
సాక్షి, విశాఖపట్నం: విశాఖను క్రీడారాజధానిగా తీర్చిదిద్దాలనేదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ యువత భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఎంపిక కావాలనేదే తమ ఆశయమన్నారు. ఏటా సీఎం పుట్టినరోజుకు పోటీలు నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి మహిళా క్రికెట్ మ్యాచ్‌లతో పాటు అన్ని క్రీడల పోటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21న ప్రారంభమైన వైఎస్సార్ కప్–2021 క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. విశాఖ పోర్ట్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో ఎంపీ వి.విజయసాయిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో నిర్వహించిన ఈ పోటీల్లో 490 జట్లు పోటీపడినట్లు చెప్పారు.