రెండు బోర్డుల గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై అనిశ్చితి 

Uncertainty over implementation of Krishna Godavari Board Gazette Notification - Sakshi

ప్రత్యేక భేటీల మినిట్స్‌ను రెండు రాష్ట్రాలకు పంపిన కృష్ణా, గోదావరి బోర్డులు

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 15 అవుట్‌లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగించాల్సిన రాష్ట్రాలు

తన భూభాగంలో 6 అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమైన ఏపీ సర్కార్‌

శ్రీశైలం ఎడమగట్టు, సాగర్‌ విద్యుత్‌ కేంద్రాలను బోర్డుకు అప్పగించడంపై తెలంగాణ అభ్యంతరం

తెలంగాణలోని 9 అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయని తెలంగాణ 

ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును గోదావరి బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేయని వైనం

2 రాష్ట్రాలు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తేనే.. వాటిని పరిధిలోకి తీసుకోనున్న బోర్డులు

తెలంగాణ వైఖరిని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని బోర్డుల నిర్ణయం  

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై అనిశ్చితి నెలకొంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలే అజెండాగా ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల మినిట్స్‌ను (చర్చించిన అంశాలను) కృష్ణా, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండే బుధవారం రెండు రాష్ట్రాలకు పంపారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు.. ప్రాజెక్టులను అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. కానీ శ్రీశైలం, సాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రాలను కృష్ణాబోర్డుకు అప్పగించడంపై తెలంగాణ సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించేలా ఉత్తర్వులు జారీచేసేందుకు మొగ్గుచూపలేదు.

2 రాష్ట్రాలు ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తేగానీ.. వాటిని బోర్డులు తమ పరిధిలోకి తీసుకోలేవు. తెలంగాణ సహాయ నిరాకరణ నేపథ్యంలో నిర్దేశించిన రోజు గురువారం నుంచి (నేటి నుంచి) గెజిట్‌ నోటిఫికేషన్‌ను అమలు చేయలేని పరిస్థితిని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు 2 బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి. కేంద్ర మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి.

ఏపీ రెడీ.. తెలంగాణ నో..
రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత తొలుత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను పూర్తిస్థాయి (15 అవుట్‌లెట్లు)లో బోర్డు పరిధిలోకి తీసుకుంటామని కృష్ణాబోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ మంగళవారం జరిగిన సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. తన భూభాగంలోని ఆరు అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసేందుకు అంగీకరించింది. కానీ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు చేసేవరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను అమలు చేయకూడదంటూ తెలంగాణ సర్కార్‌ పాత పల్లవి అందుకుంది.

ఈ క్రమంలోనే తమ రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు అధికంగా ఉన్నాయని, శ్రీశైలం, సాగర్‌ విద్యుత్‌ కేంద్రాలను బోర్డుకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు, సాగర్‌ విద్యుత్‌ కేంద్రాలను తెలంగాణ సర్కార్‌ బోర్డుకు అప్పగించకపోతే.. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ సర్కార్‌ స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ సర్కార్‌ అనధికారిక నీటి వినియోగాన్ని నియంత్రించినప్పుడే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది.

పెద్దవాగుకు, కృష్ణా ప్రాజెక్టులకు లంకె
ఇక పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేందుకు 2 రాష్ట్రాలు అంగీకరించాయి. దాన్ని గోదావరి బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధమైంది. కానీ తెలంగాణ సర్కార్‌ పెద్దవాగును అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేయడానికి వెనుకడుగు వేస్తోంది. పెద్దవాగును గోదావరి బోర్డుకు అప్పగిస్తే శ్రీశైలం, సాగర్‌లలో 9 అవుట్‌లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది.

కేంద్రం కోర్టులో బంతి
గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు ఏపీ సర్కార్‌ సహకరిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వ దాటవేత వైఖరిని రెండు బోర్డులు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. ప్రత్యేక సమావేశాల్లో చర్చించిన అంశాలను వివరించి.. బోర్డులకు ప్రాజెక్టులను అప్పగించడంపై తెలంగాణ సర్కార్‌ తీరును కేంద్రానికి వివరించాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ప్రత్యేక సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి ప్రాజెక్టులతో గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు ముందడుగు వేసేలా కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top