
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణానికి ముందురోజు చేపట్టే అంకురార్పణను మంగళవారం ఆలయ సన్నిధిలో సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు.
తొలుత ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి పుట్ట మన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసే క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. ఇందుకు అవసరమైన దర్భచాప, తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి చేర్చారు.
భక్తుల రద్దీ ఇలా..
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా కనిపించడం లేదు. నిన్న 22-09-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 60,681 మంది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 19,510 మంది. స్వామివారి హుండి ఆదాయం రూ.4.06 కోట్లు. ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి.. సుమారు 8 గంటల, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి.. సుమారు 4 గంటల సమయం, అలాగే.. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.