మొద్దు నిద్ర వీడిన ‘ఉక్కు’ యాజమాన్యం | Visakhapatnam Steel Plant Management Wakes Up To Safety Concerns After Fatal Accident Claims Nine Lives | Sakshi
Sakshi News home page

మొద్దు నిద్ర వీడిన ‘ఉక్కు’ యాజమాన్యం

Jun 11 2026 4:45 AM | Updated on Jun 11 2026 10:58 AM

Visakhapatnam Steel Plant management gives written assurance on safety measures

9మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత భద్రతా లోపాలపై సమావేశం  

భద్రతా అంశాలపై రాతపూర్వక హామీతో ఉత్పత్తి పునఃప్రారంభం 

రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక నేతల డిమాండ్‌ 

ఉక్కునగరం (విశాఖ): ఘోర ప్రమాదం జరిగి, తొమ్మిది మంది అసువులుబాసిన తర్వాత గానీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం మొద్దు నిద్ర వీడలేదని, స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి అకస్మాత్తుగా భద్రతా అంశాలు గుర్తొచ్చాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిగా భద్రతా లోపాలపై కార్మిక సంఘాలు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. 

ఈ ప్రమాదం కారణంగా కోట్ల రూపాయల విలువైన యంత్రాలు దెబ్బతినడంతో పాటు సుమారు రూ.100 కోట్ల మేర ఉత్పత్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ స్టీల్‌ మెల్ట్‌ షాప్‌–1 (ఎస్‌ఎంఎస్‌–1) విభాగం కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో యాజమాన్యం బుధవారం సమావేశం నిర్వహించింది. డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) సుభసిస్‌ సేన్‌గుప్తా, డైరెక్టర్‌ (పర్సనల్‌) ఇన్‌చార్జి ఎ.కె. బాగ్చి, ఇతర హెచ్‌ఆర్‌ అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో కార్మికులు పలు సమస్యలను ప్రస్తావించారు.  

దిద్దుబాటు చర్యలకు హామీ  
భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కావడం లేదని, అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు పేర్కొన్నారు. నాణ్యత లేని ముడి పదార్థాల వినియోగం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్పత్తి లక్ష్యాల ఒత్తిడితో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌వోపీలు) పాటించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రకటించిన రూ.25 లక్షల నష్టపరిహారం సరిపోదని, దానిని కనీసం రూ.కోటికి పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన యాజమాన్యం, నష్టపరిహారం అంశం తమ పరిధిలో లేదని, కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. భద్రతా ప్రమాణాలు, ఎస్‌వోపీలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షించి వెంటనే దిద్దు­బాటు చర్యలు చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. 

భద్రత చర్యలను నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయడంతో పాటు, ప్రమాదంపై విచారణ కమిటీ నివేదికను త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా అంగీకరించింది. సమావేశంలో జీఎం (హెచ్‌ఆర్‌) బినయ్‌ ప్రసాద్, ప్లాంట్‌ పర్సనల్‌ ఇన్‌చార్జి ఎన్‌. భాను, ఎస్‌ఎంఎస్‌ విభాగాధిపతి ఆచార్యులు, కార్మిక నా­యకులు కె.ఎస్‌.ఎన్‌.రావు, జె. అయోధ్యరామ్, రమ­ణమూర్తి, రమణ, సంపత్, మనోజ్, శకునాల చంద్రశేఖర్, ఎల్‌. సత్యనారాయణ, రంగప్రసాద్, రామకృష్ణ, వాసు, సాగర్, నాగరాజు, రాజేష్‌ పాల్గొన్నారు.

ఎస్‌ఎంఎస్‌–1లో ఉత్పత్తి పునఃప్రారంభం 
యాజమాన్యం భద్రతా చర్యలపై రాతపూర్వక హామీ ఇవ్వడంతో కార్మికులు, కార్మిక సంఘాలు శాంతించాయి. అనంతరం ఉత్పత్తి పునఃప్రారంభానికి అంగీకరించగా, బుధవారం మధ్యాహ్నం ‘బి’ షిఫ్ట్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌–1లో ఉత్పత్తి కార్యకలాపాలను పునఃప్రారంభించే చర్యలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement