హైకోర్టులో కేసు ఉన్నా సింహాచలం కొండపై చెట్లు నరికేస్తున్నారు
తాజాగా చేస్తున్న పనుల వీడియోలను కోర్టుకు సమర్పిస్తా
పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంపై కనీస గౌరవం కూడా లేకుండా విశాఖపట్నంలో పర్యావరణ విధ్వంసం కొనసాగిస్తున్నారని పర్యావరణవేత్త, జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపాదిత డేటా సెంటర్‌కు సుమారు 160 ఎకరాలు సింహాచలం దేవస్థానం భూముల లీజు, కంబాలకొండ అభయారణ్య పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్‌జెడ్) తదితర అంశాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశానని తెలిపారు.
ఈ పిల్ సోమవారం విచారణకు రానుందని, అయినప్పటికీ విచారణకు ఒక్కరోజు ముందు కూడా ఏమాత్రం భయం లేకుండా ముడసర్లోవలోని సింహాచలం కొండపై భారీగా చెట్లను నరికేస్తున్నారని బొలిశెట్టి మండిపడ్డారు. ఒకవైపు ముడసర్లోవ రిజర్వాయర్, మరోవైపు కంబాలకొండ అభయారణ్యం ఉన్న ఈ ప్రాంతంలో చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే పర్యావరణ విధ్వంసకాండకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భావితరాల పర్యావరణ హక్కులను బలిచేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆదివారం సింహాచలం కొండపై చెట్లు నరికివేస్తున్న విషయాన్ని గమనించి రహదారి పక్కన కుప్పలుగా పోసిన చెట్ల మొద్దులు, కలప దుంగల వీడియోలు, ఫొటోలను రికార్డు చేశానని, ఈ ఆధారాలను కోర్టుకు సమర్పిస్తానని తెలిపారు. ప్రభుత్వం, అటవీ, దేవదాయ శాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపి అనుమతులపై స్పష్టత వచ్చే వరకు చెట్ల నరికివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అడవివరం ప్రాంతంలో మిగిలిన పచ్చదనాన్ని, జలవనరులను కాపాడాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని బొలిశెట్టి స్పష్టంచేశారు.


