పచ్చని పొలాల మధ్య ఆయుధ డిపో వద్దు | - | Sakshi
Sakshi News home page

పచ్చని పొలాల మధ్య ఆయుధ డిపో వద్దు

Mar 15 2026 1:20 AM | Updated on Mar 15 2026 1:20 AM

పచ్చని పొలాల మధ్య ఆయుధ డిపో వద్దు ఇంటర్‌ పరీక్షలకు 2,810 మంది హాజరు 16 నుంచి అభ్యంతరాల స్వీకరణ పది పరీక్షలకు సర్వం సిద్ధం

కొయ్యలగూడెం: పచ్చని పంటలు పండే వ్యవసాయ భూముల్లో ఆయుధ డిపో ఏర్పాటు చేసి ప్రజల జీవితాల్లో చిచ్చు పెట్టవద్దని సీపీఐ మండల కన్వీనర్‌ తాడిగడప ఆంజనేయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం మంగపతిదేవిపేట, బోడిగూడెం గ్రామాల ప్రజలతో కలసి వ్యవసాయ పొలాల్లో డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. రెండు పంటలు పండే సారవంతమైన వ్యవసాయ భూముల్లో ప్రమాదకరమైన నేవీ డిపో ఏర్పాటు చేయాలనుకోవడం అన్యాయం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన తమ గ్రామాల ప్రజలను రోడ్డుపాలు చేస్తుంది అన్నారు. తాజాగా ప్రజాప్రతినిధులు రైతుల్లో విభేదాలు సృష్టిస్తూ డిపో వ్యతిరేక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుతంత్రాలు పన్నారన్నారు. అసలు భూమిలేని రైతులతో తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారన్నారు. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ భూములను లాక్కోవద్దని కోరారు. కార్యక్రమంలో బోడిగూడెం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా శనివారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన సివిక్స్‌–1, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్‌–1 పరీక్షలకు మొత్తం 2,810 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు జనరల్‌ విద్యార్థులు 3,172 మందికి గాను 2,810 మంది విద్యార్థులు హాజరు కాగా 362 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, మాల్‌ ప్రాక్టీస్‌ కేసులూ నమోదు కాలేదని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే. యోహాన్‌ తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వం ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ నెల 16 నుంచి 21వ తేదీ లోపు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా గతంలో రూపొందించిన జాబితాపై మొదట విడత అభ్యంతరాలను తీసుకోని వాటిని సరిచేశామన్నారు. సరిచేసిన జాబితాలు సంబంధిత పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో, నోటీసు బోర్డుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. నిర్థిస్టమైన గడువు తరువాత వచ్చిన వినతులు స్వీకరించబడవని, ఇదే చివరి అవకాశముగా భావించాలని డీఈవో తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సోమవారం నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 133 కేంద్రాల్లో 24,019 విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్య పదో తరగతి పరీక్షలకు ఏర్పాటుచేశామని, 803 మంది విద్యార్థులకు గాను 11 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా 94913 95377 నంబరులో తెలియజేయాలన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునన్నారు. స్టోరేజీ పాయింట్స్‌ 31, పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు 133, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు 133, అదనపు డిపార్ట్‌మెంటల్‌ అధికారులు 02, ఫ్లయింగు స్క్వాడ్లు 06, సీ సెంటరు రూటు ఆఫీసర్లు 20 మందిని నియమించామని తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమిషనరు ఆర్‌.ఆశ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement