
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదం కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట లిస్టు చేయాలని జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారంలో సిట్ రాజకీయ ప్రేరేపిత దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించేందుకు.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నేరుగా నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం(జులై 14) ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ..
సిట్ పని విధానంపై స్టేటస్ కో కొనసాగించాలి. సిట్ సేకరించిన రికార్డులన్నీ పరిశీలించాలి. సిట్‌కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నిర్దేశించాలి. సిట్ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి. దర్యాప్తు సమయంలో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తోపాటు అడ్వకేటును అనుమతించాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి అని కోర్టును కోరారు.
పిటిషన్‌లో ఏముందంటే..
తిరుమల లడ్డు కేసులో సిట్ రాజకీయ కక్షతో, దురుద్దేశంతో దర్యాప్తు జరుపుతోంది. కదురు చిన్నప్పన్న నుంచి బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ కు అనుగుణంగా స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. నన్ను, మాజీ ఈవోను ఈ కేసులో ఇరికించి.. అరెస్టు చేసే విధంగా బలవంతంగా సాక్షాలను చెప్పిస్తున్నారు.
సిట్ పారదర్శకంగా పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ కేసులో కదురు చిన్నప్పన్నను భయపెట్టి బలవంతపు స్టేట్మెంట్లు తీసుకుంటున్నది. ఆయన ఆస్తులను జప్తు చేస్తామని భయపెడుతోంది. రాజకీయ జోక్యంతో సిట్ దర్యాప్తు గాడి తప్పింది. రాజకీయాల కతీతంగా దర్యాప్తు జరపాల్సిన సిట్ వాటికి తిలోదకాలు ఇచ్చింది
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మితిమీరిన జోక్యంతో సిట్ దర్యాప్తుపై ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. సిట్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. సిట్ కాంపోజిషన్ లో బ్యాలెన్స్ తప్పింది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుండడంతో సెలెక్టివ్ గా విచారణ చేసి, అనేక అంశాలను తొక్కి పెడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిట్ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలి.