ఏలూరు (టూటౌన్): జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల రాజీతో సమయం, డబ్బు ఆదా అవుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. జాతీయ న్యాయ సేవాదికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరులో నిర్వహించిన ప్రారంభ సభలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 8,815 కేసులు రాజీ కాగా, అందులో 111 ప్రీ లిటిగేషన్ కేసులు, 147 మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, 166 సివిల్, 94 చెక్‌బౌన్స్ కేసులు, 36 కుటుంబ వివాదాల కేసులు, 8,261 క్రిమినల్, ఇతర కేసులను రాజీ చేశారు. వాహన ప్రమాద బీమా కేసుల్లో రూ.6 కోట్లు పైబడి పరిహారంగా చెల్లించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, ఐదో అదనపు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్.మురళీకృష్ణ, ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కొనే సీతారాం, పీపీ ఏవీ నారాయణ, ప్రభుత్వ న్యాయవాది సుబ్రహ్మణ్యం, లోక్ అదాలత్ సభ్యులు తమ్మినేని విజయకుమార్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


