బాబు ప్రభుత్వ క్షుద్ర రాజకీయానికే బలి | TTD Vigilance Officer Satish Kumar suspicious death | Sakshi
Sakshi News home page

బాబు ప్రభుత్వ క్షుద్ర రాజకీయానికే బలి

Nov 15 2025 5:09 AM | Updated on Nov 15 2025 5:09 AM

TTD Vigilance Officer Satish Kumar suspicious death

టీటీడీ పూర్వ ఏవీఎస్‌వో సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద మృతి

అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించిన పోలీసులు

అందుకు ససేమిరా అన్న సతీశ్‌ కుమార్‌

ఈ నేపథ్యంలోనే పట్టాలపై శవమై కనిపించిన సతీశ్‌ కుమార్‌

ఎవరితోనూ మాట్లాడకుండా ఆయన కుటుంబ సభ్యులను కట్టడి చేసిన పోలీసులు

అనుమానాస్పద మృతిపై అధికారిక ప్రకటన చేయని పోలీసులు

కానీ హత్యేనని ఎల్లో మీడియాకు లీకులు.. టీడీపీ వెబ్‌సైట్‌లో ప్రచారం

రాజకీయ కక్ష సాధింపు కోసం వక్రీకరించే కుట్ర

ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లోనే పోలీసుల యాక్షన్‌

 

సాక్షి, అమరావతి: టీటీడీ పరకామణి కేసులో కూటమి ప్రభుత్వ క్షుద్ర రాజకీయం మరింత వికృతరూపం దాలుస్తోంది. ఈ కేసులో అత్యంత కీల­­మైన అప్పటి టీటీడీ ఏవీఎస్‌వో, ప్రస్తుత జీఆర్పీ సీఐ వై.సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద మృతి కేంద్ర బిందువుగా కూటమి ప్రభుత్వం కొత్త పన్నాగం పన్నుతోంది. ఈ ఉదంతాన్ని రెడ్‌బుక్‌ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకునేందుకు తెగబడుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వా­లని సతీశ్‌ కుమార్‌­ను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా వేధించిన విషయం కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మా­రింది.

ఈ నేపథ్యంలోనే ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడంతో వేళ్లన్నీ ప్రభుత్వ పెద్దలవైపే చూపిస్తున్నాయి. మరోవైపు ఆయన మృతి అనంతరం పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు సందేహాలను మరింత బలపరుస్తోంది. అధికా­రికంగా ఎటువంటి ప్రకటనా చేయకుండా పోలీసు ఉన్నతాధికారులు సతీశ్‌ కుమార్‌ది హత్యేనని ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం. తద్వారా ఈ అంశాన్ని కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులకు అనుగుణంగా వక్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ నేప­థ్యంలో సతీశ్‌ కుమార్‌కు పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు.. ఆయన అనుమానాస్పద మృతిపై పో­లీసుల లీకు రాజకీయాలు కూటమి ప్రభుత్వ కుట్ర­ను బట్టబయలు చేస్తున్న తీరు ఇదిగో ఇలా ఉంది..

కుటుంబ సభ్యులను కట్టడి చేసిన పోలీసులు
వైఎస్సార్‌సీపీ నేతలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వలేనని సతీశ్‌కుమార్‌ తేల్చి­చె­ప్పి­న తరువాత పరిణామాల్లోనే.. ఆయన శుక్ర­వా­రం అనుమానస్పదంగా మృతి చెందడం గమనార్హం.

గుంతకల్‌లో గురువారం అర్ధరాత్రి 12.45 గంట­లకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ సెకండ్‌ ఏసీ బోగీలో రైలు ఎక్కిన సతీశ్‌ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించారు. కాగా ఈ విషయం బయటకు పొక్కగానే పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు సందేహాలను మరింత బలపరుస్తోంది.

ప్రధానంగా సతీశ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులు ఎవరితోనూ మాట్లాడకుండా పోలీసు అధికారు­లు కట్టడి చేశారు. ఆయన నివాసం వద్దకు మీడి­యా ప్రతినిధులు, సమీప బంధువులతోసహా ఇతరులను వెళ్లనివ్వలేదు. సతీశ్‌ కుమార్‌ భార్య ఫోన్‌నూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రికీ ఆమె ఫోన్‌ను తిరిగి ఇవ్వనే లేదు. బాధిత కుటుంబం తమ ఆవేదనను ఎవరితోనూ పంచుకునేందుకు.. ఆయన మృతి­పై తమ సందేహాలను వెల్లడించేందుకూ అవ­కాశం ఇవ్వకుండా పోలీసులు కట్టడి చేయడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

అధికారిక నిర్ధారణ లేకుండా కుట్రపూరిత ప్రచారం
ఇక సతీశ్‌ కుమార్‌ మృత దేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించిన తరు­వా­త పోలీసుల తీరు మరింత సందేహాస్పదంగా మా­రింది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తమ ప్రాథమిక నివేదికలో ఏమని తెలిపారో అధికారికంగా వెల్లడించలేదు. సతీశ్‌ కుమార్‌ మృతికి కారణ­మేమిటన్నది చెప్ప లేదు. కానీ శుక్రవారం రాత్రి 7 గంటల నుంచే ఎల్లో మీడియా ద్వారా తమ కుట్రను బయటపెట్టారు. సతీశ్‌ కుమార్‌ది హత్యేనని లీకులు ఇవ్వడం గమనార్హం. టీడీపీ వెబ్‌సైట్లు, ఇతర సోష­ల్‌ మీడియా వేదికల ద్వారా ఆ విషయాన్ని ప్రచారంలోకి తెచ్చారు.

సతీశ్‌ కుమార్‌ది హత్యేనని టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ శుక్రవారం రాత్రి 7.30గంటలకే పోస్టు చేసింది. ఇక ఈనాడు వెబ్‌సైట్‌లోనూ సతీశ్‌ కుమార్‌ను హత్య చేశారని పేర్కొన్నారు. పోస్టు మార్టం ప్రాథమిక నివేదిక పేర్కొందని కూడా చెప్పడం గమనార్హం. అంటే పోలీసులు అధికారికంగా నిర్ధారించకుండా.. ఇలా టీడీపీ వెబ్‌సైట్లు, ఎల్లో మీడియా ద్వారా కుట్రపూరితంగానే ఓ ప్రచారాన్ని వైరల్‌ చేశారన్నది స్పష్టమవుతోంది.

టీడీపీ కార్యాలయం డైరెక్షన్‌లోనే..
సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద మృతిపై టీడీపీ ప్రధాన కార్యాలయం డైరెక్షన్‌లోనే పోలీసులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేత పట్టాభి శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా నిరాధారణ ఆరోపణలు చేశారు. ఆ ఆరో­పణలను బలపరిచేలానే పోలీసులు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. శుక్ర­వారం సాయంత్రానికే అందుకు అనుగుణంగా పోలీసులు ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. ఆయన తల వెనుక భాగంలో గాయముందని.. పక్కటెముకలు విరిగాయని.. హత్యేనని వైద్యులు ప్రాథమికంగా తెలిపారని లీకులు ఇవ్వడం గమనార్హం. టీడీపీ వెబ్‌సైట్, ఆ పార్టీ సోషల్‌ మీడియాలో అదే విషయాన్ని వైరల్‌ చేశాయి.

కక్ష సాధింపు కోసమే పన్నాగం..
సతీశ్‌ కుమార్‌ది హత్యేనని పోస్టు మార్టం ప్రాథమిక నివేదిక వెల్లడిస్తే.. ఆ విషయాన్ని పోలీసులు అధి­కా­రికంగానే వెల్లడించవచ్చు. అందుకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ పోలీసులు అలా చేయ­లేదు. కేవలం ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. సతీశ్‌ కుమార్‌ది హత్యే అయితే... ఎవరిపై అక్రమ కేసు నమోదు చేయాలా అని ప్రభుత్వ తుది ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. లేదా.. హత్యకు కారకులైన టీడీపీ వర్గీయులను కేసు నుంచి తప్పించేందుకే కాలయాపన చేస్తూ ఉండవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

ఏది ఏమైనా సరే సతీశ్‌ కుమార్‌ మృతి వెనుక అసలు విషయాన్ని కప్పి­పుచ్చి.. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రకు వాడుకో­వాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఉందన్నది స్పష్టమవు­తోంది. అందుకు ప్రభుత్వ పెద్దల స్క్రిప్ట్‌ను అమలు చేయడమే తమ కర్తవ్యంగా పోలీసు ఉన్నతాధికా­రు­లు వ్యవహరిస్తున్నారు. కాగా పోలీసు అధికారి మృతి­పై ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలకు పాల్ప­డుతుండటంపై పోలీసు వర్గాలు మండిపడుతున్నా­యి.

అబద్ధపు వాంగ్మూలం కోసం సతీశ్‌ కుమార్‌ను తీవ్రంగా వేధించడంపైనే పోలీసు వర్గాలను ఆవేద­నకు గురి చేసింది. కాగా ప్రస్తుతం ఆయన అనుమా­నాస్పద మృతి వెనుక వాస్తవాలను వెల్లడించకుండా కక్ష సాధింపు కోసం వక్రీకరించేందుకు యత్నిస్తున్నా­రని పోలీసువర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వేళ్లన్నీ ప్రభుత్వ పెద్దల వైపే..
అబద్ధపు వాంగ్మూలం కోసం వేధింపులు
అందుకు సతీశ్‌ కుమార్‌ ససేమిరా
ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద మృతి

టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పరకామణి కేసు దర్యాప్తును వక్రీకరించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్కెచ్‌ వేశారు. వైఎస్సార్‌సీపీ కీలక నేతలను అక్రమ కేసులో ఇరికించి వేధించేందుకు పక్కా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే టీడీపీ వీర విధేయ సీఐడీ అధికారు­లను రంగంలోకి దించారు. డీజీపీ కార్యాలయం పర్యవేక్షణలో ఈ అక్రమ కేసు దర్యాప్తు కుట్ర కార్యాచరణను వేగవంతం చేశారు. కానీ వైఎస్సార్‌­సీపీ నేతలపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ప్రాథమిక ఆధారాలు కూడా లభించలేదు. దీంతో సీఐడీ, పోలీసు అధికారులు టీటీడీ పూర్వ ఏవీఎస్‌వో సతీశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు చెప్పాలని ఆయన్ని వేధించారు.

తాము చెప్పినట్టుగా సీఆర్‌పీసీ 161, 164 వాంగ్మూలాలు ఇవ్వాలని తీవ్రంగా బెదిరించారు. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డితోపాటు మరి కొందరి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. వారు చెబితేనే తాను ఈ కేసులో లోకాయుక్త ఎదుట హాజరై రాజీ ప్రక్రియను పూర్తి చేసినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. సతీశ్‌ కుమార్‌ ద్వారా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేస్తే.. దాన్ని బట్టి అప్పటి తిరుపతి ఎస్పీగా ఉన్న పర­మేశ్వర్‌రెడ్డి, మరికొందరు పోలీసు అధికారుల నుంచి అదే రీతిలో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలన్నది పోలీసు ఉన్నతాధి­కారుల ఉద్దేశం. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ కేసులో ఇరికించి... జైలు పాలు చేస్తామని కూడా సతీశ్‌ కుమార్‌ను బెదిరించినట్టు తెలుస్తోంది.

పోలీసు ప్రధాన కా­ర్యా­లయ అధికారులతోపాటు, విజయవాడ పో­లీసు ఉన్నతాధికారులతోనూ సతీష్‌కుమార్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. సామాజిక­వర్గ కోణంలో విజయవాడలోని ఓ పోలీసు అధికారి ద్వారా సతీశ్‌కుమార్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు యత్నించినట్టు తాజాగా వెలు­గు చూసింది. సతీశ్‌ కుమార్‌ సామాజికవర్గానికి చెందిన అధికారితో మాట్లాడించి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. మనం మనం ఒకటి కాబట్టి చెబు­తున్నా.. పోలీసు బాస్‌లు చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పించినట్టు సమాచారం. అంతే­కాదు సతీష్‌ కుమార్‌ను విచారిస్తున్న సమయంలో లక్ష్మణరావు అనే ప్రైవేటు వ్యక్తి(రౌడీ)ని ప్రవేశపెట్టడం గమనార్హం.

లక్ష్మణరావు చేత సతీశ్‌కుమార్‌ను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించినట్టు సమాచారం. సహచర పోలీసు అధికారుల సమక్షంలో ఓ పోలీసు అధికారిని ఓ ప్రైవేటు వ్యక్తి పరుషపదజాలంతో దూషించడం... బెదిరించడం.. అంతు చూస్తామని వేధించడం ఏమిటనే విభ్రాంతి పోలీసుశాఖలో వ్యక్తమవుతోంది. ఈ నెల 6న ఓసారి ఆయన్ని సీఐడీ అధికారులు విచారించారు. కాగా ఆయన్ని శనివారం విచారణకు రావాలని తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ పరిణామాలతో సతీశ్‌ కుమార్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యారని, రాజకీయ కుట్రలో పావుగా మారి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడానికి ఆయన మనస్సాక్షి అంగీ­కరించ లేదని సమాచారం. తాను అబద్ధపు వాంగ్మూలం ఇవ్వలేనని ఆయన సీఐడీ అధికారులకు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పదంగా మృతి చెందడంతో వేళ్లన్నీ ప్రభుత్వ పెద్దలవైపే చూపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement