బుట్టాయిగూడెం: ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తోంది. నిన్న(బుధవారం) రాత్రి రెండు ఆవులు, ఒక దూడపై దాడి చేసి చంపేసింది పెద్ద పులి.. తొలుత అంతర్వేదిగూడెంలో ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత నాగులగూడెం సమీపంలో మరో ఆవు దూడపై దాడి చేసింది పెద్ద పులి. దాంతో ఆ ఆవు దూడ మృత్యువాత పడింది.
ఈ నేపథ్యంలో బుట్టాయిగూడెం మండలంలో ప్రజలు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. ఏ క్షణాన పులి దాడి చేస్తుందోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మరొకవైపు పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్ లో పులి పాదముద్రలు గుర్తించారు. పులి సంచారంతో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఆంధ్రా, తెలంగాణలో పెద్దపులులు, చిరుతలు తరచూ జనావాసాల్లోకి రావడం వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పంట పొలాలు, పశువుల పాకలు, రహదారులపై వీటి సంచారం ఎక్కువగా కనిపిస్తోంది.
గండ్రెడ్డిపల్లి నుంచి మంచిర్యాల వరకు, కామారెడ్డి నుంచి రాజన్న సిరిసిల్ల వరకు పెద్దపులులు, చిరుతలు గ్రామాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.పొలాల్లో పనులు చేయడానికి రైతులు వెనకాడుతున్నారు. పశువులను అడవుల్లో మేపడానికి పశుపోషకులు జంకుతున్నారు. వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్, నల్లమల అటవీ ప్రాంతాల సమీప గ్రామాల్లో నీరు, ఆహారం కోసం వన్యప్రాణులు తరచూ వస్తున్నాయి.


