Vasireddy Padma: ‘చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు’

Vasireddy Padma Slams On Chandrababu And TDP Women Leaders At Mangalagiri - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత బోండా ఉమాకు నోటీసులు ఇచ్చామని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. నోటీసులకు నిరసనగా టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్‌ను చంద్రబాబు గౌరవిస్తారని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదన్నారు. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పడానికే నోటీసులు ఇచ్చామని తెలిపారు.

ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. హాస్పిటల్‌లో నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలనేది చెప్పాలనుకున్నామని తెలిపారు. చంద్రబాబు, బోండా ఉమా చేసిన తప్పులు ఏంటో మీడియా ద్వారా చెప్తున్నామని అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు ఉన్నాయని ఆమె మీడియాకు వివరించారు.

మొదటి తప్పు: పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం
రెండో తప్పు: గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం
మూడో తప్పు: బాధితురాలిని భయకంపితులు చేయడం
నాలుగో తప్పు: సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంది మార్బలంతో వచ్చారు
ఐదో తప్పు: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అడ్డుకోవడం
ఆరో తప్పు: తనను పరామర్శ చేయకుండా అడ్డుకోవడం
ఏడో తప్పు: తనను బెదిరించడం, విధులను అడ్డుకోవడం
ఎనిమిదో తప్పు: చంద్రబాబు వ్యక్తిగతంగా నన్ను బెదిరించడం
తొమ్మిదో తప్పు: బోండా ఉమా అనుచిత పదజాలంతో దూషించడం
పదో తప్పు: కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం
అయితే ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామని ఆమె తెలిపారు.

అంతకు ముందు మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు, వంగలపూడి అనిత ముట్టడించడానికి యత్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి టీడీపీ మహిళా నేతలు.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ చాంబర్‌కు వెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అయితే అక్కడితో ఆగకుండా ఆమె చాంబర్‌లో వాసిరెడ్డి పద్మతో టీడీపీ మహిళా నేతలు వాగ్వాదానికి దిగి నానా రచ్చ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top