నాటి ప్రగల్భాలు ఏమయ్యాయి పవన్‌! | Varudu Kalyani Fires on Pawan Kalyan Over Sugali Preethi Murder Case | Sakshi
Sakshi News home page

నాటి ప్రగల్భాలు ఏమయ్యాయి పవన్‌!

Sep 2 2025 5:51 AM | Updated on Sep 2 2025 5:51 AM

Varudu Kalyani Fires on Pawan Kalyan Over Sugali Preethi Murder Case

ప్రీతి తల్లితో మాట్లాడుతున్న వరుదు కళ్యాణి

సుగాలి ప్రీతి కేసు గురించి ఇప్పుడు మాట్లాడరేం

ప్రీతి కుటుంబానికి న్యాయం చేసిన జగనన్న  

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి

కర్నూలు(టౌన్‌): సుగాలి ప్రీతి హత్యాచారం కేసుపై గత ఎన్నికలకు ముందు ఊగిపోతూ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు మాట్లాడరేమని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.  సోమవారం కర్నూలులోని వాసవీ గార్డెన్స్‌లో ఉన్న సుగాలీ ప్రీతి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రీతి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.

అనంతరం వరుదు కళ్యాణి మాట్లాడుతూ 2017 ఆగస్టులో ప్రీతి హత్యా­చారం జరిగితే ఆ తర్వాత రెండేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏంచేశారని ప్రశి్నంచారు. ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఈ కేసును రాజకీయంగా వాడుకున్నారని, అధికారంలోకి వస్తే దోషుల తాట తీస్తామని, వదిలి పెట్టే ప్రసక్తి లేదని ఊగిపోతూ ప్రగల్భాలు పలికిన పవన్‌ ఇప్పుడు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు అపాయింట్‌మెంటు కూడా ఇవ్వకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ లా అండ్‌ ఆర్డర్‌ తన చేతిలో లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 

మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలం  
‘‘రాష్ట్రంలో రోజూ 70 నుంచి 80 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా­యి. చంద్రబాబు సర్కా­రు మహిళల రక్షణలో విఫలమైంది. హోంమంత్రిగా మహిళ ఉన్నా.. అబలలకు రక్షణ లేదు. అసలు హోంమంత్రి అనిత పనిచేస్తున్నారా? టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా వేధిస్తున్నా చర్యలు లేవు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని, కేసును సీబీఐ విచారణ చేయా­లని డిమాండ్‌ చేస్తూ ప్రీతి తల్లి వీల్‌చైర్‌ యాత్రకు అనుమతి కోరితే ఈ ప్రభుత్వం ఎందుకివ్వడం లేదు?  రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేసిన లోకేశ్‌.. సుగాలి ప్రీతి కేసుపై ఎందుకు స్పందించడం లేదు.?’’ అని కళ్యాణి ప్రశ్నించారు.    

జగనన్న వల్లే బాధిత కుటుంబానికి న్యాయం 
‘‘2019లో జగనన్న సీఎం అయిన తరువాత సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఇంట్లో ఒకరికి ఉద్యో గం, రూ.8 లక్షల నగదు అందజేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి సర్కారు ప్రీతి కేసులో న్యాయం చేయాలి. ప్రీతి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.’’ అని కళ్యాణి చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు విజయ మనోహారి, గాజుల శ్వేతారెడ్డి, కల్లా నాగవేణి రెడ్డి, మంగమ్మ, భారతి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement