‘పల్లె’ మళ్లీ మొదటికొచ్చింది | Village People Not Celebrate Sankranti Festival in Chandrababu govt: Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘పల్లె’ మళ్లీ మొదటికొచ్చింది

Jan 14 2026 4:16 AM | Updated on Jan 14 2026 4:16 AM

Village People Not Celebrate Sankranti Festival in Chandrababu govt: Andhra pradesh

కృష్ణా జిల్లా వేకనూరు గ్రామంలో స్కూల్‌ వద్ద మాట్లాడుకుంటున్న గ్రామస్తులు

గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతంత మాత్రమే

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక తల్లడిల్లుతున్న రైతులు 

మరోవైపు భగ్గుమంటున్న ఎరువులు, పురుగు మందుల ధరలు  

యూరియా కోసం వెళ్తే ఫర్లాంగు మేర బారులు తీరిన అన్నదాతలు 

జగన్‌ ఇచ్చిన ఒక్క పథకమూ లేదు.. సూపర్‌ సిక్స్‌ లేదు.. 

సూపర్‌ సెవనూ లేదంటున్న అక్కచెల్లెమ్మలు.. నిరుద్యోగులూ సతమతం

పిల్లలను పెద్ద చదువులు చదివించలేక తల్లిదండ్రుల దిగాలు 

ఇదంతా ఒక ఎత్తు అయితే రెండడుగులు వెనక్కెళ్లిన అభివృద్ధి 

ఆర్బీకేలు లేవు.. స్కూళ్లలో నాడు–నేడు బంద్‌.. సచివాలయాలూ చతికిల 

ఇంతలో ఎంత మార్పు అంటూ సొంతూళ్లకు పండుగ కోసం వచ్చిన వారి ఆవేదన  

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే మేలని గుర్తు చేసుకుంటూ చర్చోపచర్చలు

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ కళ తప్పింది.. ప్రజల చేతిలో డబ్బులు లేక మునుపటి సందడి కానరావడం లేదు.. ప్రకృతి వైపరీత్యాలు, వరుస తుపానులతో పంటలు దెబ్బతిన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు.. అరకొరగా చేతికందిన పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఏ పంట అయినా సరే ‘కొందామంటే కొరివి.. అమ్ముదామంటే అడవి’ అన్నట్లు పరిస్థితి తయారైంది.

టమాటా, ఉల్లి, ధాన్యం, మిర్చి, అరటి.. ఇలా పంటలన్నీ మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.. ఎరువుల ధరలు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి.. యూరియా సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు.. వీటన్నింటికీ తోడు గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా రద్దు చేసింది.. మరోవైపు గత ఎన్నికల్లో ఇదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచింది.. ఫలితంగా వ్యాపారాలూ మందగించాయి.. నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు.. అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులాడట్లేదు..  పంట చేతికొచ్చి లాభాలార్జించి.. కొనుగోళ్లు, అమ్మకాలు బాగా జరిగితే ఇటు రైతాంగం, అటు వ్యాపార వర్గాల్లో సంతోషం వెల్లివిరిసేది.. తద్వారా ఇతర వృత్తుల వారికీ మెరుగైన ఉపాధి లభించేది.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉండటంతో పల్లెల్లో సంక్రాంతి మొక్కుబడిగా మారింది.. 

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు సాగుతున్న తీరుపై ‘సాక్షి’ బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు ఈ విషయాలు కళ్లకు కట్టాయి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు పండుగ కోసం సొంతూళ్లకు వచ్చినా, రెండేళ్ల క్రితం ఊళ్లలో న్న పరిస్థితికి ృ ప్రస్తుతానికి మధ్య వచ్చిన మార్పును గమనించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘విప్లవాత్మక నిర్ణయాలతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఊళ్ల రూపురేఖలు సమూలంగా మార్చి వేసింది.. రెండేళ్ల క్రితం వరకు ఊళ్లలో అందమైన పాఠశాల, ఆర్బీకే, పీహెచ్‌సీ, గ్రామ సచివాలయం, ఇతరత్రా పలు ప్రభుత్వ బిల్డింగ్‌లన్నీ కళకళలాడుతూ కనిపించాయి.. ఇప్పుడవన్నీ వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పీపీపీకి ఇవ్వడం ఏమిటి? రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయడం ఏమిటి?  అన్నీ బేరీజు వేసుకుంటే మునుపటి ప్రభుత్వ పాలనే నయం. గ్రామాలన్నింటిలో అభివృద్ధి వెనక్కు వెళ్లిపోయింది’ అని ఊరూరా జనం చర్చించుకోవడం కనిపించింది.  

కళకళలాడిన భవనాలన్నీ వెలవెల
ఊరు: ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరు  
శివారు గ్రామమైన భీమవరప్పాడుతో కలిపి 1,438 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జనాభా 5,509. వీరిలో బయట ప్రాంతాలలో ఉద్యోగాలు చేసే వారు 1,200 మందికిపైనే. గత ప్రభుత్వ హయాంలో సచివాలయాలు 2, వెల్నెస్‌ సెంటర్లు 2, రైతు భరోసా కేంద్రాలు 2, ఆయుర్వేద ఆస్పత్రి 1, పాఠశాలలు 3, అంగన్‌వాడీ కేంద్రాలు 5 ఏర్పాటయ్యాయి. 27 మంది గ్రామ వలంటీర్లు, 14 మంది సచివాలయ ఉద్యోగులు సేవలందించే వారు. గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం భవనం, గోడౌను, కేడీసీసీ బ్రాంచి భవనం, సహకార సొసైటీ అదనపు గదుల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రం భవనం, నాడు నేడు కింద పాఠశాలల ఆధునికీకరణ, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను గత ప్రభుత్వంలోనే పూర్తి చేశారు.

గత ప్రభుత్వంలో డీబీటీ రూ­పంలో రూ.13.64 కోట్లు, నాన్‌ డీబీటీ రూపంలో రూ.­52.47కోట్లు ప్రజలకు అందాయి. 5,142 ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. 1,816 మంది వైద్య సేవలు పొందారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వ­చ్చా­క ఈ భవనాల్లో సగానికి సగం మూతపడ్డాయి. ఇంకో మాటలో చెప్పాలంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిలో పండుగ కోసం గ్రామానికి వచ్చిన వారిలా మాట్లాడుకున్నారు.    

అశోక్‌కుమార్‌ (మార్కెటింగ్‌ ఉద్యోగి, హైదరాబాద్‌): వెంకటేశ్వరరావు బాబాయ్‌ బాగున్నారా.. ఆరోగ్యం ఎలా ఉంది? 
వెంకటేశ్వరావు (గ్రామస్తుడు, రైతు): ఏముంది నాన్నా.. వయస్సు మీద పడుతుందిగా.. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. సర్లే నువ్వెప్పుడు వచ్చావ్‌.. కుటుంబం అంతా బాగున్నారా.. 

అశోక్‌కుమార్‌: నిన్ననే వచ్చాం బాబాయ్‌.. అందరం బాగానే ఉన్నాం.. కానీ ఏంది బాబాయ్‌ మన ఊళ్లో సంక్రాంతి సందడి అంతగా కనిపించడం లేదు.. రెండు మూడేళ్ల క్రితం చూసిన ఊపు కనిపించడంలేదు.. 
వెంకటేశ్వరరావు: ఏముంటది నాన్నా.. పోయిన ఏడు బుడమేరు వరదలతో పంటలన్నీ దెబ్బ తిన్నాయ్‌.. 
ఈ ఏడు చూస్తే వర్షాల వల్ల పత్తి పంట పోయింది.. మామిడి పోయింది.. వరి పంట అంతంతమాత్రమే.. జగన్‌ ప్రభుత్వంలో ఇచ్చే పథకాలన్నీ ఎత్తేశారు.. జనం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయ్‌ నాన్నా.. జనం దగ్గర డబ్బులు లేకపోతే పండగ ఊపు ఎక్కడ నుంచి వచ్చుద్ది?  (అంతలో జగదీష్‌ అనే యువకుడు అక్కడికొచ్చి కల్పించుకున్నాడు) 

జగదీష్‌: పండగలా ఉందా అసలు.. గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఏదో ఒక రూపంలో అకౌంట్లలో డబ్బులు పడేవి. వాటితో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని డబ్బులు రెట్టింపు చేసుకునేవాళ్లు.. ఇప్పుడు ఏం ఉంది.. డబ్బులు లేవు.. ఇస్తానన్న పథకాలూ లేవు. 
అశోక్‌కుమార్‌: అదేందన్నా సూపర్‌సిక్స్‌ సూపర్‌ హిట్‌ అని తెగ ప్రచారం చేస్తున్నారుగా.. చంద్రబాబు పాలన సూపర్‌ అంటూ నా సహచరులు కొంత మంది తెగ చెబుతున్నారు.. 

జగదీష్‌: సరే చంద్రబాబు పాలన ఎలా ఉందో ఇప్పుడే చూద్దాం.. (అక్కడే ఉన్న రాజే‹Ùను ఉద్దేశించి..) రాజే‹Ù.. నువ్వు చదువుకొని ఉద్యోగం చేయడం లేదుగా.. మరి నీకు నిరుద్యోగ భృతి వస్తుందా? 
రాజేష్‌: లేదు అన్నా.. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏడాదిన్నర అయ్యింది. నాకే కాదు. ఏ ఒక్కరికీ ఇచ్చింది లేదు. నాకు నిరుద్యోగ భృతి కింద రూ.54 వేలు రావాలి. 

వెంకటేశ్వరరావు: నిరుద్యోగ భృతినా వాళ్ల బొందనా.. ఊళ్లో కట్టాల్సిన బిల్డింగ్‌లను ఏడాదిన్నరగా కట్టలేకపోయారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్‌ సెంటరు భవనం అలానే వదిలేశారు. ఆ భవనాలు మందు తాగేవాళ్లకి మంచిగా ఉపయోగపడుతున్నాయి. ఇదేనా అభివృద్ధి అంటే.. వాన వస్తే మన రోడ్డంతా చెరువులా మారుతుంది.. ఏం అభివృద్ధి వాళ్లు చేసేది? అంతా కల్ల»ొల్లి మాటలే.. (వీళ్ల మాటలను సిద్దార్థ అనే బీటెక్‌ విద్యార్థి విని కల్పించుకున్నాడు) 
సిద్దార్ధ: ఏంటో మీరు అభివృద్ధి అంటున్నారు.. పథకాలు అంటున్నారు.. అసలు ఈ ప్రయివేటు పరం గురించి చెప్పరేంది బాబాయ్‌.. ప్రతి దాన్నీ ప్రయివేటు పరం అంటోంది ఈ ప్రభుత్వం. మెడికల్‌ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల ఎంత నష్టమో మీకు తెలుసా? డబ్బులు లేవంటూనే ఆవకాయ అమరావతి, యోగాంధ్ర పేరుతో రూ.కోట్లు అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం బాబాయ్‌? (అప్పుడే అ­క్కడికొచ్చిన గ్రామస్తుడు అభిద్నగో కల్పించుకున్నాడు) 

అభిద్నగో: ఒక్క ఆవకాయ అమరావతి ఏంటి.. టూర్‌లు.. ప్రత్యేక విమానాలు.. ఈవెంట్లు.. వీళ్లని చూస్తుంటే ప్రజల సొమ్ముని పప్పూ బెల్లాల్లా పంచుకొని కాజేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదని ఇట్టే తెలుస్తోందిగా..  
జగదీష్‌: ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు  గాల్లో కలిసిపోయాయి.. జగన్‌ ఇచ్చిన పథకాలన్నీ రద్దయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లు, పాఠశాలలు నిరీ్వర్యం చేశారు. పేద వాళ్ల పొట్ట కొడుతున్నారు.. ఈ ప్రభుత్వం వల్ల ఎంతగా నష్టపోయారో మనకంటే మహిళలు ఇంకా బాగా చెబుతారు. 
వెంకటేశ్వరరావు: అసలు మన చెరువుకి నీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరగా వదిలేశారు.. ఈ ఏడు నారుమళ్లు ఎండిపోయి, నానా తిప్పలు పడ్డాం..

పేదలన్నా, రైతులన్నా ఈ ప్రభుత్వానికి పట్టదబ్బాయ్‌.. 
అప్పుడే అక్కడికొచ్చిన శ్రీరాములు, హనమయ్య, రమేష్‌ కల్పించుకుంటూ: ఏం ప్రభుత్వమో నాయనా.. ఇదివరకు ఇంటికి వచ్చి ఏం కావాలన్నా ఇచ్చే వాళ్లు.. రేషన్‌ ఇంటి ముందుకే వచ్చి ఇచ్చే వాళ్లు.. ఇప్పుడు రేషన్‌ షాపుకు పోయి క్యూలో నిలబడాలి.. ఇప్పుడు ఏదైనా సర్టీ ఫికెట్‌ కావాలంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏదైనా జగన్‌ ప్రభుత్వంలో పేదోళ్లు నిశి్చంతగా బతికారయ్యా.  

వెంకటేశ్వరరావు: ఆరే మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకో మూడేళ్లు ఈ నరకం అనుభవించాల్సిందే.. వీళ్లు చెప్పే అభివృద్ధి కాగితాలపై మాత్రమే కనిపిస్తుంది. ఊళ్లలోకి వస్తే చూస్తే అసలు రంగు బయట పడుతుంది. 
అశోక్‌కుమార్‌: అవును బాబాయ్‌.. నేనే విన్నది ఒక్కటి.. ఇక్కడ చూస్తున్నది, వింటున్నది మరొకటి.

అంతా ఉత్తుత్తి ప్రచారమే అన్నమాట!
ఊరు: కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు 
హైదరాబాద్‌ నుంచి వచ్చిన యశ్వంత్‌: అన్నా.. లక్ష్మి పిల్లలు బాగా చదువుకుంటున్నారని తెలిసింది. ఎక్క డ చదువుతున్నారు.. ఇప్పుడు ఎలా ఉంది వారి పరిస్ధితి? 
బాబూరావు: ఏమి చెప్పమంటావు తమ్ముడూ. పేదోళ్ళయినా పిల్లలను బాగా చదివించాలనుకున్నారు. ఇద్దరు పిల్లలూ ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. పెద్దోడికి మూడేళ్ళ క్రితం ఫీజులన్నీ ప్రభుత్వమే చెల్లించింది. చిన్నబ్బాయ్‌ రెండో సంవత్సరం ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. రెండేళ్ళ నుంచి వారికి ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదంట. కాలేజీ వాళ్ళు బాగా ఒత్తిడి తెస్తే ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి ఫీజులు కట్టింది. వాళ్ళ చదువులు పూర్తయితేగానీ లక్ష్మి కష్టాలు తీరవు. 
యశ్వంత్‌: కోటేసు మావయ్యా.. రాందాసు పిల్లలు ఏమి చేస్తున్నారు.. పెద్దోడు బాగానే చదివేవాడని విన్నాను. 

కోటేసు: రాందాసు పిల్లలు డిగ్రీలు చదివారు అల్లుడూ.. పెద్దోడుకి కాలేజి ఫస్ట్‌ వస్తే సన్మానాలు చేశారు. ఉద్యోగం లేక ఏదాడిన్నర నుంచి ఊరిలోనే ఉంటున్నాడు. వ్యవసాయ సీజన్‌లో పొలం పనులకు వెళుతున్నాడు. ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పింది. ఏదీ లేదు. చదువుకున్నోళ్ళకు నెలకు మూడు వేలు ఇస్తామని చెప్పారు. ఏదీ ఇవ్వడం లేదు. చేసేది లేక వయస్సు మీదపడినా కుటుంబాన్ని లాక్కురావడానికి రాందాసు ఇంకా కష్టపడి పనులకు వెళుతున్నాడు.  
యశ్వంత్‌: రాంబాబు బాబాయ్‌ మూడేళ్ళ క్రితం ఊరొచ్చినపుడు వలంటీర్‌ రవి మేము తీసుకున్న పొలం తాలూకా ఏదో పనుంటే దగ్గరుండి చేయించాడు. ఇప్పుడు వలంటీర్‌ పోస్టులు తీసేశారుగా ఏం చేస్తున్నాడు? 

రాంబాబు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకు పది వేలు ఇస్తామని హామీ ఇస్తే అందరూ చాలా సంబర పడ్డారు. తీరా అధికారంలోకి వచ్చాక వారందరినీ తీసేయడంతో ఎవరికి తోచిన పనులు వారు చేసుకుంటున్నారు. రవికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఏమి చేస్తాడు.. ఊరిలో పనులు లేకపోవడంతో విజయవాడ వెళ్ళి ఏదో షాపులో గుమస్తాగా పనిచేస్తూ భార్యా పిల్లల్ని పోషించుకుంటున్నాడు. 
యశ్వంత్‌: తమ్ముడూ విజయ్‌.. ఆ వెళ్లే మనిషి వెంకటేశ్వరమ్మలా ఉంది. అలా నడుస్తుందేంటి? 

విజయ్‌: వాళ్ళాయన ఐదు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. రెండు నెలల క్రితం ఆమె పడిపోతే కాలు విరిగింది. ఆపరేషన్‌ చేశారు. ఒక్కగానొక్క కూతురుకి పెళ్ళి చేసి అత్తింటింకి పంపింది. పింఛన్‌ కోసం దర­ఖాస్తు పెట్టుకుంది. దాని కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది.   
యశ్వంత్‌: ఈ ప్రభుత్వం బాగా చేస్తోందని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చూసి నిజమేననుకున్నా. ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందే.. అంతా ఉత్తుత్తి ప్రచారమే అన్నమాట.. 

రంగారావు: రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తామంటే  నమ్మి ఓట్లేశాం. చేసిందేం లేదు. పైగా గతంలో జగన్‌ ఇచ్చిన పథకాలు తీసేశారు. ఎన్ని చెప్పుకున్నా ప్రయోజనం ఏముంది? ఈ ప్రభుత్వంలో ఎవరూ సంతోషంగా లేరన్నది మాత్రం నిజం. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ఇంతే.  

ఏం పండగో ఏమో.. సెయ్యాడితేగా! 
ఊరు: విజయనగరం జిల్లాడెంకాడ మండలం గుణుపూరుపేట 
రమణ: ఏరా శ్రీనూ.. పండగ సందడే లేకుండా పోయింది. చేతిలో డబ్బుల్లేవు. చేద్దామంటే పనుల్లేవు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు పండగ మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్లకు తప్ప ప్రజలకు లేకుండా పోయింది. 

శ్రీను: నిజమే బావా.. ఆరు నెలలుగా ఉపాధి హామీ డబ్బులు కూడా పడలేదు. నాకు దాదాపుగా పాతిక వేల వరకు రావాలి.. అవి వచ్చినా పండక్కి పిల్లలకు బట్టలైనా కొనేవాడిని.  
సూర్యనారాయణ (రైతు): ఈ గవర్నమెంట్‌ వచ్చింది మొదలు పేదలు, రైతుల ఇళ్లలో కష్టాలే తప్ప నవ్వులు కనపడలేదు. 
రైతులకు సరిపడా యూరియా అందించలేకపోయింది. ఇదీ 

ఓ ప్రభుత్వమా?   
లక్ష్మి (డ్వాక్రా సంఘం నాయకురాలు): ఏం చిన్నాయనా.. అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు.. మేం మాత్రం కష్టాల్లో ఉన్నాం. గతంలో వైఎస్‌ జగన్‌ ఉన్నపుడు నిత్యం మాకు అండగా ఉండేవారు. పిల్లల చదువులకు అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చేది. చిన్నాచితకా వ్యాపారాలకు కూడా ఆసరా పథకం ఉండేది. ప్రజల వద్ద నిత్యం డబ్బు కదిలేది. మా సొంత అవసరాలు తీరేవి. పిల్లలకు కొత్త బట్టలు కొనేవాళ్లం. ఇప్పుడు ఆ రోజుల్లేవు.. పది రూపాయలు కూడా మా ఆయనను అడగాల్సి వస్తోంది.  
అప్పన్న: జగన్‌ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఎప్పుడూ అగలేదురా.. కానీ ఈ సర్కారు వచ్చాక ఆరోగ్యశ్రీ ప్రాణం తీసేస్తోంది. మొన్నామధ్య నాకు కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని చేర్చుకోలేదు.. అప్పుచేసి వైద్యం చేయించుకున్నాను.. ఇప్పుడు ఆ అప్పుకు వడ్డీ కడుతున్నాను. కాలు ఇంకా సరిగా నడవడానికి కూడా రావట్లేదు. కుంటుకుంటూ నడవాల్సి వస్తోంది.

బతకడమే కట్టమైతే పండగయాడబ్బా..
ఊరు: శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లి 
లక్ష్మన్న: ఏందప్పా రామన్న.. పొలం పోలేదా?
రామన్న: ముందు ప్రభుత్వంలో పంచాయతీ కాడ ఉన్న ఆర్‌బీకేలోకి వెళ్లి యూరియా తీసుకుని పంటకు వేసేవాడిని. ఇప్పుడు చూస్తే యూరియా బంగారమైందప్పా.. ధర్మవరానికి వెళ్లి ప్రైవేటోళ్ల దగ్గర దొడ్డిదారిన రెండింతలు ధర ఇచ్చి కొనే పరిస్థితి ఏర్పడింది. రైతులకు కరువు వచ్చినా, ఆపదొచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదప్పా.. పట్నం నుంచి వచ్చిన నా కొడుకు, కోడలు ఈ పరిస్థితి చూసి ఎందుకు నీకు వ్యవసాయం.. అంటున్నారు. వాళ్లతోపాటు రమ్మంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదప్పా. ఆళ్లు చెప్పినట్లు పట్నంపోతే అక్కడ నాకు ఏమీ తోచదు. ఈన్నే ఉందామంటే బతికే దారి లేకుండా పోయింది. 

లక్ష్మన్న: ఏం సాంబయ్యా బియ్యం తెచ్చుకున్నావా..  
సాంబయ్య: ఔనప్ప.. పట్నం నుంచి వచ్చిన నా మనుమడిని తీసుకుని పొరుగూరికి వెళ్లి మూడు గంటలు లైన్లో నిల్చుని తెచ్చుకున్నా. ముందు ప్రభుత్వంలో అయితే ఇంటికాడికే రేషన్‌ బండి వచ్చేది. ఇప్పుడంతా యాతనేకదప్పా. మన గురించి ఆలోచించే వారు ఎవరున్నారు? ముందు రోజులే ఎంతో మేలప్పా. 

లక్ష్మన్న: ఏం లింగన్నా.. ఆరోగ్యం బాగోలేదంటివి ఆసుపత్రికి పోయినావా.. 
లింగన్న: ఏం చెప్పాలిలేప్పా.. ముందు ప్రభుత్వంలో అయితే పంచాయతీ వద్దకు వెళితే ఇలేజ్‌ క్లినిక్‌లో డాక్టరోళ్లు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు వెళితే పట్టించుకునే వారే లేరప్పా. అందుకే కొడుకుని పిలుచుకుని ధర్మోరం వెళ్తున్నానప్పా. అయినా ఇదంతా ప్రభుత్వం చాతకాని తనమప్పా.. కాదు కాదు చాతకాని ప్రభుత్వానికి ఓట్లేసిన మనప్రజలదప్పా తప్పు. ఇంతకు ముందు మనూరికి పతీ నెలా 10వ తేదీలోపు 104 అంబులెన్స్‌ వ్యాన్‌ వచ్చేది. ఇక్కడే పరీక్షలు చేసి.. బీపీ, షుగర్‌తో పాటు ఏ ఇబ్బంది ఉన్నా మందులు ఇచ్చేవారు. ఇపుడా ఊసేదీ? ఉన్న పట్టా పాసు పుస్తకాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చేదానికి డబ్బులు కట్టాలట. అందులోనూ అన్నీ తప్పులే.   

సుబ్బరాయుడు: అవును.. లింగన్న చెప్పింది నిజమే.. ఈ ప్రభుత్వం దేని గురించీ పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నా. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదు. కనీసం కొనుగోలు చేసే నాధుడే లేడు. విడ్డూరమేంటంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథనాన్ని చంద్రబాబుతో మాట్లాడి నేనే ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చెబితే ఈ ప్రభుత్వ ఉలుకూ పలుకూ లేదు. పైగా ఆ పథకాన్ని మొదలెట్టిన జగన్‌ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతోంది. రేవంత్‌ రెడ్డి చెప్పిందాంట్లో నిజముందా.. లేదా చెప్పమంటుంటే ఆ పథకమే అక్కర్లేదంటోంది చంద్రబాబు ప్రభుత్వం. సొంత రాష్ట్రానికి నష్టం చేసే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. మన రాత బోగోలేదు కాబట్టే ఇన్ని కష్టాలని అనుకోవాల్సి వస్తోంది. మరో మూడేళ్లు తప్పవీ తిప్పలు. పదండి ఇళ్లకు.. పొద్దు పోయింది.. ఇళ్ల కాడ తిడతారు.  

సిన్న పిల్లలు కూడ సెడిపోతన్నార్రా.. 
ఊరు: విశాఖ జిల్లా తాటితూరు 
ఆర్‌ఎంపీ వైద్యుడు వెంకటేష్‌: అప్పల్రాజూ.. ఏం పండక్కు కొత్త బట్టలు కొన్నావా.. లేదా?   
అప్పల్రాజు: రా డాక్టరూ.. కూర్చో.. ముందు వెయ్యి కళ్లతో సూసి.. వెనకున్న గోతిలో పడ్డట్టుంది మా యవ్వారం. మొన్న­టి దాకా జగనన్న హయాంలో రైతు భరోసా పైసలు సరిగ్గా పండక్కి ముందే పడేవి. అమ్మ ఒడి.. ఆసరా.. ఇలా ఇంటి ఖర్చులకు ఎలాటి 
లోటుండేది కాదు. ఇప్పుడు బట్టలు కొనడానికి జేబులో పైసా ఉంటే కదా. 

ఆనంద్‌: అవునన్నా.. ఈ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడమే మానేసింది. ఆర్బీకేలు ఉంటే రాజులా ఉండేవాళ్ళం. విత్తనం కావాలన్నా, ఎరువు కావాలన్నా అక్కడికెళ్లే
వాళ్లం. పండించిన ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పట్టుకెళ్లే తిప్పలు లేకుండా ఊర్లోనే కొనేవారు. ఇప్పుడు మళ్ళీ దళారీలు తయారయ్యారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. మద్దతు ధరేమో రూ.2,369 అంటారు. అక్కడికెళ్తేమో రూ.1,650 ఇత్తన్నారు. ఇంకేటి మిగుల్తాది? 

బోని లలిత్‌ ఆదిత్య: అన్నా.. మీ మాటలేమో గానీ మందు (లిక్కర్‌) మాత్రం బాగా దొరుకుతోంది.   
అందరూ ఒక్కసారిగా:  మందు ఊసెత్తకు ఆదీ.. 24 గంటలూ ఎక్కడ సూసినా మందే కనిపిస్తోంది. కుటుంబాలు నాశనమైపోతుండాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఆ మందులోనూ సగం నకిలీ అని తేలింది. ఆ మందు తాగితే త్వరగా చస్త్రారా.. చంద్రబాబు ప్రభుత్వం ఆస్పత్రులకు మందులు ఇవ్వడం లేదుగానీ.. ఊరూరా మాత్రం మందు విందు పథకం మొదలెట్టేసింది. సిన్న పిల్లలు కూడ సెడిపోతన్నార్రా. సూస్తే బాధేస్తాంది. 
అప్పల్రాజు: ఇంకా మూడేళ్ల పాటు పండగ ఇంతేలే.. మా షావుకారి దగ్గరకెళ్లి రూ.రెండు వేలు అప్పు తీసుకోవాలి.  

తెలంగాణలో ఎన్ని మెడికల్‌ కాలేజీలున్నాయో తెలుసా?  
నేను యూఎస్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశాను. ఇక్కడ కూటమి ప్రభుత్వ పోకడ చూస్తుంటే బాధేస్తోంది. రాష్ట్రంలో పేదవాడు మెడిసిన్‌ చదివే పరిస్థితి కన్పించడం లేదు. మెడికల్‌ కాలేజీలు కట్టడానికి డబ్బులేవని ఈ ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. అన్ని రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ కష్టపడుతున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణలో ఎన్ని మెడికల్‌ కాలేజీలు ఉన్నాయో ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తెలు­సా? గత ప్రభుత్వం మంజూరు చేయించి, మొదలు పెట్టిన మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయడా­నికి డబ్బులు లేవు గానీ, ప్రచార ఆర్భాటానికి మాత్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఇదెక్కడి రాజకీయం? ఉద్యోగాలివ్వని కంపెనీలకు రూపాయికి, అర్ధ రూపాయికి భూములు కేటాయిస్తున్నారు. ముందు చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వండి. – కాసం నాగార్జున, పావులూరు, బాపట్ల జిల్లా

ప్రచారం మాత్రం ఆహా.. ఓహో..  
రాష్ట్రంలో అభివృద్ధిపై ఆహా.. ఓహో.. అంటూ ఆర్భాటం చేస్తున్నారు గానీ.. ఇక్కడ గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గోతుల్లో గంపెడు మట్టి వేయలేదు. హైదరాబాదు నుంచి జాతీయ రహదారిలో వచ్చి, గ్రామీణ రహదారిలోకి రాగానే గోతులతో ఇబ్బందులు పడ్డాం. అంతటా గోతులమయమే. జుత్తిగ – సిద్ధాంతం రహదారిలో ప్రయాణం భయంభయంగా ఉంది. రెండేళ్లలో గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ భవన నిర్మాణాలూ లేవు. 
రెండేళ్ల క్రితం వరకు జరిగిన మార్పు అలానే ఉండిపోయింది.  – కర్రి ఉమామహేశ్వర్, జుత్తిగ, పశి్చమ గోదావరి జిల్లా (హైదరాబాద్‌ నుంచి వచ్చారు)

చదివించలేక పోతున్నాం 
గతంలో మాకు జగనన్న చేదోడు వచ్చేది. ఆ ఆరి్థక సాయంతో టైలరింగ్‌ షాపు నడిపేవాళ్లం. ఇప్పుడు ఆ సాయం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణాలోని సిర్పూరు కాగజ్‌నగర్‌లో బెడ్డింగ్‌ టైలర్‌గా పనిచేస్తు­న్నాను. చాలా ఒత్తిడిగా ఉంటుంది. నాతో పాటు నాభార్య కూడా కష్టపడుతుంది. గతంలో వైఎస్సార్‌ ఆసరా, చేయూ­తా వచ్చేవి. అవి ఇప్పుడు లేవు. పిల్లల్ని ఇంటి వద్ద ఉంచి చదివిస్తున్నాం. ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నాం. – సవిరిగాన శ్రీహరి, వన్నలి గ్రామం, రేగిడి మండలం, విజయనగరం జిల్లా  

ఏ పనులూ కావడం లేదు 
నేను తిరుపతిలో పని చేస్తుంటాను. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు మా ఊరికి వస్తాను. గ్రామంలో ఎక్కువ మంది తల్లిదండ్రులను ఇక్కడే ఉంచి ఇతర ప్రాంతాలకు పనికి వెళ్తారు. దీంతో వృద్ధులైన వారు రేషన్‌ షాపునకు వెళ్లి బియ్యం మూట తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పింఛన్‌ కోసం కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాలి. ఏవైనా పనుల కోసం మా గ్రామ సచివాలయానికి వెళ్లడానికి అడ్డదారిన నడిచి వెళితే సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. మోటారు సైకిల్‌ వేసుకుని రోడ్డుపై వెళితే నాలుగు కిలోమీటర్లు వెళ్లాలి. ఇంత కష్టబడి తీరా గ్రామ సచివాలయానికి వెళితే సీట్లో అధికారులు ఉండడం లేదు. ఫోన్‌ చేస్తే సర్వేలో ఉన్నామంటున్నారు. దీంతో చచీ్చచెడి మళ్లీ ఉసూరుమంటూ ఇంటికి తిరిగి రావాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ఈ కష్టాలే ఉండేవి కావని గ్రామస్తులు చెబుతున్నారు. – డోలా హనుమంతరావు, బేల్దారి మేస్త్రి, చిన్న కనుమళ్ల గ్రామం, కనుమళ్ల పంచాయతీ, ప్రకాశం జిల్లా   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement