విజయవాడ వ్యక్తి సరికొత్త రికార్డు.. అంతరిక్షంలోకి గోపీచంద్‌ | Vijayawada Gopi Thotakura Is Become First Indian Space Tourist | Sakshi
Sakshi News home page

విజయవాడ వ్యక్తి సరికొత్త రికార్డు.. అంతరిక్షంలోకి గోపీచంద్‌

Apr 13 2024 8:17 AM | Updated on Apr 13 2024 9:50 AM

Vijayawada Gopi Thotakura Is Become First Indian Space Tourist - Sakshi

సాక్షి, ఢిల్లీ: విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్‌ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. ఎన్‌ఎస్‌-25 మిషన్‌ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్‌ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్‌ తోటకూర ఒకరు. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్‌’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా గోపీచంద్‌ వెళ్లనున్నారు.

విజయవాడలో జన్మించిన గోపీచంద్‌ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్‌ జెట్‌ పైలట్‌గా పని చేశారు. బుష్‌ ప్లేన్లు, ఏరోబాటిక్‌ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్‌ ఎయిర్‌ బెలూన్లకు కూడా పైలట్‌గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్‌ లైఫ్‌ కార్ప్‌ అనే ఒక వెల్‌నెస్‌ సెంటర్‌కు గోపీచంద్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా, ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్‌ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్‌పోర్టే ఉంది.

ఆరుగురు వ్యక్తులు వీరే..
అమెజాన్‌ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ జెఫ్‌ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్‌. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్‌ మిషన్‌ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్‌ సహా ముగ్గురు పర్యటకులు రోదసీయాత్ర చేశారు. తర్వాత చేపట్టబోయే ఎన్‌ఎస్‌-25 మిషన్‌కు గోపీచంద్‌ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్‌ క్యాపిలిస్ట్‌ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్‌ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్‌ షాలర్‌, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్‌ ఎడ్‌ డ్వైట్‌ ఎన్‌ఎస్‌-25లో ప్రయాణించనున్నారు. 

ఇస్రో సైతం..
మరోవైపు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైతం అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లా ఈ జాబితాలో ఉన్నారు. మన దేశం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement