వివేకా కేసు: టీడీపీ నీచ స్థాయికి దిగజారింది, ఓ పథకం ప్రకారమే..

Viveka Case: Sajjala Ramakrishna Reddy Slams TDP - Sakshi

సాక్షి, గుంటూరు: వివేకా హత్య కేసులో యెల్లో మీడియా యథేచ్ఛగా ట్రయల్‌ చేస్తోందని, అధికారం ఉంటే తీర్పు కూడా ఇచ్చేదేమోనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాజా పరిణామాలపై తాడేపల్లిలో ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. 

వివేకా హత్యపై ఎల్లో మీడియా కల్పితాలు ప్రచారం చేస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే దస్తగిరి మాటల్ని పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. అతని మాటలకు అధిక ప్రచారం కల్పిస్తున్నారు. కానీ, అతని స్టేట్‌మెంట్లు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే.. కావాలనే దస్తగిరిని ఆర్గనైజ్‌ చేసి మాట్లాడించినట్లు కనిపిస్తోందని సజ్జల పేర్కొన్నారు. విపక్షాల పొలిటికల్‌ ఎజెండాలో భాగంగానే అవినాష్‌కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారాయన.   

బాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే.. 
వివేకా కేసును రాజకీయ ఎజెండాలో భాగంగానే టీడీపీ వాడుకుంటోందని.. తద్వారా నీచ స్థాయికి దిగజారిందని సజ్జల విమర్శించారు. ‘‘చంద్రబాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే ఇదంతా నడుస్తోంది. ఓ ప్లాన్‌ ప్రకారమే పొలిటికల్‌ ఎజెండాగా మార్చుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్రకు తెరలేపారు. నేరం మోపాలని ముందుగానే నిర్ణయానికి వచ్చారు. తమ పాలనలో ప్రజలకు ఏం చేశామన్నది చెప్పుకోవడానికి టీడీపీ దగ్గర ఏం లేదు. అందుకే వివేకా కేసును ఓ ప్రథకం ప్రకారమే వాడుకుని.. సీఎం జగన్‌ ప్రతిష్టను దిగజార్చే విధంగా కుట్ర చేస్తోంది. జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియకే ఈ నాటకాలు. రాబోయే ఎన్నికల కోసం ఓ కథను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో పని చేస్తుందేమోనని టీడీపీ దురాశ అని సజ్జల చెప్పుకొచ్చారు. 

ప్రత్యక్ష సాక్షిని పట్టించుకోదా?
వివేకా కేసులో టీడీపీ అనుకూల ఎల్లో మీడియా కల్పితాలు ప్రచారం చేస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక కుట్రలు చేస్తోంది. కట్టుకథలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఎలా హత్య చేశాడన్నది దస్తగిరి స్వయంగా చెప్పాడు. అసలు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి బెయిల్‌ ఇప్పించిందెవరు?. ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్‌ రంగన్న ఉండగా.. అప్రూవర్‌ మాటల్ని ఎందుకు సీబీఐ పట్టించుకుంటోంది. కేసు తేలని సమయంలోనే అప్రూవర్‌గా మార్చారని, విచారణ పేరుతో ఓ డ్రామా నడిపిస్తున్నారని సజ్జల అన్నారు. వివేకా కేసులో ఇష్టానుసారం సీబీఐ పేర్లు చేరుస్తుంటే.. ఎల్లో మీడియా ప్రింట్లు వేస్తోందని సజ్జల ఎద్దేవా చేశారు.

కొత్త బృందం ఏం చేసింది?
మరోవైపు ఈ కేసులో సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో హడావిడి చేస్తోందని సజ్జల అసహనం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు పూర్తైనట్లు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. కానీ, స్టేట్‌మెంట్లు తీసుకోవడం తప్ప సీబీఐ దర్యాప్తు చేయడం లేదు. విచారణ పేరుతో డ్రామా జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు పేరుతో ఓ తతంగం నడిపిస్తున్నారు. కీలక విషయాల్ని పట్టించుకోలేదనే దర్యాప్తు అధికారిని మార్చారు. కానీ, కొత్త బృందం ఒక్క ఆధారాన్ని అయినా సేకరించిందా? అని సజ్జల ప్రశ్నించారు.  

ఊహాజనితంగా మేం ప్రశ్నించడం లేదు. ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారనే మా బాధ.  దర్యాప్తు పేరుతో జరుగుతున్న తతంగాన్ని ఎదుర్కొంటాం. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలపై కేసులు నిలవడవు. కొంతకాలం ఇబ్బంది పెడతారేమో కానీ చివరకు న్యాయమే గెలుస్తుందని సజ్జల అన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top