మణికుమార్ (ఫైల్), పుష్పరాజ్ (ఫైల్)
అన్నమయ్య జిల్లా బండవడ్డిపల్లెలో విషాదం
సంక్రాంతి పండుగ కోసం చెన్నై, బెంగళూరు నుంచి రాక
గరి్నమిట్టలోని మద్యం దుకాణంలో 19 టిన్ బీర్లు కొనుగోలు
నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ శివారులో తాగిన వైనం
అస్వస్థతకు గురవ్వగానే ఆస్పత్రికి తరలింపు.. అప్పటికే మృతి
ఖాళీ బీర్ టిన్నులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు
అది నకిలీ మద్యం కావొచ్చని గ్రామస్తుల అనుమానం.. రాష్ట్రంలో ప్రతి నాలుగైదు మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీదని ఇప్పటికే స్పష్టం
ఆధారాలతో సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ కేంద్రాలు
టీడీపీ నేతల కనుసన్నల్లో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు సరఫరా
తయారీ, పంపిణీ, విక్రయదారులంతా వాళ్లే.. లాభాల్లో నీకింత–నాకింత
నకిలీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న, అనారోగ్యం పాలవుతున్న జనం
తాజాగా 19 టిన్ బీర్లు తాగిన ఆరుగురిలో ఇద్దరు చనిపోవడంపై సర్వత్రా ఇదే అనుమానం
కేవీపల్లె/పీలేరు రూరల్: అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం బండవడ్డిపల్లెలో సంక్రాంతి పండుగ కోసం వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మద్యం తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బండవడ్డిపల్లెకు చెందిన నరసింహులు కుమారుడు ఆవులకుంట మణికుమార్ (32) చెన్నైలో, గోవిందు కుమారుడు వేముల పుష్పరాజ్ (28) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు వీరు స్వగ్రామానికి వచ్చారు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువులైన శ్రావణ్, వేణు, శివమణి, అభిõÙక్‌లతో కలసి శనివారం గ్రామ సమీపంలోని గుట్ట ప్రాంతంలో కూర్చుని మద్యం తాగారు. ఈ క్రమంలో మణికుమార్, పుష్పరాజ్‌లు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం గరి్నమిట్ట పీహెచ్‌సీకి తరలించారు.
ఆసుపత్రి సిబ్బంది సూచన మేరకు అక్కడ నుంచి పీలేరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మణికుమార్ మృతి చెందాడు. పుష్పరాజ్‌ను పీలేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని వారు సూచించారు. అక్కడి నుంచి పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పుష్పరాజ్ మృతి చెందాడు. వారు మద్యం తాగిన ప్రాంతాన్ని కలకడ సీఐ లక్ష్మన్న, కేవీపల్లె, కలకడ ఎస్‌ఐలు వెంకట శివకుమార్, రామాంజులు, పీలేరు ఎక్సైజ్ సీఐ సుబ్బారెడ్డిలు క్షుణ్ణంగా పరిశీలించారు.
మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా, పండుగ సంబరాలకు స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇలా మృతి చెందడంతో బండవడ్డిపల్లెలో విషాదం నెలకొంది. మృతుడు మణికుమార్‌కు భార్య నాగశివరాణి తోపాటు ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఎంబీఏ చదివిన పుష్పరాజ్ గత ప్రభుత్వంలో గ్రామ వలంటీరుగా పనిచేశాడు. తండ్రి గోవిందు కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుష్పరాజ్ మృతితో తల్లి సరోజ జీవనాధారం కోల్పోయింది.
మద్యం టిన్‌లు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు..
అతిగా మద్యం తాగడం వల్లే కేవీపల్లె మండలం బండవడ్డిపల్లెలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి చెందారని అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం పీలేరులోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మణికుమార్, పుష్పరాజ్‌ల సమీప బంధువులైన శ్రావణ్, శివమణి, వేణుగోపాల్, అభిషేక్‌లతో కలసి గరి్నమిట్టలోని మద్యం దుకాణం నుంచి బడ్వైజర్ టిన్ బీర్లు 19 కొనుగోలు చేశారని తెలిపారు. బండవడ్డిపల్లె సమీపంలోని గుట్టలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తాగారన్నారు.
తిరిగి ఇంటికి వచ్చే సమయంలో వారిద్దరూ అస్వస్థతకు గురై మృతి చెందారని చెప్పారు. మణికుమార్ తండ్రి ఆవులకుంట నరసింహులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేశామన్నారు. పీలేరు ఎక్సైజ్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారు తాగిన బీరు ఖాళీ టిన్నులు, మిగిలిన ఆహార పోట్లాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పారు.
ఆ మద్యం అసలైనదేనా?
యువకులు రెండు, మూడు బీర్లు తాగడం మామూలేనని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. బండవడ్డిపల్లె ఘటనలో ఆరుగురు కలిసి 19 టిన్ బీర్లు (ఒక్కో టిన్ 500 ఎంఎల్) తాగారని, అంటే ఒక్కొక్కరు రెండు బీర్లు (బాటిల్) తాగారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వారు తాగింది నకిలీ మద్యం కావొచ్చని గ్రామస్తులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నాలుగైదు మద్యం/బీరు బాటిళ్లలో ఒకటి నకిలీదని ఇప్పటికే బట్టబయలైంది. ఆధారాలతో సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ కేంద్రాలే ఇందుకు నిదర్శనం.
అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం, పాలకొల్లు, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బయట పడటం తెలిసిందే. ఇవన్నీ కూడా అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో కొనసాగాయి. బయట పడనివి ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం/బీరు సరఫరా అవుతోంది.
తయారీ, పంపిణీ, విక్రయదారులంతా వాళ్లే కావడంతో అడిగే వారు లేరు. ప్రభుత్వ పెద్దలు లాభాల్లో నీకింత–నాకింత అంటూ వాటాలు పంచుకుంటూ పై నుంచి భరోసా ఇస్తుండటంతో ఈ దందా వ్యవస్థీకృతమైంది. అందువల్లే నకిలీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న, అనారోగ్యం పాలవుతున్న జనం సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో బండివడ్డిపల్లె ఘటనలో దర్యాప్తు ఎంత వరకు పారదర్శకంగా జరుగుతుందనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఫుడ్ మీదకో నెపం తోసేసి దోషులను తప్పించరని గ్యారంటీ ఏమిటని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


