయి. ఒక్కో దిమ్మను రూ.50 నుంచి రూ.60కి విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్‌కు తరలించే బెల్లానికి వచ్చే ఆదాయం కంటే అదనంగా రూ.2 వేల వరకు సమకూరుతోంది.
లాభదాయకంగా చిన్న దిమ్మల తయారీ
చిన్న పరిమాణంలో బెల్లం దిమ్మల తయారీ లాభదాయకంగా ఉంది. పెద్ద దిమ్మలను తయారు చేసి బెల్లం మార్కెట్‌కు తరలిస్తే ఆదాయం తక్కువగా వచ్చేది. అదే చిన్న దిమ్మలుగా హైడ్రోస్ వంటి హానికర మందులు వినియోగించకుండా తయారు చేసి విక్రయిస్తే అదనంగా రెండు వేల వరకు ఆదాయం సమకూరుతోంది. రవాణా, చిల్లర ఖర్చులు కూడా మిగులుతున్నాయి. గతంలో తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీకి చెరకును ఎక్కువగా సరఫరా చేసేవారం. అది మూతపడటంతో ప్రస్తుతం చిన్న బెల్లం దిమ్మల తయారీని ఎంచుకున్నాం.ఎక్కువ మంది రైతుల జీవనోపాధికి ఉపయోగపడే సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం మళ్లీ తెరిపిస్తే రైతులకు పూర్వ వైభవం రావడానికి అవకాశం కలుగుతుంది.
– చిన్ని కోటేశ్వరరావు, రైతు, తాళ్లపాలెం.


