
వివాదాలకు నిలయంగా తిరుమల
టీటీడీ చైర్మన్ వ్యవహారశైలితో అప్రతిష్ట
అక్రమాలకు ని‘దర్శనాలెన్నో’..!
ప్రత్యర్థులపైకి సొంత చానెల్ ద్వారా బురద
ఏఐ జపంతో ఈవోతోనూ ముదిరిన విభేదాలు
సీఎంకు తలనొప్పిగా మారిన బీఆర్ నాయుడు తీరు
సాక్షి టాస్క్ ఫోర్స్: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, దేవదేవుడు, భక్తవత్సలుడు శ్రీ వేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం తిరుమల ప్రస్తుతం రాజకీయ వైకుంఠపాళికి నిలయమైంది. వివాదాలకు కేంద్రబిందువైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలి దివ్యక్షేత్ర ప్రతిష్టను మసకబారుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిననాటి నుంచి అక్రమాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. దీనికి నిదర్శనాలెన్నో.. ఎన్నెన్నో..
ఆరుగురిని బలిగొన్న నిర్లక్ష్యం
ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనిలో టీటీడీ చైర్మన్, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏకాదశికి భారీగా ప్రజలు తరలివస్తారన్న సమాచారం ఉందని, అయితే అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని ఆనక తాపీగా ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయంలో తమ వైఫల్యం ఉందనే విషయం చెప్పకనే చెప్పేశారు.
నిందను అధికారులపై నెట్టబోయి తాను తీసిన గోతిలో తానే పడ్డారు. అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత తనదేనని మరిచిపోయారు. కనీసం తన వల్ల తప్పు జరిగిందని, క్షమాపణలు చెప్పడానికీ ఆయనకు నోరు రాలేదు. పైగా క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ ఆయన దురుసుగా వ్యాఖ్యానించిన తీరు అప్పట్లో వివాదాస్పదమైంది.
శ్రీవాణి ట్రస్టు రద్దుకు కుటిలయత్నాలు
దేశవిదేశాల్లోని శ్రీవారి ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టు ద్వారా గొప్ప కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే గత ఎన్నికల్లో దీనిపై టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు తీవ్ర ఆరోపణలు చేశారు. అబద్ధాలు వల్లెవేశారు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే టివీ5 చైర్మన్ బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్‌గా నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టడానికి ముందే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తానని ప్రకటించాడు.. చంద్రబాబు మనసులోని మాటను తన నోటితో పలికారు.
శ్రీవాణి ట్రస్ట్ పై విజిలెన్స్ విచారణ కూడా జరిపించారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు లేవని తేలడంతో తోకముడిచారు. కొంతకాలం శ్రీవాణి ట్రస్ట్ పేరు మారుస్తామని ప్రగల్భాలు పలికి అదీ చేయలేకపోయారు. శ్రీవాణి ట్రస్ట్ తక్కువ సమయంలో భక్తుల మన్ననలు, ఆదరణ పొందడమే దీనికి కారణం. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభమైంది కాబట్టే శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలనే బీఆర్‌నాయుడు, కూటమి పాలకులు కుటిలయత్నాలకు పాల్పడి చతికిలపడ్డారు.
దళారులకు నిలయంగా చైర్మన్ కార్యాలయం
టీటీడీ చైర్మన్ కార్యాలయం దళారులకు నిలయంగా మారింది. నిత్యం ఇక్కడ దర్శన టికెట్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వేలసంఖ్యలో వీఐపీ దర్శనాల మంజూరే దీనికి నిదర్శనం. గతంలో 3 వేల వరకు మాత్రమే వీఐపీ దర్శనాలు కేటాయించేవారు. ఇప్పుడు 7 వేల వరకు మంజూరు చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు తాజాగా ఉదయం, సాయంత్రం రెండుపూటలా వీఐపీ దర్శనాలు కొనసాగించాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయంతో సామాన్య భక్తుల పాలిట అశనిపాతంగా మారింది.
ఈ నిర్ణయం వల్ల రోజూ పదివేల మంది సామాన్య భక్తులు దర్శనానికి దూరమవుతారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ అసంబద్ధ నిర్ణయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే సొంత చానల్‌లో చెత్త రాతలు రాయించి ప్రత్యర్థులపై బురదచల్లి బెదిరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు ఎలా చైర్మన్‌ను చేశారని, అతని వ్యవహారశైలి వల్ల టీటీడీ ప్రతిష్ట మసకబారుతోందని సామాన్య భక్తులూ ఆవేదన చెందుతున్నారు.
దోపిడీకి కొత్తగా ఏఐ జపం
సామాన్య భక్తులకు గంటలో దర్శనం చేయిస్తానని చైర్మన్ అయిన కొత్తలో ప్రగల్భాలు పలికిన బీఆర్‌నాయుడు ఆ తర్వాత ఆ హామీని గాలికొదిలేశారు. సంపన్నుల సేవలో తరించారు. ఇప్పుడు టీటీడీ ధనాన్ని దోచుకోవడానికి ఏఐ టెక్నాలజీ జపం చేస్తున్నారు. దీనివల్ల మూడు గంటల్లో సామాన్య భక్తులు దర్శనం చేయించుకోవచ్చని కోతలు కోస్తున్నారు. ఇది ఆచరణలో సాధ్యం కాదని తెలిసినా అదే జపం చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ పేరుతో ఐటీ కంపెనీలకు టీటీడీ సొమ్మును దోచి పెట్టడానికే ఈ ఎత్తుగడ అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈవో, చైర్మన్ మధ్య విభేదాలు
ఏఐ టెక్నాలజీ విషయంలో ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆచరణలో ఏఐ టెక్నాలజీ సాధ్యం కాదని శ్యామలరావు దానిని అడ్డుకోవడంతో చైర్మన్ తన ఎల్లో చానెల్ ద్వారా ఈఓపై బురద జల్లే యత్నం చేశారు. వీరి మధ్య వివాదం చిలికిచిలికిగాలివానలా మారి పంచాయితీ సీఎం వద్దకు చేరింది.
బీఆర్ నాయుడు తీరు సీఎం చంద్రబాబుకూ తలనొప్పిగా మారింది. బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత టీటీడీ ప్రతిష్ట పాతాళానికి పడిపోయిందనే నివేదికలు సీఎం వద్ద అప్పటికే ఉండడంతో అతడిని ఎందుకు టీటీడీ చైర్మన్‌గా చేశానా అని చంద్రబాబు తల పట్టుకుంటున్నారని సమాచారం.