సాక్షి, తిరుమల: కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమలలో మరో అపచారం జరిగింది. తిరుమల నడకదారిలో మరోసారి మహాపచార ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల ప్రకారం.. పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత.. మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తిన్నారు. ఈ సందర్బంగా కాలినడకన వెళ్తున్న భక్తులు వారిని ఈ అపచారంపై ప్రశ్నించగా.. సదరు సిబ్బంది భక్తులని బెదిరింపులకు గురిచేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో ఘటన జరగడంతో భక్తులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

ఎట్టకేలకు ఈ ఘటనపై టీటీడీ స్పందిస్తూ..‘టీటీడీ ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే రామస్వామి, సరసమ్మ అనే ఉద్యోగులు నిన్న అలిపిరి వద్ద మాంసాహారం తిన్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రామస్వామి, సరసమ్మ అనే ఇద్దరు ఉద్యోగులపై తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించినట్టు తెలిపింది.


