వందల కోట్లలో ముంచేసి.. ఎట్టకేలకు యూ పిక్స్‌ క్రియేషన్‌ యజమాని అరెస్ట్‌ | Upix Animation Creations Company Owner Kiran Arrest, More Details Inside | Sakshi
Sakshi News home page

వందల కోట్లలో ముంచేసి.. ఎట్టకేలకు యూ పిక్స్‌ క్రియేషన్‌ యజమాని అరెస్ట్‌

May 30 2025 8:48 AM | Updated on May 30 2025 1:14 PM

Upix Animation Creations Company Owner Kiran Arrest

పల్నాడు జిల్లా: వందల కోట్లలో అమాయకుల్ని మోసం చేసిన యూపిక్స్ క్రియేషన్స్‌  స్కాం అధినేత వెంకట సత్యలక్ష్మి కిరణ్‌ ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యాడు. నరసరావుపేట ,గుంటూరు ,విజయవాడలో వందలాది కోట్లు వసూలు చేసి ఐపీ పెట్టిన కిరణ్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కిరణ్‌ను ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. కిరణ్‌పై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ఎత్తున పోలీసు కేసులు నమోదయ్యాయి.  

యానిమేషన్‌ కంపెనీ పేరు చెప్పాడు. లక్ష పెట్టుబడి పెడితే ఏడాది సరికల్లా లాభం వస్తుందని నమ్మించాడు. నమ్మకం కుదిరేందుకు మొదట్లో చెప్పినట్లుగా పెట్టుబడిదారులందరికి  లాభాలు చూపించాడు. అంతే వందల మంది జనాలు కోట్లు తెచ్చి అతని చేతిలో పెట్టారు. అలా దాదాపు వెయ్యి కోట్లు సేకరించాడు.  ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

విజయవాడకు చెందిన నిడుమోలు వెంకట సత్యలక్ష్మి కిరణ్‌ 2021లో యూపిక్స్‌ క్రియేషన్స్‌ పేరుతో ఓ యానిమేషన్‌ కంపెనీని ప్రారంభించాడు. యానిమేషన్లు తయారు చేసి తానో పెద్ద కంపెనీని నడుపుతున్నానని బిల్డప్‌ ఇచ్చాడు. యూపిక్స్‌ యానిమేషన్‌ కంపెనీని మల్టీనేషనల్‌ కంపెనీగా మారుస్తున్నట్లు ప్రచారం చేశాడు.

విజయవాడ,గుంటూరు,నర్సరావు పేటలలో మీడియేటర్లు యూపిక్స్‌ క్రియేషన్‌ యానిమేషన్‌ కంపెనీ గురించి ప్రచారం చేశారు. యూపిక్స్‌ కంపెనీ పెద్ద పెద్ద సినిమాలకు గ్రాఫిక్స్‌ అందిస్తుందని ఊదరగొట్టేశారు. యూపిక్స్‌ కంపెనీలో పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని ఆశచూపించారు. లక్ష పెట్టుబడి పెడితే ఏడాదికి లక్ష లాభం వస్తుందని చెప్పారు. దీంతో నరసరావుపేటకు చెందిన కొందరు యూపిక్స్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.

మాట ప్రకారం కిరణ్‌ కంపెనీలో పెట్టుబడిపెట్టిన పెట్టుబడిదారులకు పెద్ద మొత్తంలో లాభాలు చూపించాడు. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో నరసరావుపేటలోని బడాబాబులు,రియలర్టర్లు, డాక్టర్లు,మిర్చీ ఎక్స్‌పోర్టర్లు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టారు. తమ వద్ద ఉన్న బ్లాక్‌ మనీని కోట్లకోట్లు కంపెనీలో పెట్టారు.

గుంటూరులో కిరణ్‌ మీడియేటర్లను రంగంలోకి దించడంతో పెద్ద పెద్ద బిగ్‌ షాట్‌లు ఉచ్చులో పడ్డారు. ఒక్కొకళ్లు పది,ఇరవై,ముప్పై కోట్లు వరకు ఇచ్చారు. ఇలా పెట్టుబడులు పెట్టించిన మీడియేటర్లకు కిరణ్‌ ముప్పై శాతం కమీషన్‌ ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని కిరణ్‌ తన అకౌంట్లో వేసుకున్నాడు.

పల్నాడు జిల్లా నరసరావు పేటలో రూ.380 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఇలా గుంటూరు,విజయవాడ,హైదారబాద్‌,బెంగళూరు,సింగపూర్‌ల నుంచి వందల కోట్లు వసూలు చేశాడు.  ఏడాది తర్వాత తమకు ఇస్తామన్న రిటర్న్‌ ఇవ్వాలని పెట్టుబడి దారులు కిరణ్‌ని అడిగారు. నెలరోజుల్లో ఇస్తానని చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మల్టీ నేషనల్‌ కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం చేయడంతో పాటు దేశ, విదేశాల్లో తనకు సన్మానం జరిగినట్లు ప్రచారం చేయడంతో  మరింతమంది బడాబాబులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఇలా వెయ్యికోట్లు వసూలు చేసిన కిరణ్‌.. అదును చూసి బోర్డు తిప్పేశాడు

వసూలు చేసిన మొత్తాన్ని కాజేసి కుటుంబంతో కలిసి పారిపోయాడు. దీంతో కిరణ్‌ బండార బయటపడడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్‌ కోసం రెండు నెలల నుంచి గాలింపు చర్యల చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో కిరణ్‌ను ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రానికి తరలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement