వెదురు సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేత
మొక్క నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి ప్రారంభం
ఒక్క ఏడాది సాగు చేస్తే 40 ఏళ్లదాకా రాబడి
పర్యావరణ పరిరక్షణలో వెదురు మొక్కల పాత్ర అమోఘం
కడప అగ్రికల్చర్ : నీటి వనరులు ఓ మోస్తరుగా ఉన్నాయా.. పర్లేదు సాగు చేయొచ్చు.. చీడపీడలు సోకవు...తెగుళ్ల భయమే అక్కరలేదు. మొక్క రోజురోజుకు పెరుగుతూ వస్తుంది.. ఇక పర్యావరణ పరిరక్షణలోనూ అమోఘంగా పని చేస్తుంది.. అదే వెదురు సాగు. మొక్క నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమై.. 40 ఏళ్ల వరకు రైతుకు రాబడి సమకూర్చుతుంది. వెదురు సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నాయి. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ అధికారులను కలిస్తే చాలు.. పంట సాగుకు తొలి అడుగు పడినట్లే.
బీడు భూములను సస్యశ్యామలంగా.....
బీడు భూములను సస్యశ్యామలంగా చేయటంలో వెదురు కీలక పాత్ర పోషిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో వెదురు మొక్కల పాత్ర అమోఘమైనది. ఇవి అధిక ఆమ్లకర్బనాన్ని గ్రహించి, గాలిలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీంతో వాయు కాలుష్యం తగ్గుతుంది. అలాగే ఇవి వర్షపు నీటిని నేలలోకి చొప్పించి భూగర్భ జలాలను నింపుతాయి. వెదురు వనం సృష్టించడం ద్వారా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయవచ్చు.
వెదురులో యాంటీ ఆక్సిడెంట్లు, పైబర్‌తో షోషకాలు మెండు...
వెదురు మొగ్గలను ఆహారంగా కూడా వినియోగిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో చాలా మంది ఔత్సాహిక రైతులు వెదురు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పోరుమామిళ్ల, కాశినాయన, బద్వేల్ ప్రాంతాల్లో కొంత మంది రైతులు ప్లాంటేషన్ కూడా చేశారు.
ప్రోత్సాహకాలు...
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వెదురు సాగు కోసం పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. జాతీయ వెదురు మిషన్ (National Bamboo Mission) ద్వారా రైతులకు శిక్షణ అందించబడుతుంది. ఉద్యాన శాఖ ద్వారా కూడా సబ్సిడీ సహాయాలు లభ్యమవుతున్నాయి. వెదురు మొక్కల కోసం నర్సరీ ఆక్ట్ నందు రిజిస్టర్ చేసున్న నర్సరీల నుంచి లేదా ప్రభుత్వ అటవీ శాఖ సంస్థల నుండి లేదా ఉద్యాన ఫారమ్స్ నుంచి తీసుకున్న మొక్కలకి రాయితీ వర్తిస్తుంది.
హెక్టారుకు 400 మొక్కలు....
ఒక హెక్టారుకు 400 మొక్కలు అవసరం ఉంటుంది. వీటిని 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు దూరంలో బ్లాక్ ప్లాంటేషనే చేసుకోవాలి. ఇతర తోటల సరిహద్దులో (boundary plantation), బీడు భూముల్లో (fallow lands) నాటే వెదురుకు హెక్టారుకు 60,000ల వరకూ రాయితీ లభిస్తుంది.
మొదటి సంవత్సరం: మొదటి సంవత్సరము గుంతలు తీసుకోవడానికి రూ.3000లు, మొక్కలకు రూ.6250లు , ఎరువుల కోసం రూ. 7850లు, మొక్క నాటుటకు, ఊతం (స్టెకింగ్) కోసం రూ.2900లు, అంతర సేద్యము కోసం రూ.8500లు కలుపు, నీటి యజమాన్యం కోసం రూ.7500లు.. వెరసి రూ. 36000లను ఇస్తుంది.
రెండవ సంవత్సరం: రెండవ సంవత్సరంలో ఎరువులకు రూ.10000, అంతర సేద్యానికి రూ. 7000, కలుపు, నీటి యజమాన్యానికి రూ.7000లు వెరసి రూ. 24000లను రైతులకు అందచేస్తున్నారు.
5 ఏళ్ల నుంచి దిగుబడి ప్రారంభం....
వెదురు నాటిన 5 వ సంవత్సరం నుంచి ఎకరాకు 10 నుంచి 14 టన్నుల వరకు గడలు దిగుబడిగా పొందవచ్చు. మొదటి సంవత్సరంలో మొక్కల ఖర్చు, నేల తయారి, ఎరువులు కూలీల ఖర్చు మినహాయిస్తే తదుపరి సంవత్సరములలో కోతకు తప్ప ఎటువంటి ఖర్చు ఉండదు. గడల పరిమాణం నాణ్యతను బట్టి టన్ను ధర గరిష్టంగా 27,000ల వరకూ ఉంటుంది. ప్రారంభ దశలో ఖర్చులు పోగా 6వ సంవత్సరం నుంచి ఎకరాకు 1,50,000ల పైబడి ఆదాయాన్ని పొందవచ్చు.
సాగు అత్యంత వేగంగా..
వెదురు (బాంబూ) అనేది అత్యంత వేగంగా పెరిగే మొక్కలలో ఒకటి. పచ్చదనం కలిగించి, పునరుత్పత్తి అయ్యే సహజ వనరుగా వెదురు పరిగణించబడుతుంది. ఇది ఉద్యాన రంగంలో కొత్త అవకాశాలను కలిగిస్తుంది. వెదురు మామూలుగా తేమతో కూడిన వాతావరణంలో, వివిధ రకాల నేలల్లో బాగా పెరుగుతాయి. ఇది అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల శక్తిని కూడా కలిగి ఉండటంతో భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో వెదురు విస్తృతంగా సాగులో ఉంది.
13.96 మిలియన్ హెక్టార్లలో వెదురు సాగుతో భారతదేశం రెండవ అతిపెద్ద ప్రపంచ వెదురు ఉత్పత్తిదారుగా ఉంది. ఒకసారి నాటిన వెదురు మొక్కలు 40 ఏళ్ల వరకు లాభదాయకంగా నిలుస్తాయి. ఈ పంటకు చీడ పీడల తాకిడి కూడా ఉండకపోవడంలో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. రైతు వద్ద లభ్యమయ్యే తక్కువ వనరులను ఉపయోగించి స్థిరమైన ఆదాయాన్ని పొందడంలో వెదురు ప్రథమ స్థానంలో నిలుస్తుంది.
వెదురు సాగు చేసే రైతులు...
జిల్లాలో వెదురు సాగు చేయాలనే ఆసక్తి ఉన్న రైతులను వారికి సమీపంలోని రైతు సేవా కేంద్రాలను లేదా మండల ఉద్యానశాఖ అధికారిని సంప్రదించాలి. వారికి అవసరమైన మొక్కలను నర్సరీల నుంచి లేదా ఫారెస్ట్ డిపార్టుమెంట్ నుంచి లేదా ఉద్యాన నర్సరీల నుంచి తెప్పించి ఇస్తాం. దీంతోపాటు సాగుకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తాం. ఆసక్తిగల రైతులు ఆశ్రయించాలి.
– సతీ‹Ù, జిల్లా ఉద్యానశాఖ అధికారి, వైఎస్సార్‌జిల్లా
వెదురు వినియోగం అనేకం
వెదురు వినియోగం అనేక రంగాల్లో విస్తరించి ఉంది. ఇది ప్రాచీన కాలంనుంచి ఇంటి నిర్మాణంలో, అగరబత్తిలు, బుట్టల తయారీలో ఉపయోగించబడుతుంది. నేటి ఆధునిక సాంకేతికత ద్వారా ఫరి్నచర్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, డెకరేటివ్ వస్తువులు తయారవుతున్నాయి. వెదురు ఆకులను డికాక్షన్‌గా ఉపయోగించి జీర్ణ సంబంధిత సమస్యలు, నోటిపూత, చర్మ సమస్యలకు ఉపశమనం పొందవచ్చు.


