విశాఖ ఉక్కు ఉద్యోగులపై వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందే
నిప్పులు చెరిగిన స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు
సాక్షి, విశాఖపట్నం: ‘‘స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పనిచెయ్యకుండా జీతాలివ్వమంటే ఎలా?’’ అంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మీకుల్లో రేగిన ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. అధికార అహంకారంతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని అఖిలపక్ష కార్మీక సంఘాల ప్రతినిధులు తేలి్చచెప్పారు. ప్లాంట్‌ను పరిరక్షిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికి గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగుల వైపు వేళ్లు చూపుతున్నారంటూ మండిపడ్డారు. దమ్ముంటే ప్లాంట్‌పై చర్చకు రావాలంటూ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, ఉత్పత్తి లక్ష్యాలను చేరుకుంటేనే 100 శాతం జీతాలు ఇస్తామంటూ ప్లాంట్ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్‌ను నిరసిస్తూ సోమవారం –యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్, అదే సమయంలో.. ఉద్యోగులను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మీక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగానే జీతాలు చెల్లిస్తామంటూ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. కార్మీకులకు చెల్లించాల్సిన జీతాలపై యాజమాన్యం అనాలోచిత నిర్ణయం తీసుకుని ఆదేశాలివ్వడం అత్యంత దుర్మార్గమని నినదించారు.
ఈ సందర్భంగా కార్మీక ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘అనకాపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని అడిగిన చంద్రబాబు, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు నోరెత్తలేదు? ఇదేనా ఆంధ్రుల హక్కుపై ఈ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి?’’ అంటూ నిలదీశారు. ఉత్పత్తి లక్ష్యాలకు జీతాలను ముడిపెడుతూ జారీ చేసిన సర్క్యులర్ వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర దాగి ఉందని చంద్రబాబు మాటలతో స్పష్టమైందన్నారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడంతో పాటు యాజమాన్యం సర్క్యులర్ రద్దు చేయాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అల్టిమేటం జారీ చేశారు.
బాబు సర్కారు వచ్చాకే ప్రైవేటు వైపు అడుగులు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయని ఉద్యోగ, కార్మీక సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. 2024 జూన్ తర్వాత నుంచి వేలమంది కార్మీకులను తొలగించడం, ముడిసరుకు దొరక్కపోవడం, నిల్వలు కుంచించుకుపోవడం, ఉద్యోగులు వీఆర్‌ఎస్ తీసుకోవాలంటూ ఉత్తర్వులు, జీతాల్లో కోతలు, 32 విభాగాలను ప్రైవేట్‌పరం చేసేందుకు టెండర్లు పిలవడం... ఉత్పత్తి నిర్విర్యానికి చంద్రబాబు, కేంద్రం కలిసి నిరంకుశ నిర్ణయాలు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు.
గనులపై కేంద్రంతో ఒక్కసారైనా మాట్లాడారా?
‘సొంత గనులు కేటాయించండి మహాప్రభో అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించాం. ఒక్కసారి కూడా కేంద్రంతో సంప్రదింపులు జరపలేదు. నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న మిట్టల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని కోరడం ముమ్మాటికీ ఆంధ్రులకు ద్రోహం చేసినట్లే’ అని దుమ్మెత్తిపోశారు. స్టీల్ ప్లాంట్, ఉద్యోగులు, కార్మీకుల గురించి తప్పుగా మాట్లాడటం చూస్తుంటే ప్రైవేటీకరణకు చంద్రబాబు 100 శాతం కట్టుబడి ఉన్నట్లు అర్థమవుతోందని అఖిలపక్ష కార్మీక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ‘‘సంపద సృష్టి అంటూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే చంద్రబాబుకు ప్లాంట్‌ను నడిపిస్తున్న ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హతే లేదని’ తెగేసి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని దురుద్దేశంతోనే కర్మాగారం, కార్మీకులను టార్గెట్ చేసిందని, ఈ క్రమంలోనే చంద్రబాబు మాటల దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వాల కుట్ర చర్యలను కార్మీక వర్గం ఐక్యంగా తిప్పి కొడుతుందని స్పష్టం చేశారు.
చర్చకు సిద్ధమా చంద్రబాబూ?
చంద్రబాబు లేవనెత్తిన ప్రతి అంశానికి మేం సమాధానం చెబుతాం. ఎకరా భూమి 99 పైసలకు కట్టబెట్టింది ఎవరు? ఇది ప్రజాధనం కాదా.? ప్రైవేటు స్టీల్ ప్లాంట్‌లు, కంపెనీలు ఎంత ఎగ్గొట్టాయి? ప్రభుత్వాలకు ఎంత చెల్లించాయి? స్టీల్ ప్లాంట్‌పై చర్చకు రండి. 2009 ఫిబ్రవరి 19న ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ కార్మీకులు సొంత గనుల కోసం ధర్నా చేస్తే మద్దతుగా మాట్లాడిన చంద్రబాబు తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చి ఏం చేశారు? అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి. స్టీల్ ప్లాంట్‌ను అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత మాది అని అన్నారు. ఇప్పుడేమో.. జీతాలెందుకని మాట్లాడటం సిగ్గు చేటు. వాస్తవాలు మాట్లాడండి. తప్పుడు విమర్శలతో ఉద్యోగులను నిరుత్సాహపరచొద్దు. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు మాటల్ని వెనక్కి తీసుకోవాలి. యాజమాన్యం వెంటనే ఉత్పత్తితో కూడిన జీతభత్యాలు చెల్లిస్తామన్న సర్క్యులర్‌ను రద్దు చేయించాలి. – జీఎస్‌జే అచ్యుతరావు, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ
ప్రైవేటీకరణకే ఉద్యోగులు, కార్మీకులపై మాటల దాడి
అవసరమైన ముడి సరుకు ఇవ్వకుండా ఉత్పత్తి సాధించాలని చెప్పడం అత్యంత దుర్మార్గం. టార్గెట్లను అధిగమించడానికి, ఉత్పత్తి సాధించడానికి కార్మీకులు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. కానీ, పరికరాలు సరిగా ఉన్నాయా? మేన్ పవర్ సరిపోతుందా? ముడిసరకు ఉందా? దీనిపై ఎప్పుడైనా చర్చించారా? ఉద్యోగులు, కార్మీకుల గురించి ఎవరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, సర్క్యులర్లు జారీ చేసినా సహించేది లేదు. – రమణమూర్తి, స్టీల్ ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు


