ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఏలూరు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ నాయకులను పరిశీలకులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు పార్టీని క్షేత్రస్థాయి నుంచీ బలోపేతం చేస్తూనే మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తూ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబును కై కలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమించారు. అలాగే ఏలూరు నగరానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్‌కు చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుని బాధ్యతలు అప్పగించారు. మరోవైపు చింతలపూడి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బీవీ చౌదరికి మెట్ట ప్రాంతంలో ప్రాముఖ్యమైన పోలవరం నియోజకవర్గ పరిశీలకుడిగా, దెందులూరు ప్రాంతానికి చెందిన డొప్పాలపూడి వెంకట రామకృష్ణ చౌదరి (డీవీఆర్‌కే)ను జిల్లా కేంద్రం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


