
పాలకమండలి సమావేశంలో మూడో కాంప్లెక్స్ నిర్ణయం ఎందుకు?
బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి టీటీడీలో అన్నీ అపచారాలే
క్యూలైన్లలో భక్తులు ఏకరువు పెడుతున్న అవస్థలను పట్టించుకోండి
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం: సినిమాలలో ఏఐ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో గ్రాఫిక్స్ చేసినట్లుగా తిరుమలలో ఎంతమంది భక్తులు వచ్చినా రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తామంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పే మాటలు సాధ్యమేనా? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. సోమవారం సోమవారం తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఇదే అంశంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇది సాధ్యం కాదన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. వెంటనే బీఆర్ నాయుడు స్పందిస్తూ గూగుల్, టీసీఎస్ సహకారంతో ఏఐ ద్వారా భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. ముందుచూపుతో ఆలోచన చేస్తున్నామన్న ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్ప ఏఐతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం అనేది అసాధ్యం.
గూగుల్, టీసీఎస్ సహకారంతో తిరుమలలో ఏఐ టెక్నాలజీని తేవాలనుకుంటున్న చైర్మన్.. ఆ కంపెనీల వారికి టీటీడీ గెస్ట్‌హౌస్‌లు, తిరిగేందుకు కార్లను ఏర్పాటు చేయడం ఏమిటి? క్యూలైన్లలో కనీస వసతులు లేక భక్తులు పడుతున్న అవస్థలు కనిపించడం లేదా? ఏఐతో శ్రీవారి దర్శనం కల్పించడాన్ని భక్తులు హర్షించరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.
భక్తుల రద్దీ పెరిగిందని, మూడో క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు అవసరమని ఇటీవల పాలకమండలి సమావేశంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. శ్రీవారి భక్తులు, సనాతన ధర్మ పరిరక్షకులైన పీఠాధిపతుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ నాయుడు ఆలోచనలు, చర్యలు ఉన్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బాధ్యతలు చేపట్టాక.. 9 నెలల నుంచి టీటీడీలో అన్నీ అపచారాలే చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీకి ఆపాదిస్తారా?
టీటీడీలో చోటు చేసుకుంటున్న అపచారాలను, విషయాలను ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వాటిని వైఎస్సార్‌సీపీకి ఆపాదిస్తూ మీ మీడియాల్లో ప్రచారం చేసుకుంటే ఉపయోగం లేదని భూమన పేర్కొన్నారు. ఇప్పటికైనా వాస్తవాన్ని శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోవాలని సూచించారు. ఉన్న పరిమితుల్లో అవగాహన చేసుకుని భక్తులకు మెరుగైన సేవలందించేందుకు ఆలోచనలు చేయాలని కోరారు.