కుట్రల్ని తిప్పికొడతాం.. వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం: దేవినేని అవినాష్

సాక్షి, విజయవాడ: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మహిళలపై పథకం ప్రకారం టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల్లా మాయమాటలు చెప్పడం లేదని అన్నారు. ఇంత చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ, ఎల్లోమీడియా విషప్రచారం చేస్తున్నాయి అని మండిపడ్డారు.
ఈమేరకు అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. 'నిజాన్ని బయటకి రానీయకుండా నిన్నటి నుంచి ఎల్లో మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోంది. ప్రజల్లోకి అబద్దాలు తీసుకెళ్లాలని టిడిపి నేతలు ప్రయత్నించారు. ప్లాన్ ప్రకారమే వాలంటీర్‌పై టిడిపి నేతలు దాడి చేశారు. సీఎం వైఎస్ జగన్ తూర్పు నియోజకవర్గ నేతలతో సమావేశమై దేవినేని అవినాష్‌ని గెలిపించాలని అన్నప్పటి నుంచి వారి కుట్రలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలయ్యేదాకా కుట్రలకు పాల్పడుతారు. వాటన్నింటినీ తిప్పికొట్టి తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం' అని దేవినేని అవినాష్ చెప్పారు.
సంబంధిత వార్తలు